విశ్వనగరంగా నిలిపేందుకే చెరువుల పునరుద్ధరణ

– తమ్మిడికుంట చెరువు ప్రాంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : కొంతమందికి నష్టం జరిగినా కొన్ని తరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలనే ఉద్దేశంతో తమ్మిడికుంట చెరువును అభివృద్ధి చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 14 ఎకరాలకు కుచించుకుపోయిన చెరువును 30 ఎకరాలకు విస్తరించామని చెప్పారు. నటుడు అక్కినేని నాగార్జున మంచి మనసుతో ముందుకొచ్చి రెండెకరాలు ప్రభుత్వానికి అందించారంటూ సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా ఆయన హీరోగా నిలిచారని కొనియాడారు. ప్రకృతిని పరిరక్షించాలన్నదే తన ఆలోచన అని, హైదరాబాద్‌ను విశ్వనగరంగా నిలబెట్టేందుకే తన తపన అని చెప్పారు. అందులో భాగంగానే చెరువులను పునరుద్దరిస్తున్నామంటూ ఇందుకు సహకరించిన అందరినీ అభినందిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. సైట్ అంటేనే రాక్స్ అండ్ లేక్స్ సిటీ.. హైదరాబాద్‌లో 1372 చెరువులు ఉంటే రకరకాల కారణాలతో 50 శాతం చెరువులు మాయమయ్యాయని చెప్పారు. చెరువుల ఆక్రమణలతో వర్షాలు వస్తే రోడ్లపై నీళ్లు నిలిచే పరిస్థితి నెలకొందన్నారు. కాలనీలు జలమయం అవుతున్నాయన్నారు. ఈ పరిస్థితిపై ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయాలని కోరారు. ఆనాడు మూసీ వరదల నుంచి నగరాన్ని కాపాడేందుకు నిజాం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లను నిర్మించారని, వికారాబాద్ నుంచి మొదలైన ముచుకుందా నది మూసా, ఈసా కలసినచోట మూసీగా మారిందని గుర్తు చేశారు. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో నదీ నాగరికత అభివృద్ధి చెందిందంటూ దీన్ని గుర్తించి వందేళ్ళ క్రితమే నిజాం మూసీ నదీ పరివాహకాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. కానీ ఇప్పుడు మూసీ కాలుష్యమయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ కాలుష్యంతో నల్లగొండ జిల్లా ప్రజలు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నల్లగొండ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితి మారాలనే మూసీ పునరుజ్జీవం చేపట్టాలని నిర్ణయించామని చెప్పారు. మూసీని ప్రక్షాళన చేయాల్సిందేనంటూ ప్రక్షాళనలో ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా చూసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది అని హామీ ఇచ్చారు. త్వరలోనే మూసీ పునరుజ్జీవం తొలి దశ పనులు ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. నగర ప్రజల జీవితాలు మూసీ నదితో ముడిపడి ఉన్నాయని, నదుల పేర్లు ఆడబిడ్డలకు పెట్టుకునే సంస్కృతి మనది అని గుర్తు చేశారు. అందుకే సుందరీకరణ కాదు.. మూసీకి పునరుజ్జీవం కల్పిద్దాం అని అన్నారు. మూసీని ప్రక్షాళన చేయాల్సిందే.. చెరువులను ఆక్రమణల చెర నుంచి విడిపించాల్సిందేనని స్పష్టం చేశారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని కోరుతున్నానన్నారు. నిన్నటి వరకు శిల్పారామం గురించే మాట్లాడుకున్నారు.. ఇవాళ్టి నుంచి తమ్మిడికుంట గురించి మాట్లాడుకుంటారు.. ఇకనుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు.. వర్క్ ఫ్రమ్ తమ్మిడికుంట అంటారు అని చమత్కరించారు. ఇక్కడ భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశిస్తున్నానన్నారు. లేక్ ఎకానమీని అభివృద్ధి చేసుకుందాం అంటూ చెరువు ఆవరణలో ఒక జమ్మి చెట్టును నాటాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు సూచిస్తున్నానన్నారు. అలా చేస్తే దసరా వేడుకలకు చెరువులు వేదికగా మారుతాయని, సంస్కృతిని కాపాడుకోవడానికీ వేదిక అవుతాయని ముఖ్యమంత్రి చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *