సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అసలైన ఉద్యమకారులకు గుర్తింపు లభించడంపై తెలంగాణ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది. బిఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్‌ను ఎంపిక చేయగా, కాంగ్రెస్‌పార్టీ అద్దంకి దయాకర్‌కు ఎంఎల్సీ అభ్యర్థిగా టికెట్ కేటాయించింది. వీరిద్దరూ ఉద్యమకారులే కావడంతో యావత్ తెలంగాణ సమాజం వారికి సముచిత న్యాయం జరిగిందన్న సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో ఇద్దరూ కలిసి పనిచేసిన వారే అయినప్పటికీ, వేర్వేరు పార్టీలో చేరిపోయారు. దాసోజు శ్రవణ్ ఈ మధ్యకాలంలో పలు పార్టీలు మారినా, దయాకర్ మాత్రం మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014లో ఆ తర్వాత 2018లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దయాకర్ తుంగతుర్తి శాసనసభకు పోటీచేసి ఓటమిని చవిచూశారు.
ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన 2013 అసెంబ్లీ ఎన్నికల్లో నోరు జారడంతో టికెట్ చేజారిపోయింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఉద్దేశించి మాట్లాడిన తీరుపై పార్టీ ఆయనపై క్రమశిక్షణ చర్య తీసుకుంది. దానిపై ఆయన క్షమాపణలు చెప్పినప్పటికీ టికెట్ లభించే అవకాశం లేకుండా పోయింది. అప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, పార్టీకి ఎంతో లాయల్‌గా ఉంటూ, అవకాశాల పట్ల ఓపికగా ఎదురుచూస్తున్న దయాకర్‌కు ఈసారి అదృష్టం వరించింది. ఇంతా కాలం పార్టీ గొంతుకై పనిచేసిన ఆయనకు ప్రజల ఆశయాలమేరకు చట్టాలను రూపొందించే సభలో స్థానం లభించబోవడం నిజంగా ఆయన కష్టానికి ప్రతిఫలం లభించినట్లేనని చెప్పాలి.
ఇక దాసోజు శ్రవణ్ విషయానికొస్తే ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి వీర విధేయుడిగా పనిచేసిన వ్యక్తి. ఉన్నత విద్యావంతుడిగా విషయ పరిజ్ఞానం కలిగి వాగ్దాటి ఉన్న వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. తెలంగాణ ఉద్యమకాలంలో టీవీ డిబేట్లలో, ఇతర ప్రచార సాధనాల ముందు తన వాక్చాతుర్యంతో తెలంగాణ వ్యతిరేకుల నోళ్ళను కట్టి పడేసిన వ్యక్తి. 2008లో ప్రజారాజ్యం పార్టీలో రాజకీయ రంగప్రవేశం చేసినప్పటి నుంచి నేటి ఎంఎల్సీ ఎన్నికల వరకు పోటీ అవకాశాలు లభించినా, ఒక్కసారి కూడా ఆయనకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించలేదు. 2009లో పిఆర్‌పి నుంచి సికిందరాబాద్ లోక్ సభకు పోటీచేసి పరాజయం పాలయ్యారు. పిఆర్‌పి కాంగ్రెస్‌లో కలవడంతో ఆయన బిఆర్‌ఎస్‌లో చేరి తెలంగాణ జాయింట్ యాక్షన్ స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2014లో టిఆర్‌ఎస్ నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడడంతో కాంగ్రెస్‌లో చేరారు.
అక్కడ ఇమడలేక బిజెపిలోకి మారారు. అక్కడా ఉండలేక తిరుగుటపాలో మళ్లీ బిఆర్‌ఎస్‌లో (2022 అక్టోబర్ 21) చేరిపోయారు. అప్పటి నుంచి ఆపార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతూ, ఆపార్టీ అధినేత కెసిఆర్ ఆడుగుజాడల్లో నడుస్తూ వొచ్చారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం మొదలు, నిన్నటి వరకు ఆయన పార్టీకి అందించిన సేవలకు గుర్తింపుగా బిఆర్‌ఎస్ ఆయన్ను ఎంఎల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. గత శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులనేకులు ఎంతో ఆశపడినప్పటికీ కెసిఆర్ మాత్రం శ్రవణ్‌నే అభ్యర్థిగా ఎంచుకున్నారు. పార్టీకి మరో ముఖ్య వ్యక్తిగా కొనసాగుతున్న ఆర్‌ఎస్ ప్రవీణ్ పేరు బాగా వినిపించినప్పటికీ ఆయనకూడా శ్రవణ్ అభ్యర్దిత్వంపట్ల హర్షం వ్యక్తం చేయడం గమనార్హం.
తెలంగాణలో ఉద్యమ నేతగా గుర్తింపున్న విజయశాంతికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో దశాబ్ధాలుగా ఆ పార్టీ అంటిపెట్టుకుని ఉన్న అనేక మంది నాయకులకు ఈ కేటాయింపు ఆశాభంగమైంది. వాస్తవంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధిష్ఠానానికి ఇచ్చిన ఎంఎల్సీ అభ్యర్థుల జాబితాలో విజయశాంతి పేరులేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంతకాలం వరకే పార్టీలో ఆమె వాయిస్ వినిపించింది. ఆ తర్వాత కాలంలో ఆమె సైలెంట్ అవుతూ వొచ్చింది. పార్టీ పక్షాన జరిగిన సభలు, సమావేశాల్లో కూడా ఆమె భాగస్వామ్యం తగ్గిపోయింది. ఆమె యాక్టివ్‌గా లేదని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతుంటే, తనకు గుర్తింపు కరువైందని ఆమె తన సన్నిహితులతో చెప్పుకుంటున్న వార్తలు అడపాతడపా వినిపిస్తున్నాయి.
మొత్తానికి ఈసారి ఎంఎల్సీ అభ్యర్థులుగా కాంగ్రెస్ ఎంపిక చేసిన జాబితా అధిష్ఠానం కనుసన్నల్లో జరిగిందన్న ప్రచారం జరుగుతున్నది. ఆ జాబితాలో విజయశాంతి పేరు అనూహ్యంగా వెలువడింది. పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జిగా కొత్తగా చార్జి తీసుకున్న మీనాక్షి నటరాజన్ వ్యూహంలో భాగమంటున్నారు. బిఆర్‌ఎస్ పక్షాన మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న కల్వకుంట్ల కవితకు దీటైన వ్యక్తిగా విజయశాంతిని ఎంపిక చేసి ఉంటారనుకుంటున్నారు. ఉద్యమకాలంలో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌తో సమానంగా పార్లమెంటులో పోరాటం చేసినప్పటికీ మాటల్లో గానీ, విషయాల పట్ల అవగాహన చేసుకునే విషయంలో కవితకు విజయశాంతి సరితూగేనా అన్న చర్చ కూడా జరుగుతున్నది.
(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి





