కేసీఆర్ కలల ప్రాజెక్టుపై సర్కార్ కుట్రలు !

“గతంలో దెబ్బతిన్న ప్రాజెక్టులోని బ్యారేజ్ మరమ్మత్తులు చేయకపోవడం, కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటి ఎత్తిపోతల ప్రతిష్టంభన, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల రిజర్వాయర్ కొమురవెల్లి మల్లన్న సాగర్ ప్రాజెక్టు సమీపంలో బ్లాస్టింగ్ ఆరోపణలు ఇవన్నీ చూస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తుపై ప్రజల్లో ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 3 ఫిల్లర్లు కృంగడంపై కుట్రలున్నాయని, బ్లాస్టింగ్ చేశారని విశ్రాంత ఇంజనీర్లు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇలా వరుస పరిణామాలు తెలంగాణ జల ప్రయోజనాలపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి..”

జీడిపల్లి రాంరెడ్డి
ప్రిలాన్స్ జర్నలిస్టు
9666680051

ఏడాది కాలంగా ఎల్ నినో వస్తుంది కరువు పరిస్థితులు వస్తున్నాయని తెలిసినా రాష్ట్ర  సర్కార్ తమకేమి పట్టనట్లు వ్యవహరించింది. ఒకవైపు తెలంగాణలో కరువు, కాటకాలను దూరం చేయాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి గోదావరి జలాలు పారించగా, రేవంత్ రెడ్డి మాత్రం కాళేశ్వరంపై మొదటి నుండి కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి రాకముందు ప్రతిపక్ష నాయకునిగా కాళేశ్వరం కూలేశ్వరం, లక్షకోట్ల అవినీతి అంటూ ప్రచారం చేసిన ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తన తీరు మారడం లేదు. ఎల్ నీనో ఇబ్బందులు ఉన్నాయంటూనే గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నా పట్టించుకోలేదు. తెలంగాణలో కరువు కాటకాలను శాశ్వతంగా దూరం చేయాలని, గోదావరి జలాలను బీడు భూములకు మళ్లించాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన మహత్తర సాగునీటి ప్రణాళిక కాళేశ్వరం.

లక్షల ఎకరాలకు సాగునీరు, అనేక ప్రాంతాలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీళ్లకు అందించడానికి లక్ష్యంతో నిర్మించిన ఈప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి కక్షకట్టారు. .గతంలో దెబ్బతిన్న ప్రాజెక్టులోని బ్యారేజ్ మరమ్మత్తులు చేయకపోవడం, కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటి ఎత్తిపోతల ప్రతిష్టంభన, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల రిజర్వాయర్ కొమురవెల్లి మల్లన్న సాగర్ ప్రాజెక్టు సమీపంలో బ్లాస్టింగ్ ఆరోపణలు ఇవన్నీ చూస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తుపై ప్రజల్లో ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 3 ఫిల్లర్లు కృంగడంపై కుట్రలున్నాయని, బ్లాస్టింగ్ చేశారని విశ్రాంత ఇంజనీర్లు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇలా వరుస పరిణామాలు తెలంగాణ జల ప్రయోజనాలపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కేసీఆర్ హాయాంలో నిర్మించిన ప్రాజెక్టులను విఫలమైన విగా నిరూ పించడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ వెలుతున్నట్లు కనిపిస్తున్నది.
మల్లన్న సాగర్ వద్ద బ్లాస్టింగ్ ఎందుకు..?
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టకు అతి సమీపంలో తిప్పారం వద్ద హైదరాబాద్ కు నీటిని తరలించడానికి ఇంటెక్ వెల్, ఇతర నిర్మాణ పనులు చేపట్టడం ఆందోళనకు కారణమవుతుంది. లక్షలాధి రైతుల ప్రయోజనాలతో ముడిపడిన మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు కేవలం 100 మీటర్ల దూరంలో ఇంటెక్ వెల్ నిర్మించడంతో పాటు పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ పనులు చేపట్టడంతో ప్రాజెక్టుకు నష్టం కలిగించే కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆందోళన వ్యక్తం చేసినవిషయం తెలిసిందే.కట్ట ఎత్తు 40 మీటర్లు ఉండగా నిబంధనల ప్రకారం 400 మీటర్ల వరకు ఎలాంటి బ్లాస్టింగ్ తోపాటు భూగర్భ నిర్మాణాలు చేపట్టరాదని నిబంధనలున్నా పట్టించుకోవడం లేదు. ఇంటెక్ వెల్ నిర్మాణానికి పూర్తిస్థాయి భూగర్భ సాంకేతిక అధ్యయనం చేశారా..? రిజర్వాయర్ కట్టకు బ్లాస్టింగ్ వల్ల వచ్చే ప్రకంపనల ప్రభావాన్ని అంచనా వేశారా..? నీటిపారుదల శాఖ నుండి అనుమతులు తీసుకున్నారా..? పేలుడు పదార్థాల వినియోగానికి చట్టబద్దమైన లైసెన్సులు ఉన్నాయా..? బ్లాస్టింగ్ ముందు, తర్వాత కట్ట స్థితిని పరిశీలించారా..? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంది.
ఇంటెక్ వెల్ నిర్మించడం తప్పుకాదు, హైదరాబాద్ కు నీరు అందించడం కూడా తప్పుకాదు, కానీ ఒక భారీ జలాశయానికి సమీపంలో లోతైన తవ్వకాలు, పేలుళ్లు చేపట్టేటప్పుడు నిపుణుల అధ్యయణం, నిర్మాణ భద్రత, ప్రకంపనల పర్యవేక్షణ తప్పనిసరి. ఒకవేళ రిజర్వాయర్ కట్టకు నష్టం వాటిల్లితే దాని పరిణామాలు ఊహించలేనివి. కట్ట స్థిరత్వం దెబ్బతినడం, నీటి లీకేజీలు పెరగడం, సాగునీటి వ్యవస్థపై ప్రభావం పడటం వంటి ప్రమాదాలను ముందుగానే అంచనావేయాలి. ఇది కేవలం రాజకీయ విమర్శల అంశం కాదు, దేశంలో డ్యామ్ ల  భద్రతకు సంబంధించి ప్రత్యేక చట్టం ఉంది. డ్యామ్ సేప్టీ ఆక్ట్ 2021 ప్రకారం సేక్షన్ 16 ప్రకారం రాష్ట్ర డ్యామ్ సేప్టీ సంస్థలు నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు, నిర్వహణను పర్యవేక్షించాలి. సెక్షన్ 28ప్రకారం ప్రాజెక్టుకు శిక్షణ పొందిన సిబ్బంది, సరైన ఆపరేషన్, మెయింటెనెన్స్ మ్యాన్యువల్ ఉండాలి. సెక్షన్ 29 ప్రకారం డ్యామ్ నిర్మాణం, నిర్వహణ, పర్యవేక్షణకు సంబందించిన బాధ్యతల నుంచి యజమాని సంస్థ తప్పించుకోలేదు. సెక్షన్ 31 ప్రకారం ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందు, తర్వాత తనిఖీలు నిర్వహించాలి. అలాగే పేలుడు పదార్థాల వినియోగానికి పేలుడు పదార్థాల చట్టం– 1884, పేలుడు పదార్థాల నిబంధనలు–2008 ప్రకారం వర్తించే లైసెన్సులు, భద్రతా ప్రమాణాలు పాటించాలి. ఇక్కడ ముఖ్యంగా గుర్తించుకోవాల్సింది ఏమంటే ఇంటెక్ వెల్ కోసం తవ్వకాలు చేయడం మాత్రమే ప్రమాదానికి ఆధారం కాదు. అక్కడి భూగర్భ పరిస్థితులు, కట్ట పునాదుల స్వభావం, తవ్వకాల లోతు, పేలుళ్ల తీవ్రత, ప్రకంపనల ప్రభావం ఆధారంగా నిపుణులు ప్రమాదాన్ని అంచనా వేయాలి. కాబట్టి మల్లన్న సాగర్ విషయంలో స్వతంత్ర నిపుణుల అధ్యయనం, అనుమతుల పత్రాలు, ప్రకంపనల రికార్డులు ప్రజల ముందుంచాలి.
హైదరాబాద్ కు తాగునీటిని అందించడానికి కేసీఆర్ హయాంలో కొండపోచమ్మ సాగర్ నుండి రూ.1,100 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ జలాశయాలకు నిటిని వినియోగించుకునేవిధంగా ఉంటుందని తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ హైదరాబాద్ కు సమీపంలో ఉన్న కొండపోచమ్మ ప్రాజెక్టు కాకుండా మల్లన్న సాగర్ నుండి నీటిని తీసుకెల్లడానికి రూ.7360 కోట్లను కేటాయించారు. మల్లన్న సాగర్ నుండి ఘనపూర్ వరకు ప్రధాన లైన్ ఏర్పాటు చేసి అక్కడ నీటి శుద్ధి కేంద్రం నుండి హైదరాబాదు, మూసీ పునరుజ్జీవ పథకంకు నీటిని తరలించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు. కేసీఆర్ అనుకున్న తరహాలో కొండపోచమ్మ నుండి నీటిని తరలిస్తే బడ్జెట్ తక్కువలో ప్రాజెక్టులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పనులు జరిగిపోయేవి. నేడు మల్లన్న సాగర్ ప్రాజెక్టు పనులకు అనుమతులతో పాటు ప్రాజెక్టు భద్రతా ప్రమాణాలపై వారు ప్రశ్నిస్తున్నారు. ఇన్టేక్ వెల్ నిర్మాణంతో పక్కనే ఉన్న తిప్పారంలో పెంకుటిళ్లులు దెబ్బతింటునడంతో పాటు, మల్లన్న సాగర్ ప్రాజెక్టు కింది వైపు రాతి కట్టడం దెబ్బతినడంతో పాటు బయటకు నీళ్లు వస్తున్నాయి. కాగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై ఎన్ డీఎస్ఏ సమగ్ర పరిశీలన జరిపి పునరుద్దరణకు సంబంధించిన సాంకేతిక సూచనలు చేసింది. మేడిగడ్డ ఏడో బ్లాక్ దెబ్బతినగా, పునరుద్దరణకు ప్రత్యేక ప్రణాళిక అవసరమని నివేదికలో పేర్కొంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం మరమ్మత్తుల కోసం చర్యలు చేపట్టాలని నిర్ణయించినప్పటికీ ఆకోణంలో పనులు జరగడం లేదు.
మరోవైపు మరమ్మత్తులు పూర్తయ్యే వరకు వేచి ఉండాలంటూ, నీటి ఎత్తిపోతలను నిలిపివేయడం రైతులకు భారంగా మారింది. ప్రాజెక్టు భద్రతను కాపాడటం ఎంత ముఖ్యమో, దాని ప్రయోజనాలు రైతులకు అందేలా చూడటం కూడా అంతే ముఖ్యం. ఒకవైపు కరువు పరిస్థితులు రాష్ట్ర రైతాంగాన్ని అతలాకుతలం చేస్తుండగా,మరోవైపు గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నా కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని ఎత్తిపోయకపోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు ఆపదలో అండగా నిలువలేకపోయింది. కాఫర్ డ్యాం నిర్మించి నీళ్లు ఎత్తిపోయవచ్చని విశ్రాంత ఇంజనీర్లు మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల గేట్ల పరిస్థితి, నీటి నిల్వ, ఎన్డీఎస్ఏ సూచనలు అంటూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. గత 20 ఏప్రిల్ 2026న సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డను సందర్శించి పునరుద్దరణ పనులపై సమీక్షించారు.
సీడబ్ల్యుఎస్ఎ, ఎన్ డీఎస్ఏ, సీడబ్ల్యుసి, వంటి సంస్థల సాంకేతిక పరిశీలనల ఆధారంగా పనులు చేపట్టాలని, నమూనాల పరీక్షలు, జియోఫిజికల్, జియోటెక్నికల్ పరిశోధనలు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎన్ డీఎస్ఏ నివేధిక ఆధారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని ప్రకటించినా ఇంతవరకు ముందుకు సాగింది లేదు. పునరుద్ధరణ చర్యలు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పుడు పూర్తవుతాయి, ఏ బ్యారేజీ ఎప్పుడు వినియోగంలోకి వస్తుంది, నీటి పోతలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. మరమ్మత్తుల పేర సాకులు చెపుతూ కాలం వెళ్లదీసేబదులు అందుకు అవసరమైన మరమ్మత్తులు, పునరుద్దరణ పనులు వేగంగా పూర్తి చేసి రైతులకు నీరందించే బాధ్యత లేదా..? పంటలు ఎండిపోయిన తర్వాత సాంకేతిక కారణాలు చెప్పడం వల్ల రైతులకు ఒరిగేదేముంది?
విఫల ప్రాజెక్టుగా చూపించడమే లక్ష్యమా..?
ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులపై విమర్శలు చేయడం సహజమే. కానీ ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టులను రాజకీయాలకు అతీతంగా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వంపై ఉంటుంది. కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలుంటే సరిదిద్దాలి. తప్పులు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి, చట్ట ప్రకారం విచారణ జరిపించాలి అందులో ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ లోపాలను సరిదిద్ది ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావడం ఒక బాధ్యత అయితే, ప్రాజెక్టు ప్రయోజనాలు ప్రజలకు అందకుండా ఉండిపోవడం మరో సమస్య. కన్నెపల్లి వద్ద నీటి ఎత్తిపోతల నిలిచిపోవడం, బ్యారేజీల పునరుద్దరణలో జాప్యంపై విమర్శలు, మల్లన్న సాగర్ వద్ద బ్లాస్టింగ్ ఆరోపణలు ఈపరిణామాలన్నింటిపై ప్రభుత్వం సమగ్ర వివరణ ఇవ్వాలి.
కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయంగా విఫలమైనదిగా నిరూపించాలనే ఉద్దేశంతోనే ఈ పరిణామాలు జరుగుతున్నాయా..? అన్న అనుమానాలు ప్రతిపక్షం వ్యక్తం చేస్తున్నది. ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. రైతుల భవిష్యత్ను బలిచేయవద్దు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు కరీంనగర్, నల్గొండ, వరంగల్, మేడ్చల్, నిజామాబాద్ తదితర జిల్లాల రైతులు ఈప్రాజెక్టుపై ఆశలు పెట్టుకున్నారు. వర్షాలు సరిగా కురవకపోతే భూగర్భ జలాలపై ఆధారపడే పరిస్థితి మళ్లీ వస్తుంది. ఎత్తిపోతలు జరగకపోతే, ప్రాజెక్టు పునరుద్దరణ ఆలస్యమైతే రైతుల పెట్టుబడులు, పంటలు, జీవనాదారం అన్నీ దెబ్బతింటాయి. వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టులు నిరుపయోగంగా ఉండిపోవడం రాష్ట్రానికి ఆర్ధిక నష్టమే కాదు, రైతుల జీవితాలపై ఫెను ప్రభావం చూపిస్తుంది.
ప్రభుత్వం సమాధానం చెప్పాలి..!
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల మరమ్మత్తులకు స్పష్టమైన కాలపరిమితి ప్రకటించాలి. ఎన్ డీఎస్ఏ అనుమతులు, సాంకేతిక సూచనల పరిధిలో సాధ్యమైన చోట నీటి ఎత్తిపోతలకు ఉన్న అవకాశాలను పరిశీలించాలి. మల్లన్న సాగర్ వద్ద జరుగుతున్న పనుల అనుమతులు, బ్లాస్టింగ్ భద్రతపై స్వతంత్ర నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలి. ప్రాజెక్టు భద్రతకు ఎలాంటి ముప్పు లేదని ఆధారాలతో ప్రజలకు భరోసా ఇవ్వాలి. తెలంగాణకు గోదావరి జలాలు రావాలి రైతుల పంట పొలాలు పచ్చబడాలి. హైదరాబాద్ ప్రజలకు తాగునీరు అందించాలి. అదే సమయంలో ఇప్పటికే నిర్మించిన ప్రాజెకులు కూడా సురక్షితంగా ఉండాలి. ఒక ప్రాంతానికి నీళ్లు అందించాలనే పేరుతో మరో ప్రాంత రైతుల సాగునీటి ప్రయోజనాలు దెబ్బతినకూడదు. ప్రాజెక్టులు రాజకీయ పార్టీల ఆస్తులు కావు, ప్రజల ఆస్తులు కేసీఆర్ కట్టినవైనా, రేవంత్ రెడ్డి నిర్మించినవైనా వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కాళేశ్వరాన్ని విమర్శించడం కాదు, కాళేశ్వరం ద్వారా తెలంగాణకు రావాల్సిన నీటిని రైతులకు తరలించడం ముఖ్యం. రాజకీయాలకు అతీతంగా ప్రాజెక్టులను కాపాడి, రైతుల భవిష్యత్తుకు భరోసా కల్పించడమే అసలైన బాధ్యత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *