ఖేలో ఇండియా గేమ్స్‌కు ఘనంగా ఏర్పాట్లు

– క్రీడా వేదికలు, వసతి, రవాణా, భద్రతపై మంత్రి వాకిటి సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : రాష్ట్రంలో ఈ ఏడాది డిసెంబర్ 11 నుండి 23వ తేదీ వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 పోటీలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పోటీల ఏర్పాట్లపై సచివాలయంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సోమవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పోటీల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను శాఖల వారీగా మంత్రి సమీక్షించారు. క్రీడా వేదికల సంసిద్ధత, మౌలిక సదుపాయాల కల్పన, క్రీడాకారుల వసతి, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలు, ఆహారం, పరిశుభ్రత, స్వాగత ఏర్పాట్లు, ప్రచార కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే యువ క్రీడాకారులకు అత్యుత్తమ వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రతి క్రీడా వేదికలో అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని, పోటీల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఖేలో ఇండియా గేమ్స్ వంటి జాతీయస్థాయి పోటీలు రాష్ట్రంలో యువ క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు మరిన్ని అవకాశాలను కల్పిస్తాయని మంత్రి పేర్కొన్నారు. క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేయడంతోపాటు గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. తెలంగాణ ఆతిథ్యానికి, క్రీడా రంగంలో రాష్ట్ర ప్రతిష్ఠకు తగిన స్థాయిలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించేందుకు అధికారులు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. సమీక్షలో ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీ సోని బాలదేవి, క్రీడా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *