– ప్రతి గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దాలి
– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : ఎల్‌నినో ప్రభావంతో రానున్న కాలంలో ఎదురయ్యే పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గ్రామస్థాయిలో పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్‌లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 2న నిర్వహించనున్న గ్రామ సభలు, ఎల్‌నినో నేపథ్యంలో గ్రామాల వారీగా చేపట్టాల్సిన పనులు, పంచాయతీల్లో అమలు చేయాల్సిన అభివృద్ధి ప్రణాళికపై మంత్రి సమీక్షించారు. సమావేశానికి స్పెషల్ సీఎస్ దానకిషోర్, అడిషనల్ కమిషనర్ పి.రవీందర్‌తోపాటు శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని యాక్షన్ ప్లాన్‌పై అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేశామని చెప్పారు. అక్టోబర్ 2న ప్రతి గ్రామ పంచాయతీలో నిర్వహించే గ్రామ సభల్లో ఎల్‌నినో యాక్షన్ ప్లాన్‌పై చర్చించి గ్రామస్థాయిలో అవసరమైన చర్యలపై తీర్మానాలు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామానికి అవసరమైన పనులు ఏమిటి.. అందుబాటులో ఉన్న నిధులు ఎంత.. వచ్చే ఏడాది కాలంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా గ్రామ పంచాయతీలకు అందే నిధులు ఎంత అనే అంశాలపై గ్రామ సభల్లో సమగ్రంగా చర్చించి గ్రామ అవసరాలకు అనుగుణంగా కార్యాచరణను ఆమోదించాలని మంత్రి సూచించారు.
అవసరాలకు అనుగుణంగా.. ప్రాధాన్యత క్రమంలో పనులు
ప్రతీ గ్రామ పంచాయతీకి ఒకే రకమైన అభివృద్ధి ప్రణాళిక కాకుండా గ్రామాల వారీగా ఉన్న అవసరాలు, అందుబాటులో ఉన్న నిధులనుబట్టి పనులను ఎంపిక చేయాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ప్రజలకు అత్యవసరమైన పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తర్వాత ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ఆర్థికంగా, సామాజికంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉపాధి కల్పించడంతోపాటు గ్రామాల్లో శాశ్వత సామాజిక ఆస్తులు సృష్టించేలా పనుల ఎంపిక ఉండాలని మంత్రి అన్నారు.
ఉపాధి హామీతో గ్రామాల్లో భారీగా పనులు
ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ఏడాది రాష్ట్రంలో సుమారు రూ.6,700 కోట్లను ఖర్చు చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. దీంతో ప్రతి గ్రామ పంచాయతీలో సగటున సుమారు రూ.50 లక్షల విలువైన పనులు జరిగే అవకాశం ఉందని చెప్పారు. కోరిన ప్రతి ఒక్కరికీ ఉపాధి హామీ పనులు కల్పించాలని ఆదేశించారు. ఒకవైపు గ్రామీణ కుటుంబాలకు ఉపాధి కల్పించడం, మరోవైపు గ్రామాలకు ఉపయోగపడే శాశ్వత సామాజిక ఆస్తులను సృష్టించడం లక్ష్యంగా పనులు చేపట్టాలని సూచించారు.
జలసిరి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి
గ్రామీణ ప్రాంతాల్లో నీటి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సీతక్క అన్నారు. జలసిరి కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి గ్రామాల్లో నీటి సంరక్షణ, నీటి నిల్వ, భూగర్భ జలాల పెంపునకు ఉపయోగపడే పనులను పెద్ద ఎత్తున చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
జిల్లాల వారీగా ఇప్పటికే రాష్ట్రస్థాయి అధికారులను ప్రోగ్రామ్ మానిటరింగ్ అధికారులుగా నియమించామని మంత్రి తెలిపారు. వచ్చే రెండు రోజులపాటు ఈ అధికారులు తమకు కేటాయించిన జిల్లాల్లో పర్యటించాలని, కిందిస్థాయి సిబ్బందికి గ్రామ సభలు, ఎల్‌నినో యాక్షన్ ప్లాన్, ఉపాధి హామీ పనులు, జలసిరి కార్యక్రమంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. అధికారులు గ్రామ స్థాయికి వెళ్లి పరిస్థితులను పరిశీలించాలని స్పష్టం చేశారు.
ప్రతి గ్రామ పంచాయతీ మోడల్ పంచాయతీగా..
రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క తెలిపారు. ప్రజలకు ఉపాధి, గ్రామాలకు మౌలిక వసతులు, నీటి భద్రత, శాశ్వత సామాజిక ఆస్తులు కల్పించేలా సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. గ్రామ సభ కేవలం సమావేశం కాదు.. గ్రామ అభివృద్ధికి దిశానిర్దేశం చేసే వేదిక.. ప్రజల అవసరాలు తెలుసుకుని, అందుబాటులో ఉన్న నిధులను సద్వినియోగం చేసి ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి అని మంత్రి సీతక్క సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





