యుద్ధ‌ప్రాతిప‌దిక‌న క‌రువు నివార‌ణ చ‌ర్య‌లు

– ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం
– కేంద్రానికి నివేదిక పంపించాము
– అవసరమైతే అఖిలపక్షంతో దిల్లీకి వెళ్లి సాయం సాధిస్తాం
– అఖిలపక్ష నేతల సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28 : ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజా ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రత్తలు, చర్యలను తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక పంపామని, అవసరమైన సమయంలో అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని దిల్లీకి తీసుకెళ్లి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన సహాయంపై విజ్ఞప్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని పార్టీల సూచనలను పరిగణనలోకి తీసుకుని సమష్టి కార్యాచరణతో ముందుకు వెళ్తామన్నారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన బుధవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. విపత్తు పరిస్థితులను ఎదుర్కొనే సమయంలో రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే అన్ని పార్టీలను ఆహ్వానించి సమావేశం నిర్వహించామని తెలిపారు. నేతలు ప్రస్తావించిన అంశాలను నమోదు చేసుకున్నామని, సాధ్యమైన మేరకు వాటిని ప్రభుత్వ కార్యాచరణలో భాగంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఎల్‌నినో ప్రభావంపై గతంలోనూ శాసనసభలో చర్చించామని, వివిధ సమావేశాలు, సదస్సులు నిర్వహించడంతోపాటు శాస్త్రవేత్తలు, నిపుణులతో సంప్రదింపులు జరిపామని వివరించారు. ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. రానున్న నెలల్లో ఎదురయ్యే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి అవసరమైన సన్నద్ధతతో ఉన్నామని పేర్కొన్నారు. వర్షపాతం లోటు ఒక్క తెలంగాణకే పరిమితమైతే పొరుగు రాష్ట్రాల్లో కురిసే వర్షాలతో ప్రాజెక్టులకు నీరు చేరే అవకాశం ఉండేదన్నారు. అయితే రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాలు, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ వర్షపాతం లోటు ఏర్పడటం ఆందోళన కలిగించే అంశమన్నారు. ప్రత్యామ్నాయ ప్రాంతాల నుంచి నీటి లభ్యత తగ్గిన పరిస్థితుల్లో జలవనరుల నిర్వహణ మరింత కీలకంగా మారిందని చెప్పారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. వర్షాభావ పరిస్థితులను ముందుగానే అంచనా వేస్తూ వాటి ప్రభావాన్ని తగ్గించేందుకు శాఖలవారీగా సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తామని, పశువులకు తాగునీరు, మేత అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శాస్త్రవేత్తలు, నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకుని పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. అఖిలపక్ష నేతలు సూచించిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న నీటి అవసరాలను తీర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అఖిలపక్ష నేతలు చేసిన సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలను రూపొందించామని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు, పశువులకు అవసరమైన నీటి వసతులు కల్పించేందుకు అవసరమైన బడ్జెట్, ఇతర ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. సమావేశంలో వచ్చిన సూచనలను పరిశీలించి అమలుకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తన పరిధిలో అన్ని చర్యలు చేపడుతూనే కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా సమర్థవంతంగా వినియోగించుకుంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే కేంద్రానికి నివేదిక పంపామని, అవసరమైన సహాయం అందేలా ప్రతిపాదనలు సమర్పిస్తామని చెప్పారు. గతంలో కరోనా వంటి సంక్షోభాలను ఎదుర్కొన్న సమయంలో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేశాయని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ప్రస్తుత పరిస్థితుల్లోనూ రాజకీయాలకు అతీతంగా ప్రజల ప్రయోజనాల కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఎదురయ్యే సవాళ్లపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించి రాష్ట్రాన్ని కరువు ముప్పు నుంచి కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల సాధనలో రాజకీయాలకు తావు లేకుండా అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలకు అండగా నిలవడమే లక్ష్యంగా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అఖిలపక్ష సమావేశంలో పాల్గొని విలువైన సలహాలు, సూచనలు అందించిన నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
సమావేశానికి కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు, రాష్ట్ర మంత్రులు ఎన్.ఉత్తంకుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దనసరి సీతక్క, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఎల్‌నినో నోడల్ అధికారి రామకృష్ణారావులు హాజరయ్యారు. అఖిలపక్ష నాయకులు కాంగ్రెస్ తరఫున అంజన్ కుమార్ యాదవ్, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, బీఆరఎస్ తరఫున వినోద్ కుమార్, ఎల్.రమణ, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బీజేపీ తరఫున శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కొమురయ్య, ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, సమాజ్‌వాదీ పార్టీ నాయకులు ప్రొఫెసర్ సింహాద్రి, వెంకటేశ్వర్లు, ఆర్జేడీ నాయకురాలు శోభా యాదవ్, బీఎస్పీ రాష్ట్ర నాయకుడు శ్రీరామ్ కృష్ణ, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హేమ సుదర్శన్, తెలుగుదేశం పార్టీ తరఫున కాట్రగడ్డ ప్రసన్నకుమార్ తదితరులు హాజరయ్యారు. కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, రైతులకు అండగా నిలిచే చర్యలు, తాగు, సాగునీటి సమస్యల పరిష్కారం తదితర అంశాలపై వారంతా తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *