ఆదిమ సంస్కృతిపై ఆంక్షలా? ఆద్య కళకు చేయూత ఇవ్వండి

‘ఆద్యకళ’లో భద్రపరిచిన వస్తువులు ఈ నేల ప్రజల ఆత్మగౌరవ చిహ్నాలు. దిల్లీ రాష్ట్రపతి భవన్‌లోని ‘జనజాతి దర్పణ్’ నుండి ప్యారిస్, లండన్ వరకు ప్రదర్శితమై అంతర్జాతీయ కీర్తిని పొందిన ఈ కళాఖండాలను గౌరవించాలి.ఏళ్ల తరబడి సాగుతున్న ఈ సమస్యకు స్వస్తి పలికి, ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన స్థలాన్ని కేటాయించి, ‘ఆద్యకళ’కు శాశ్వత మ్యూజియం ఏర్పాటు చేయాలి..

ఆద్య కళ…
రేపటి సాంస్కృతిక పునరుజ్జీవన వారధి!
భావితరాల వారసత్వపు నిధి!!


శ్రామిక కళలు, కళల ప్రతిరూపాలు,సంస్కృతి, క్రమంగా అంతరించిపోతున్నాయి. ఆధునిక సాంకేతిక విప్లవం ఊపందుకుంటున్న నేటి డిజిటల్ యుగంలో, వేగవంతమైన మార్పుల నడుమ గిరిజన కళలను, ప్రాచీన సంప్రదాయాలను రక్షించడం అనేక సవాళ్లతో కూడుకున్న పని. ప్రఖ్యాత జానపద సిద్ధాంత పరిశోధకుడు ఆచార్య జయధీర్ తిరుమలరావు గారు ఈ సాంస్కృతిక వైభవానికి పట్టం గడుతూ, ” ఆద్యకళ ” పేరుతో శ్రమిస్తున్న తీరు అసామాన్యమైనది.

జయధీర్ తిరుమలరావు గారి కృషి

ప్రస్తుతం ఆదివాసీ ప్రాచీన కళలు, వాటి సంస్కృతి అంతరించిపోతున్నది.విలుప్తమవుతున్న ప్రాచీన తెగల వాద్యపరికరాలను పరిరక్షిస్తూ..సాక్షాలతో నిరూపిస్తూ..ఒక మ్యూజియం ఏర్పాటు చేసి విస్తృతమైన పరిశోధనలతో ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు గారు దశాబ్దాల కాలం నుండి కృషి చేస్తున్నారు.కృషిలో భాగంగా గత కొన్నేళ్లుగా సేకరించిన వేలాది వస్తువులతో వివిధ కేంద్రాలలో పురావస్తు ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.

ఆదివాసీ సంప్రదాయాలకు ప్రతిరూపాలైన కికిరి, కింగ్రి, రొంజ, తుడుము, కొమ్ము, గుమ్మెట, తుతురా, పిల్లనగోవి వంటి వివిధ సంగీత వాయిద్యాలను సేకరించారు. వీటితోపాటు పటచిత్రాలు, చెక్క శిల్పాలు, వేట పరికరాలు, ఆభరణాలు, దుస్తులు వంటి అరుదైన కళారూపాలను భద్రపరిచారు. అంతేకాక శతాబ్దాల నాటి ప్రాచీన తాళపత్ర గ్రంథాలు, చేతిరాత ప్రతులు, కాగితపు చుట్టలను కూడా సమీకరించారు.జయధీర్ తిరుమల రావు గారు సేకరించిన ఈ వస్తువులు ఆదివాసీల జీవన విధానం, సాంస్కృతిక వైభవం, వారి సంగీత పరిజ్ఞానానికి సాక్ష్యాలుగా నిలుస్తాయి.

 విశ్వవిద్యాలయ సంకల్పాన్ని దాటిన కృషి

1983లో అకాడమిల కార్యక్రమాలన్నింటినీ ఒక దగ్గరికి తీసుకువస్తూ అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు గారు ‘తెలుగు విజ్ఞాన పీఠం’ పేరుతో కళాపీఠాన్ని స్థాపించారు. 1985లో ‘తెలుగు విజ్ఞాన పీఠం’ను ‘తెలుగు విశ్వవిద్యాలయం’గా మార్చారు. ప్రాచీన కళా సంపద అంతరించిపోకుండా తెలుగు విశ్వవిద్యాలయం వేదికగా కృషి జరగాలనేది ప్రభుత్వ ఆశయం.

ఆనాటి ప్రభుత్వం లేదా వ్యవస్థ ఆశించినదాని కంటే జయధీర్ తిరుమలరావు గారి కృషి ఎంతో మిన్నగా, అభినందనీయంగా నిలిచింది.. విశ్వవిద్యాలయ పరిధులను దాటి సమాజంలోకి వెళ్లారు. మూలాల సంస్కృతిని కాపాడటానికి ఆయన రాత్రింబవళ్లు పడిన శ్రమ అసమానమైనది. కళా సంపదను సేకరించి భద్రపరచడం ద్వారా ఆయన ఒక వ్యక్తిగా కాక, ఒక వ్యవస్థగా పనిచేసి సంస్కృతి పరిరక్షణలో తన వంతు చారిత్రాత్మక పాత్రను పోషించారు.

 మారిన పరిస్థితులు – ఆంక్షలు

విస్తృతమైన సాంస్కృతిక నిధిని సేకరించడం వరకే కాదు, భద్రపరచడం కూడా అనేక సవాళ్లతో కూడుకున్న బాధ్యత. తెలుగు విశ్వవిద్యాలయం అప్పట్లో ఖాలీగా ఉన్న కొన్ని గదులను ఆద్యకళ వస్తువుల కోసం కేటాయించింది. కానీ సేకరించిన వస్తువులకి ఈ గదులు సరిపోలేదు. దీంతో భారీ వస్తువులను వేరే దారి లేక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆరుబయటే ఉంచాల్సి వచ్చింది. ​ఎండ, వానలకు గురై ఈ అరుదైన చారిత్రక సంపద శాశ్వతంగా పాడైపోక ముందే, వాటికి సరైన భద్రతను ఇచ్చే ఒక శాశ్వతమైన నివాసాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ తిరుమలరావు గారు మళ్ళీ తన ప్రయత్నాలను మొదలుపెట్టారు..

బాచుపల్లి

ప్రభుత్వం బాచుపల్లిలో వంద ఎకరాల స్థలంలో విశాలమైన శాశ్వత భవనాలు నిర్మించి తెలుగు విశ్వవిద్యాలయాన్ని అక్కడికి తరలించింది. కానీ అక్కడ “ఆద్యకళ ” నిర్దాక్షిణ్యంగా నిర్లక్ష్యం చేయబడింది. జానపదుల సంస్కృతిని, సంప్రదాయాన్ని, మౌలిక జీవన విధానాలని, అధ్యయనం చేయడానికి ఉపకరించే “ఆద్యకళ” మ్యూజియం ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. పరిస్థితి అర్థం చేసుకున్న తంగెడ కిషన్ రావు గారు, ఆయన వీసీగా ఉన్న కాలంలో జానపద కళల ప్రాముఖ్యతను గుర్తించి ‘ఆద్యకళ‘ మ్యూజియం వస్తువులు భద్రపరుచుకోవడం కోసం కొన్ని గదులను కేటాయించారు. అయితే, ఆ తర్వాత వచ్చిన ప్రస్తుత విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆ చారిత్రక సంపద విలువను గుర్తించకపోగా, ఆ గదులను వెంటనే ఖాలీ  చేయాలని ఆదేశించడం అత్యంత విచారకరం.ఈ పరిస్థితిలో ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని, ఆ ఆద్యకళ వస్తువులను అక్కడే కొనసాగించేలా చర్యలు తీసుకోవడంతో తాత్కాలికంగా ఆ అమూల్య నిధికి రక్షణ లభించింది.

‘ఆద్యకళ‘ మ్యూజియం వివాదం – వాస్తవాలు, సంస్కృతి పరిరక్షణ బాధ్యత

నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో “ఆద్యకళ” మ్యూజియం ఏర్పాటు, ప్రభుత్వ ఉత్తర్వుల (జీఓ ) చుట్టూ జరుగుతున్న చర్చలు, వాదనలపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరం. ‘తెలుగుప్రభ‘ వారపత్రికలో సంగిశెట్టి శ్రీనివాస్ గారు “పిలుపు” పేరిట రాసిన వ్యాసంలో వ్యక్తపరిచిన కొన్ని అంశాలు, విమర్శలకు సమాధానంగా వాస్తవాలను ఇక్కడ విశ్లేషించాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వ ఉత్తర్వులు – వాస్తవ పరిస్థితి గమనిస్తే…
అలనాటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు గారు తెలుగు వైభవాన్ని చాటేలా, భాషా సాహిత్యాలపై ఉన్నత పరిశోధనలు జరగాలనే సంకల్పంతో తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఈ క్రమంలోనే ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారు తమ దశాబ్దాల శ్రమతో సేకరించిన అరుదైన జానపద, గిరిజన కళాఖండాలను భద్రపరచడానికి ‘ఆద్యకళ‘ రూపుదిద్దుకుంది.

ప్రభుత్వం జీవో ఇవ్వలేదని లేదా ఉత్తర్వులు వెలువరించలేదని కొందరు అనడం పూర్తిగా అవగాహన రాహిత్యంతో కూడుకున్నది. సంబంధిత కమిటీ నివేదిక ఆధారంగా ప్రాసెస్ పూర్తయి, ముఖ్యకార్యదర్శి, సాంస్కృతిక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆమోదముద్ర వేశారు. నిబంధనల ప్రకారం ఫైలుపై సీఎం సంతకం చేసి “Necessary orders may be issued” అని ఆదేశించిన తర్వాత అది ప్రభుత్వ ఉత్తర్వు కిందకే వస్తుంది. సాంకేతికంగా ఉత్తర్వులు వెలువడడంలో అధికారుల స్థాయిలో కొద్ది రోజులు ఆలస్యం జరగడం వల్ల అపోహలు తలెత్తాయి తప్ప, ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా లేదు.

సంగిశెట్టి గారు పేర్కొన్నట్లు, ‘ఆదిధ్వని‘ లేదా ‘ఆద్యకళ‘ సేకరించిన ఈ అమూల్యమైన కళాఖండాలను ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేసి సాలార్ జంగ్ మ్యూజియం మాదిరిగా నడపాలనే ప్రతిపాదన స్వాగతించదగినదే. కానీ సాలార్ జంగ్ మ్యూజియం అనేది 1961 చట్టం ప్రకారం ఏర్పాటైన ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ. అక్కడ గవర్నర్ ఎక్స్-అఫిషియో ఛైర్‌పర్సన్‌గా ఉన్నప్పటికీ, బోర్డ్ ఆఫ్ ట్రస్టీల పర్యవేక్షణలోనే నడుస్తుంది.

అలాగే ‘ఆదిధ్వని ఫౌండేషన్‘ కూడా కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖకు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సమర్పించి, గ్రాంట్ల సహాయంతో మ్యూజియంల ఏర్పాటుకు కృషి చేస్తోంది. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వమే ఈ అపూర్వ నిధిని కొనుగోలు చేసి తరతరాల చరిత్రకు రక్షణ కల్పిస్తే అందరికంటే ఎక్కువగా సంతోషించేది ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారే. అయితే బాచుపల్లి ప్రాంగణానికి విశ్వవిద్యాలయాన్ని తరలించిన తర్వాత కూడా, నాంపల్లిలోని భవనాలను విశ్వవిద్యాలయ అవసరాలకు లేదా ‘ఆద్యకళ‘ మ్యూజియం వంటి సాంస్కృతిక నిధులకు ఉపయోగించకుండా ఇతర శాఖలకు అద్దెకు ఇవ్వడం, హాళ్లను గోదాన్లుగా మార్చడం విచారకరం.

ఆద్యకళ కమిటీలో అనుభవజ్ఞులైన పెద్దలు ఉన్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా ఈ మ్యూజియాన్ని ఇక్కడి నుండి కదల్చవలసిన అవసరం లేదని, ఇది పర్యాటక రంగ అభివృద్ధికి కూడా తోడ్పడుతుందని స్పష్టం చేశారు. అయితే, అధికారుల స్థాయి నుండి సహకారం లోపించడం, ఏవో కొన్ని ప్రయోజనాల కోసం ‘ఆద్యకళ‘ను ఖాలీ  చేయించాలనుకోవడం సమాజానికి శుభపరిణామం కాదు.

ముగింపు

‘ఆద్యకళ‘లో భద్రపరిచిన వస్తువులు ఈ నేల ప్రజల ఆత్మగౌరవ చిహ్నాలు. దిల్లీ రాష్ట్రపతి భవన్‌లోని ‘జనజాతి దర్పణ్‘ నుండి ప్యారిస్, లండన్ వరకు ప్రదర్శితమై అంతర్జాతీయ కీర్తిని పొందిన ఈ కళాఖండాలను గౌరవించాలి. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ సమస్యకు స్వస్తి పలికి, ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన స్థలాన్ని కేటాయించి, ‘ఆద్యకళ‘కు శాశ్వత మ్యూజియం ఏర్పాటు చేయాలి. విద్యార్థులు, పరిశోధకులకు ఇదొక ప్రాథమిక పరిశోధనా వనరుగా ఉపయోగపడేలా చేయడం మన సాంస్కృతిక బాధ్యత. అబద్ధాలు, విమర్శలకు స్వస్తి చెప్పి సంస్కృతీ పరిరక్షణ కోసం ప్రభుత్వం, విద్యావేత్తలు కలిసి ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది.సంస్కృతి-సాంప్రదాయాలు లేని సమాజం వేళ్ళు లేని చెట్టు వంటిది. “ఆద్య కళ ” జానపద సాహిత్యం, సాంస్కృతిక రంగాల్లో ప్రామాణిక పరిశోధనా కేంద్రంగా వర్ధిల్లాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *