కాంట్రాక్టు అధ్యాపకులను వెంటనే క్రమబద్ధీకరించాలి

– ఈజేపీ చీఫ్ రామచందర్‌రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు డిమాండ్ చేశారు. అధ్యాపకులను విలీనం లేదా క్రమబద్ధీకరించే వరకు ఉద్యోగ భద్రతతో కూడిన 7వ పీఆర్సీ, యూజీసీ పే స్కేల్స్ వెంటనే అమలు చేయాలని, ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే నూతన నియామకాలు చేపట్టాలని స్పష్టం చేశారు. అధ్యాపకుడికి రేపటి భవిష్యత్తుపై భరోసా లేకపోతే ఉన్నత విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతుందని, విద్యా వ్యవస్థ కూలిపోతే సమాజం కూడా ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సెంట్రల్ వర్సిటీలు, నల్సార్ వంటి జాతీయ స్వయంప్రతిపత్తి సంస్థల్లో 90 శాతానికి పైగా శాశ్వత అధ్యాపకులే ఉంటారని, అయితే తెలంగాణ వర్సిటీల్లో సంస్కృతం, హిందీ, ఆర్కియాలజీ వంటి విభాగాలతోపాటు అనేక కీలక డిపార్టుమెంట్లను కేవలం కాంట్రాక్టు లెక్చరర్లతోనే నెట్టుకురావడం తీవ్ర విచారకరమని అన్నారు. ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ, ఎంఫి¾ల్ వంటి అత్యున్నత విద్యార్హతలు కలిగిన వారు రూ.15,000 నుంచి రూ.39,000 వంటి అరకొర వేతనాలతో పదేళ్లుగా ఉద్యోగ భద్రత లేక అల్లాడుతుండడం కేవలం పాలనా సమస్య మాత్రమే కాదని, తీవ్రమైన మానవీయ సమస్య అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఆదా పేరుతో విద్యా రంగానికి నిధులు కుదించడం తగదని, రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన విద్యా రంగానికి కేటాయింపులను జాతీయ సగటుకు అనుగుణంగా పెంచాల్సిందేనని స్పష్టం చేశారు. కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ విషయంలో ఉమాదేవి, భోలేనాథ్ వంటి సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా దేశంలోని ఇతర రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అమలు చేసిన విధానాలను ఇక్కడ కూడా అమలు చేయవచ్చని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయ చిత్తశుద్ధి ఉంటే చట్టపరమైన మార్గాల ద్వారా అధ్యాపకులను విలీనం చేయడం సాధ్యమేనని, యూజీసీ నిబంధనల పేరుతో సాకులు చెప్పి కాలయాపన చేయడం సమంజసం కాదని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం లేదా యూజీసీ పరిధిలో ఏవైనా నిబంధనల వెసులుబాటు లేదా ఇతర సహకారం కావాల్సి వస్తే బీజేపీ రాష్ట్ర శాఖ తరఫున కేంద్ర విద్యాశాఖ (హెచఆర్‌డీ) మంత్రితో స్వయంగా మాట్లాడి పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తామని రామచందర్ రావు హామీ ఇచ్చారు. గతంలో తాను శాసనమండలి సభ్యుడిగా ఉన్న సమయం నుంచి కాంట్రాక్టు అధ్యాపకుల న్యాయ పోరాటానికి అండగా నిలిచానని, న్యాయపరంగానూ, కేంద్ర-రాష్ట్ర స్థాయిల్లోనూ వారికి న్యాయం జరిగే వరకు బీజేపీ బాసటగా నిలుస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *