వైఐఐఆర్ఎస్‌ నిర్మాణాలను పరుగులు పెట్టించండి

– కచ్చితమైన క్యాలెండర్‌తో పనులు పూర్తి చేయాలి
– గడువులోగా భవనాలు అందించాలి
– సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ
– ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి 

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ (వైఐఐఆర్ఎస్‌)  భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్ లో వైఐఐఆర్ఎస్‌ భవన నిర్మాణ పురోగతిపై ఇంజనీరింగ్ విభాగం ఉన్నత స్థాయి అధికారులతో ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ఈ పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి ఇంజనీరింగ్ అధికారులు రాత్రింబవళ్లు శ్రమించి పనుల్లో పురోగతి చూపాలన్నారు. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు కులమతాలకు అతీతంగా ఒకే ప్రాంగణంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నాణ్యమైన విద్యను, సకల సౌకర్యాలను అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసి మైనారిటీ వర్గాల పిల్లలందరినీ ఒకేచోట చేర్చి సమీకృత పద్ధతిలో అత్యుత్తమ విద్యాబోధన అందించడం ద్వారా విద్యార్థుల్లో సామాజిక సమానత్వం పెంపొందుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఈ పాఠశాల భవనాల నిర్మాణానికి సంబంధించి జిల్లా కలెక్టర్లతో కలిసి ఇంజనీరింగ్ అధికారులు వెంటనే ప్రత్యేక ‘వర్క్ క్యాలెండర్’ను రూపొందించాలని ఆదేశించారు. వారానికోసారి పనుల పురోగతిని సమీక్షించి తనకు క్రమం తప్పకుండా నివేదికలు పంపాలని స్పష్టం చేశారు. నిర్మాణ పనులను క్షేత్రస్థాయి నుంచి నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా నిర్మాణ ప్రాంతాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వచ్చే నెల రెండో వారం నుంచి నిర్మాణంలో ఉన్న స్కూళ్లను తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఈ సమావేశంలో ఈఎంసీ గణపతి రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల నిర్మాణ పురోగతి వివరాలను డిప్యూటీ సీఎంకు నివేదించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 87 నియోజకవర్గాల్లో ఈ పాఠశాలలు మంజూరయ్యాయని, అందులో 70 పాఠశాలల నిర్మాణ పనులు వేగంగా ప్రారంభమయ్యాయని తెలిపారు. మరొక ఐదు పాఠశాలలకు సంబంధించి డీపీఆర్ తయారు చేస్తున్నామని, మూడింటి టెండర్లు ముగింపు దశకు వచ్చాయని, మిగిలిన నాలుగు పాఠశాలలకు సంబంధించి స్థల సమస్యలు ఉన్నాయని వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన కాలపరిమితికి అనుగుణంగా పనులన్నీ పూర్తి చేసి భవనా లను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు డిప్యూటీ సీఎంకు హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *