– సీఎస్ సంజయ్ జాజు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : కోర్ అర్బన్ ప్రాంతంలో గ్రీన్ ట్యాంకర్ల కార్యక్రమాన్ని నవంబర్ 1 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వె డించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు వాటి సుస్థిర నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. కోర్ అర్బన్ ప్రాంతానికి సంబంధించి తాగునీటి సరఫరా పరిస్థితిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనులు, ల్యాండ్‌స్కేపింగ్, శుభ్రత పనులు, ఇతర తాగునీటితో సంబంధం లేని అవసరాల కోసం అన్ని ప్రభుత్వ శాఖలు శుద్ధి చేసిన నీటిని వినియోగించాలని ఆదేశించారు. మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) ద్వారా సరఫరా చేస్తున్న శుద్ధి చేసిన నీటి నాణ్యతను నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు. శుద్ధి చేసిన నీటిని ఎంత పరిమాణంలో రవాణా చేసి సరఫరా చేస్తున్నారో రోజువారీ వివరాలను సమర్పించాలని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ మేనేజింగ్ డైరెక్టర్‌ను ఆదేశించారు. ఎండీ అశోక్ రెడ్డి తాగునీటి అవసరాల కోసం రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికను వివరించారు. మిషన్ భగీరథ కింద అదనంగా 40 ఎంజీడీ నీటిని సరఫరా చేసే పథకాన్ని నవంబర్ 15నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అలాగే జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనమైన అన్ని పట్టణ స్థానిక సంస్థలకు వచ్చే ఏడాది ఆగస్టు వరకు మిషన్ భగీరథ ద్వారా బల్క్ వాటర్ సరఫరా కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న తాగునీటి ట్యాంకర్ల సేవల తరహాలోనే డిమాండ్ మేరకు గ్రీన్ ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన నీటిని కూడా వాటర్ బోర్డు సరఫరా చేయనుందని, వినియోగదారులు సులభంగా ఈ సేవలను పొందేందుకు ప్రత్యేక అప్లికేషన్ ద్వారా కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. నీటి పొదుపు చర్యల్లో భాగంగా అవగాహన కార్యక్రమాలు, నీటి సంరక్షణ చర్యల ద్వారా వ్యక్తులు, సంస్థలు, పరిశ్రమల స్థాయిలో నీటి వినియోగాన్ని 20 శాతం తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన వివరించారు. సమావేశంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎంఏ అండ్ యూడీ కార్యదర్శి సర్ఫరాజ్ అహ్మద్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





