భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

 – సమన్వయంతో సకాలంలో పూర్తి చేయాలి
– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : గ్రామాల్లో మంజూరైన గ్రామ పంచాయతీ, గ్రామ సమైక్య, అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఆయా భవనాల నిర్మాణ పనుల పురోగతిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క సచివాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొత్తం 9,745 గ్రామ సమైక్య భవనాలు మంజూరు కాగా ఇప్పటివరకు 534 భవనాల నిర్మాణ పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మరో 6,141 భవనాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని, 3,070 భవనాల నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉందని మంత్రికి వివరించారు. పనులు ప్రారంభం కాని భవనాలకు సంబంధించి కారణాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సమస్యలను శాఖల మధ్య సమన్వయంతో పరిష్కరించి పనులను వేగవంతం చేయాలన్నారు.

3,906 గ్రామ పంచాయతీ భవనాల” మంజూరు

రాష్ట్రంలో 3,906 గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు కాగా 444 భవనాల పనులు పూర్తయ్యాయని, మిగిలిన 3,444 భవనాల పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. గ్రామ పంచాయతీ భవనాలు గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలనకు కీలకమైన మౌలిక వసతులని పేర్కొన్న మంత్రి నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

అంగన్‌వాడీ భవనాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి

అంగన్‌వాడీ భవనాల నిర్మాణంపై సమీక్షలో 2,313 అంగన్‌వాడీ భవనాలు మంజూరు కాగా ఇప్పటివరకు 200 భవనాల పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మిగిలిన 2,113 భవనాల పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ భవనాల నిర్మాణానికి అదనపు నిధుల సమీకరణకు ఎంపీ లాడ్స్ నిధులను కూడా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్రంలోని ఎంపీలకు తానే లేఖలు రాయనున్నట్లు తెలిపారు. చిన్నారుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంగన్‌డీ భవనాల నిర్మాణానికి ఎంపీ లాడ్స్ నుంచి కనీసం రూ.కోటి చొప్పున కేటాయించేలా ఎంపీలను కోరుతూ లేఖలు రాయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. అలాగే అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం నుంచి రూ.8 లక్షల వరకు వినియోగించుకునే అవకాశం ఉందని, మిగిలిన రూ.4 లక్షల కోసం అందుబాటులో ఉన్న ఇతర నిధులను వినియోగించాలని కలెక్టర్లకు మంత్రి సూచించారు.

శాఖల మధ్య సమన్వయం పెంచాలి

గ్రామీణ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్న వీటి నిర్మాణాలకు సంబంధించి నిధులు, స్థలం, అనుమతులు, సాంకేతిక అంశాలు తదితర కారణాలతో పనులు ఆలస్యం కాకుండా అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించాలని సూచించారు. నిర్మాణ పనుల పురోగతిని ఇకపై క్రమం తప్పకుండా ప్రతి నెలా పర్యవేక్షిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. మంజూరైన పనుల్లో ఏవి పూర్తయ్యాయి, ఏవి పురోగతిలో ఉన్నాయి, ఇంకా ప్రారంభం కాని పనులు ఎందుకు ప్రారంభం కాలేదు అనే అంశాలపై ప్రతి సమీక్షలో వివరాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

హ్యామ్ రోడ్ల పనులు దసరాలోపు ప్రారంభించాలి

గ్రామీణ ప్రాంతాల్లో రహదారి మౌలిక వసతుల అభివృద్ధిపై కూడా మంత్రి సీతక్క సమీక్షించారు. హ్యామ్ విధానంలో చేపట్టనున్న రోడ్ల నిర్మాణ పనులను దసరాలోపు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప్యాకేజీల వారీగా రోడ్ల నిర్మాణ పనుల పురోగతి, కాంట్రాక్టు కంపెనీల సన్నద్ధత, అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. సంబంధిత కాంట్రాక్టు కంపెనీలు పనులు ప్రారంభించేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, మంజూరైన పనులు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో వేగంగా అమలు కావాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సమీక్షలో స్పెషల్ సీఎస్ దాన కిశోర్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ శృతి ఓఝా, పంచాయతీరాజ్ ఈఎన్సీ జగదీష్‌తోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *