ఒక సీసా నూనెలో

-ఎన్. లహరి

ఎన్నో ఏళ్లుగా

నడకతో పోరాడుతున్న జీవితానికి
ఇప్పుడో మాట వినిపించింది
అద్భుతాలన్నీ
ఈ భూమ్మీదే ఉన్నాయంటూ!
ఎండిన నేల మీద
కురిసిన తొలకరి జల్లులా
ఆ తియ్యటి మాట అమృతప్రాయంగా
మనసును తాకింది
కాలం అలసిపోయిన చోట
ఆశ మాత్రం
ఇంకా ఉదయిస్తూనే ఉంటుంది
ఒక సీసా నూనెలో
ఎన్నెన్ని ఉషోదయాలు దాగున్నాయో
గుప్పెడు పొడిలో
ఎన్ని అడుగులు మొలకెత్తుతాయో
తెలియని ప్రశ్నల మధ్య
మనసు నమ్మకాన్నే ఎంచుకుంది
ఎందుకంటే
బాధకు తర్కం లేదు
ఆశకు చావు లేదు
ఏళ్ళ నిరీక్షణలో
ఒక లిప్తపాటు క్షణం
భరోసాగా వెలుగు చూసినప్పుడు
నిజమా.. కాదా..
అనే భ్రమలోంచి
మనసు విశ్వాసాన్నే కోరుకుంటుంది
కాలం గడిచిపోయాక
అన్నీ ప్రశ్నలే మిగులుతాయి
నూనెలో అద్భుతం లేదు
పొడిలో పరిష్కారం లేదు
మనిషి నమ్మకంలో
దాగిన విలువ
మరోసారి తెలిసొచ్చింది
ఆశ ఓడిపోకూడదని
మనసుతో చేసే యుద్ధంలో
గెలుపో ఓటమో
భరించలేని స్థితిలో
ఒక రంపపుకోత
కడుపుకోతగా మారి
అంతరంగాన్ని చీల్చేస్తుంది
కానీ నమ్మకంతో చేసే మోసంలో
మనిషి మాత్రం
చివరి వరకూ పోరాడి
బలిపశువుగా మిగిలి పోతుంటాడు!
(శారీరక లోపాలతో సతమతమవుతున్న వారి ఆశను ఎరగా చేసుకుని, ‘నూనె–పొడు’ల పేరుతో జరిగే మోసాల నేపథ్యంలో)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *