భారీ థైరాయిడ్ కణితి తొలగింపు

– ఏడేళ్ల క్రితం శస్త్రచికిత్స జరిగిన ప్రాంతంలోనే మరోసారి..
– సూడాన్ మహిళకు ‘కేర్’ లో క్లిష్టమైన శస్త్రచికిత్స

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : మెడ నుంచి ఛాతీలోకి విస్తరించిన భారీ థైరాయిడ్ కణితితో బాధపడుతున్న సూడాన్ మహిళ(37)కు హైదరాబాద్ కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి సుమారు 15/10 సెం.మీ పరిమాణంలో పెరిగిన థైరాయిడ్‌ను తొలగించారు. దాదాపు ఏడాది నుంచి ఆమె మెడ ముందు భాగంలో వాపుతో బాధపడుతున్నారు. వైద్యం కోసం సూడాన్ నుంచి వచ్చిన ఆమెను కేర్ హాస్పిటల్స్ వైద్యులు పరీక్షించగా థైరాయిడ్ గ్రంథి అసాధారణంగా పెరిగినట్లు గుర్తించారు. కుడివైపు థైరాయిడ్ భాగం సుమారు 15/10 సెం.మీ పరిమాణానికి పెరిగి మెడ నుంచి ఛాతీలోని కీలక అవయవాలు ఉండే మధ్య భాగం (మీడియాస్టినమ్) వరకు విస్తరించినట్లు తేలింది. సాధారణంగా థైరాయిడ్ గ్రంథి మెడ దిగువ భాగంలో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అది భారీగా పెరిగి ఛాతీలోకి విస్తరించవచ్చు. ఇలా పెరిగిన థైరాయిడ్ శ్వాసనాళం, ఆహారనాళం, ప్రధాన రక్తనాళాలకు దగ్గరగా చేరితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మింగడంలో సమస్యలు, స్వరంలో మార్పులు, మెడ లేదా ఛాతీలో ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ కేసులో మరో ప్రధాన సవాలు గతంలో జరిగిన థైరాయిడ్ శస్త్రచికిత్స. ఒకసారి ఆపరేషన్ జరిగిన ప్రాంతంలో మళ్లీ శస్త్రచికిత్స చేయడం సాంకేతికంగా క్లిష్టమైన ప్రక్రియ. మొదటి శస్త్రచికిత్స కారణంగా ఏర్పడిన మచ్చ కణజాలం, సహజ నిర్మాణంలో వచ్చిన మార్పుల వల్ల కీలక నరాలు, రక్తనాళాల చుట్టూ అత్యంత జాగ్రత్తగా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. దీనికితోడు థైరాయిడ్‌లో కొంత భాగం ఛాతీలోకి విస్తరించడం చికిత్సను మరింత క్లిష్టంగా మార్చింది.
కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాహుల్ రెడ్డి లేవాకలి నేతృత్వంలో డాక్టర్ అజయ్ చాణక్య, డాక్టర్ రాము దాములూరితో కూడిన వైద్య బృందం శస్త్రచికిత్స చేపట్టింది. రోగికి జనరల్ అనస్థీషియాలో టోటల్ థైరాయిడెక్టమీ నిర్వహించారు. గత శస్త్రచికిత్స కారణంగా మారిన కణజాల నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని థైరాయిడ్‌ను అత్యంత జాగ్రత్తగా వేరు చేశారు. ఛాతీలోకి విస్తరించిన భాగాన్ని వీడియో అసిస్టెడ్ థొరాకోస్కోపిక్ సర్జరీ అనే మినిమల్లీ ఇన్వేసివ్ విధానంలో విజయవంతంగా తొలగించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాహుల్ రెడ్డి మాట్లాడుతూ ‘ఈ కేసులో థైరాయిడ్ పరిమాణం ఒక్కటే సవాలు కాదు.. ఏడేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో శస్త్రచికిత్స జరగడంతో మచ్చ కణజాలం ఏర్పడి, సహజ నిర్మాణంలో మార్పులు వచ్చాయి. దీనికితోడు థైరాయిడ్‌లో గణనీయమైన భాగం ఛాతీలోకి విస్తరించింది.. అందువల్ల పక్కా ప్రణాళిక రూపొందించి కీలక నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాట్స్ విధానంతో అత్యంత జాగ్రత్తగా శస్త్రచికిత్స నిర్వహించాం’ అని తెలిపారు. థైరాయిడ్ వాపు నొప్పి లేకుండా ఉందని నిర్లక్ష్యం చేయకూడదు.. కొన్ని థైరాయిడ్ వాపులు నెమ్మదిగా పెరుగుతాయి.. ప్రారంభంలో పెద్దగా లక్షణాలు కనిపించకపోవచ్చు.. కానీ పరిమాణం పెరిగి ఛాతీలోకి విస్తరించినప్పుడు శ్వాసనాళం, ఆహారనాళం, చుట్టుపక్కల కీలక నిర్మాణాలపై ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది.. అప్పుడు చికిత్స కూడా మరింత క్లిష్టంగా మారవచ్చు. ప్రతి థైరాయిడ్ వాపు క్యాన్సర్ అని భావించాల్సిన అవసరం లేదు.. అయితే మెడలో వాపు తగ్గకుండా ఉండటం లేదా క్రమంగా పెరుగుతుంటే తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి ఆయన సూచించారు. కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ప్రమోద్ గుప్తా మాట్లాడుతూ ‘ఇలాంటి క్లిష్టమైన కేసుల్లో శస్త్రచికిత్స ఒక్కటే కాదు.. అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, ముందస్తు ప్రణాళిక, వివిధ విభాగాల మధ్య సమన్వయం చాలా కీలకం.. పరీక్షల నుంచి చికిత్స, కోలుకోవడం, తదుపరి వైద్య పర్యవేక్షణ వరకు సమగ్ర వైద్యం అందించడమే మా లక్ష్యం’ అని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *