– దిల్లీ వ్యాపారులకు రాహుల్ గాంధీ సూచన
– జ్ఞానేశ్ కుమార్‌ను కాపాడుతున్నారు: ఖర్గే ఆరోపణ
– యూపీలో వోటర్ల దరఖాస్తుల పరిశీలనకు ఆదేశాలు
దిల్లీ–హైదరాబాద్, ప్రజాతంత్ర ప్రత్యేక వార్త | అక్టోబర్ 26 : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగిస్తే వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (‘సర్’)కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం వ్యాఖ్యానించారు. నవంబర్ 1న దిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో ప్రతిపాదించిన భారీ సభను వాయిదా వేయాలన్న వ్యాపార సంఘాల విజ్ఞప్తిపై ఆయన స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి జ్ఞానేశ్ కుమార్ తొలగింపును కోరాలని దిల్లీ వ్యాపారులకు రాహుల్ సూచించారు. సభ కారణంగా పండుగల వ్యాపారానికి అంతరాయం కలుగుతుందన్న ఆందోళనల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వోటు చోరీకి సంబంధించిన అనేక అంశాలు బయటపడుతున్నప్పటికీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను రక్షించడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘సర్ ప్రక్రియలో ఉపయోగిస్తున్న ఈసీఐనెట్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన సమాచారాన్ని వాణిజ్య రహస్యాల పేరుతో వెల్లడించడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. నవంబర్ 1న ప్రతిపాదించిన దిల్లీ చలో కార్యక్రమంలో పాల్గొనాలని ఖర్గే పిలుపునిస్తూనే మరో వైపు సోమవారం పాట్నాలో మాట్లాడుతూ దిల్లీ వ్యాపారుల విజ్ఞప్తిని పరిశీలిస్తామని తెలిపారు. 26 లేదా 27న చర్చించి పరిష్కారం కనుగొంటామని చెప్పారు. నవంబర్ 10 తర్వాత సభ నిర్వహించాలని వ్యాపార సంఘం కోరింది. ‘సర్’ వివాదంలో మరో ముఖ్యమైన పరిణామం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పిలిభిత్ సదర్ అసెంబ్లీ నియోజకవర్గంలో వోటర్ల వివరాల మార్పిడిపై కాంగ్రెస్ చేసిన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్ రిన్వా విచారణకు ఆదేశించారు. ఏప్రిల్ 10 నుంచి కంప్యూటర్ సహాయకులు నమోదు చేసిన ఫారం–6, ఫారం–7, ఫారం–8 దరఖాస్తులను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఫారం–6 కొత్త వోటరు నమోదుకు, ఫారం–7 పేర్ల తొలగింపు లేదా అభ్యంతరాలకు, ఫారం–8 వివరాల సవరణకు ఉపయోగిస్తారు. పిలిభిత్‌లో 10,470 వోటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. అలాగే 16.18 లక్షల ఫారం–6 దరఖాస్తుల వివరాలను వెల్లడించలేదని ఖర్గే పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





