– కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల బండారం బట్టబయలు
` కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : పార్లమెంటు ఆమోదించిన చట్టాలను గౌరవించకపోవడం, తమ రాజకీయ అవసరాల కోసం వాటిని దుర్వినియోగం చేయడం ఇప్పటికైనా మానాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి హితవు పలికారు. దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో న్యాయస్థానం తీర్పు పట్ల యావత్ తెలంగాణ సమాజం, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజల తీర్పుకు విరుద్ధంగా, నాయకులను పార్టీలు మార్పించడం గత అనేక సంవత్సరాలుగా పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఇదే విధంగా ఫిరాయింపులను ప్రోత్సహించారని, ఆ తర్వాత బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కూడా అదే పద్ధతిలో చట్టాలను ఉల్లంఘించారని గుర్తుచేశారు. నాడు కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని కనీసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించకుండానే బీఆర్‌ఎస్‌లో చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చారని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే అడుగుజాడల్లో నడుస్తోందని విమర్శించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికై చట్టానికి విరుద్ధంగా పార్టీ మారిన దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌ను స్పీకర్ కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించగా ఇది చట్టవిరుద్ధమని, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించడమేనని న్యాయస్థానం గుర్తించిందని తెలిపారు. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు దానం నాగేందర్ ఏ రోజైతే లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ వేశారో ఆ రోజు నుంచే శాసనసభ్యుడిగా కొనసాగడానికి వీలు లేదని స్పష్టం చేస్తూ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడం అత్యంత సమంజసమైన, న్యాయమైన తీర్పు అని కొనియాడారు.
దిల్లీ వేదికగా రాజ్యాంగ పుస్తకం పట్టుకుని ‘సంవిధాన్ బచావో’ అని తిరిగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరు పచ్చి బూటకమని కిషన్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ రికార్డుల ప్రకారం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నారని తెలిసినప్పటికీ తమ హైకమాండ్ ఆయనకు ఏ ప్రాతిపదికన ఎంపీ టికెట్ ఇచ్చిందో రాహుల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు పట్ల రాహుల్ స్పందన ఏమిటో చెప్పాలన్నారు. రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు గానీ, రాహుల్ గాంధీకి గానీ ఉందా అని ప్రశ్నించారు. గతంలో సీపీఐ, బీఎస్పీ సహా అనేక పార్టీలను చీల్చిన చరిత్ర కాంగ్రెస్‌దేనని గుర్తు చేస్తూ ఇలాంటి దుర్మార్గపు, రాజ్యాంగ వ్యతిరేక, అవినీతి పాలన పట్ల ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. అధికార దుర్వినియోగం, అవినీతి విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య ఎలాంటి తేడా లేదని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. అప్పుడు కేటీఆర్ అనేక దుకాణాలు ఓపెన్ చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అనేక దుకాణాలు ఓపెన్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ తెచ్చుకున్నది విచ్చలవిడిగా అప్పులు చేయడానికా, ఉన్న భూములు అమ్ముకోవడానికా, లిక్కర్ దందా పెంచడానికా, భూములు ఆక్రమించుకోవడానికా, కుటుంబ పాలన తెచ్చుకోవడానికా, ఇచ్చిన హామీలను విస్మరించడానికా అని నిలదీశారు. 1,200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకున్నది ఈ స్వార్థపూరిత, అక్రమ పాలన కోసం కాదన్నారు. కాళేశ్వరం కూలేశ్వరమైందని, లక్ష కోట్లు గోదావరిలో పోశారని అసెంబ్లీలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి అధికారంలో ఉండి, పోలీసు వ్యవస్థ చేతిలో ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఈ రెండు పార్టీలు ప్రజల తీర్పును కాలరాసే, అధికార దుర్వినియోగానికి పాల్పడే పార్టీలేనని స్పష్టం చేశారు. కేసీఆర్ నోటికి ఏది వస్తే అది హామీలిచ్చి, విపరీతంగా అప్పులు చేసి, గ్రామాలలో మద్యం ఏరులై పారించి ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొట్టారని విమర్శించారు. ఎక్కడపడితే అక్కడ ప్రభుత్వ భూములు వేలం వేయడం, ధరణి పేరుతో సామాన్య ప్రజలను, రైతులను ఇబ్బంది పెట్టడం, హైదరాబాద్‌లో భూదందాలకు తెరలేపారని మండిపడ్డారు. నేడు కాంగ్రెస్ తీరు కూడా బీఆర్ఎస్‌కు తీసిపోదని విమర్శించారు. భావి తరాల అవసరాల కోసం భూములను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి ఇప్పటికే హైదరాబాద్‌ను కాంక్రీట్ జంగిల్‌గా మార్చేశారని విమర్శించారు. మనం ఉన్నా లేకపోయినా వేల సంవత్సరాలు ఉండే ఈ భూమిని, ప్రజల అవసరాల కోసం కొన్ని ఓపెన్ ల్యాండ్స్‌ను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని హితవు పలికారు. ఏ రకంగా మీకు ఓటు వేసి గెలిపించారో అదే చేతులతో, అదే ఆలోచనతో మిమ్ములను ఫామ్‌హౌస్‌లకు, గండిపేటలో ఉన్నటువంటి మరో ఫామ్‌హౌస్‌కు పంపడం ప్రజలకు బాగా తెలుసని కిషన్ రెడ్డి హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





