పటేల్ చొరవతో హైదరాబాద్ స్టేట్‌కు విముక్తి

– నెహ్రూ స్వార్థ విధానాలతో అగ్నిగుండమైన కశ్మీర్
– మొదటి ఓటు చోరీ పటేల్‌కు వ్యతిరేకంగా, నెహ్రూకు అనుకూలంగా..
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో కాంగ్రెస్ పార్టీలోని మెజారిటీ సభ్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ మొదటి ప్రధానమంత్రి కావాలని సంపూర్ణ మద్దతు ప్రకటించారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. అయితే నాటి నెహ్రూ కుటుంబం అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాలరాసి మొదటి ‘ఓటు చోరీ’కి పాల్పడి ఏమాత్రం ప్రజా మద్దతు లేని నెహ్రూను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టిందని విమర్శించారు. ఒకవేళ ఆనాడే పటేల్ ప్రధాని అయి ఉంటే దేశ రూపురేఖలు, ముఖచిత్రం పూర్తిగా మారిపోయేవని, దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు శాశ్వత పరిష్కారం దక్కేదని పేర్కొన్నారు. భారత దేశ ఉక్కు మనిషి, అఖండ భారత నిర్మాత సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి (రాష్ట్రీయ ఏక్తా దివస్) కార్యక్రమం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో కిష‌న్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని అధికారికంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ పేరుతో దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో, గ్రామగ్రామాన బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జవహర్‌లాల్ నెహ్రూ లోపాయికారీ ఒప్పందాలు, స్వార్థ రాజకీయ విధానాల వల్ల సంస్థానాల విలీన ప్రక్రియలో తీవ్ర గందరగోళం ఏర్పడిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. నాటి హోంమంత్రి సర్దార్ పటేల్ స్వతంత్రంగా, సాహసోపేత నిర్ణయాలు తీసుకుని 550కి పైగా సంస్థానాలను విజయవంతంగా భారత్‌లో విలీనం చేసి అఖండ భారతాన్ని ఆవిష్కరించారని కొనియాడారు. హైదరాబాద్ సంస్థానంపై నిజాం ప్రైవేట్ సైన్యం రజాకార్లు అత్యాచారాలకు ఒడిగడుతూ, దోపిడీలకు పాల్పడుతుంటే సర్దార్ పటేల్ ‘ఆపరేషన్ పోలో’ ద్వారా నిజాంను లొంగదీసుకుని ఇక్కడ మువ్వన్నెల జెండాను ఎగురవేశారని గురు ్తచేశారు. మరోవైపు జమ్ము కశ్మీర్‌లో నెహ్రూ చారిత్రక తప్పిదాల వల్ల సరిహద్దు ఉగ్రవాదం, యుద్ధాలు చెలరేగి సుమారు 46 వేల మంది అమాయక పౌరులు, జవాన్లు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ప్రేరేపిత నకిలీ నోట్లు, ఆయుధాల అక్రమ రవాణా, రక్తపాతానికి నెహ్రూ విధానాలే కారణమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దృఢ సంకల్పంతో ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్‌లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేసి పటేల్ కన్న కలలను సాకారం చేశారని కొనియాడారు. బార్డోలీ సత్యాగ్రహంలో రైతు పక్షపాతిగా పోరాడి ‘సర్దార’ బిరుదు పొందిన పటేల్ చరిత్రను దేశ రైతాంగం, యువత గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలోని ఓటు బ్యాంకు రాజకీయాలు, బుజ్జగింపు విధానాలు, అవినీతి, కుటుంబ పాలన తీరును నేటి యువత తెలుసుకోవాలని, సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశభక్తి, జాతీయ సమైక్యతా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.

ఎంజే మార్కెట్ ప్రాంతంలో బీజేపీ నేతల పరిశీలన 

కాగా, అసెంబ్లీ వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం నవంబర్ 2న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుండి జరగనున్న బీజేపీ మహా పాదయాత్ర ఎంజె మార్కెట్ వద్ద ముగియనున్న సందర్భంగా ఎంజె మార్కెట్ వద్ద పరిస్థితులను రామచందర్ రావు, కిషన్ రెడ్డి, ఇతర నేతలు పోలీసు అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్.గౌతం రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కర్ణాటక సహ ఇన్‌చార్జి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జి ఎన్.వి.సుభాష్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాహుల్ సరిదెన, సీనియర్ నాయకుడు చింతల రామచంద్రారెడ్డి, తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *