– ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాల్లో తొలి దశ సర్వే
– నక్షాలు లేని మరో 413 గ్రామాల్లోనూ సమగ్ర భూసర్వే
– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
వనపర్తి / హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28: రాష్ట్రంలో భూసమస్యల శాశ్వత పరిష్కారానికి భూసర్వే ఏకైక పరిష్కారమార్గమని
రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మార్గనిర్దేశం ప్రకారం భూ సమస్యలకు సంబంధించి దీర్ఘకాలిక సమస్యల్లో కొన్నింటిని ఇప్పటికే పరిష్కరించామని త్వరలో మరికొన్నింటికి పరిష్కారం చూపిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా నాలుగు గోడల మధ్య ఆలోచన చేయకుండా ప్రజల కోణంలో ఆలోచన చేసి సమస్యను పరిష్కరిస్తున్నామని అన్నారు. భూ భారతి చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి భూ పార్శిల్‌కు ప్రత్యేక గుర్తింపు, జియో కోఆర్డినేట్స్‌తో కూడిన మ్యాప్, ఎల్‌పీఎం నంబర్ అందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి వివరించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లావ్యాప్తంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, హౌసింగ్ అంశాలపై వనపర్తిలో సోమవారం సమీక్ష అనంతరం మంత్రి పొంగులేటి సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ధరణి చట్టం వలన ప్రజలకు కలిగిన అసౌర్యాలు, అవస్ధలను రూపుమాపుతూ భూభారతి పోర్టల్ లో పేర్కొన్నవిధంగా భూధార్ కార్డులను అందించడమే ధ్యేయంగా ఈ ప్రజా ప్రభుత్వం సర్వే కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. భూభారతి కింద 70 రెవెన్యూ గ్రామాలను తొలి దశలో సర్వేకు ఎంపిక చేయగా, రాష్ట్రంలో నక్షాలు అందుబాటులో లేని సుమారు 413 రెవెన్యూ గ్రామాలను కూడా దశలవారీగా సర్వే చేసే కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. భూ సర్వేను వేగవంతం చేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరికరాలను ప్రభుత్వం పెద్ద ఎత్తున సమకూర్చిందని మంత్రి తెలిపారు. తొలి దశలో కొనుగోలు చేసిన రోవర్లతోపాటు రెండో దశలోనూ అదనపు రోవర్లను సమకూర్చి, జిల్లాల వారీగా అవసరానికి అనుగుణంగా అందిస్తున్నామని చెప్పారు. అలాగే వేలాది మంది సర్వేయర్లకు లైసెన్సులు మంజూరు చేసి క్షేత్రస్థాయిలో సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నామని తెలిపారు. సర్వేయర్లు ఎలాంటి రాజకీయ ప్రచారాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వ కార్యక్రమంలో భాగస్వాములై రైతులకు శాశ్వత ప్రయోజనం చేకూర్చాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. దశాబ్దాలుగా సాగులో ఉన్నప్పటికీ సరైన టైటిల్ లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాల సమస్యలను కూడా గుర్తించి, నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. సాదాబైనామాలు, భూ హద్దుల వివాదాలు, పాత రికార్డుల్లోని లోపాలు, అబాది ఆస్తుల వివరాలు వంటి గ్రామీణ ప్రాంత సమస్యలకు సమగ్ర సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం చూపవచ్చన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రికార్డులు, మ్యాపులను ఆధునీకరించడం భూ భారతి లక్ష్యమన్నారు. గ్రామాల్లో ఇళ్ల స్థలాలు, నివాస ప్రాంతాలు, అబాది ఆస్తులపై గతంలో విస్తీర్ణానికి సంబంధించిన స్పష్టమైన మ్యాపింగ్ లేకపోయిన సందర్భాలు ఉన్నాయని మంత్రి చెప్పారు. ఇకపై సర్వే ద్వారా ఆ ఆస్తి ఎన్ని గజాల్లో ఉంది, దాని హద్దులు ఎక్కడున్నాయి అనే వివరాలను మ్యాప్‌తో సహా రికార్డుల్లో పొందుపరుస్తామని తెలిపారు. భూ భారతి చట్టం అబాది, వ్యవసాయేతర భూములకు ప్రత్యేక రికార్డులు నిర్వహించడం, వాటి మూలలను జియో-కోఆర్డినేట్లతో మ్యాప్ చేయడం కోసం నిబంధనలు కలిగి ఉందని వివరించారు.
భూ సమస్యల పరిష్కారంతోపాటు పేదల సొంతింటి కలను సాకారం చేయడంలోనూ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి తెలిపారు. తొలి విడతలో మంజూరైన 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో ఇప్పటికే రెండు లక్షలకు పైగా ఇళ్లు పూర్తయ్యాయని, మిగిలిన ఇళ్లను కూడా లక్ష్యబద్ధంగా పూర్తి చేస్తామని చెప్పారు. రెండో విడతలో నిర్మాణం ప్రారంభించే ఇళ్లలో గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పేదల ఇళ్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. గుడిసె లేని రాష్ట్రం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రెండో విడతలో అవకాశం రాని అర్హులైన పేదలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆర్థిక పరిస్థితులు ఎన్ని సవాళ్లు ఎదురైనా మూడో విడత, నాలుగో విడతల ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





