– పార్టీ అధ్యక్షుడి నిర్బంధంపై బీజేపీ ఫైర్
– రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి
– అరెస్టులే సమస్యలకు పరిష్కారమా?
– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు
జడ్చర్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : జూరాల ప్రాజెక్టు వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావును జడ్చర్ల వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న పార్టీ అధ్యక్షుడిని అడ్డుకోవడంపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూరాల ప్రాజెక్టు వద్ద ఆందోళన చేస్తున్న రైతుల సమస్యలను తెలుసుకునేందుకు బయలుదేరిన రామచందర్ రావును రైతుల వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని,. రైతుల గొంతుకను అణచివేయొద్దని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
రైతుల గొంతు నొక్కేందుకే అక్రమ అరెస్టులు, నిర్బంధాలు
కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై రామచందర్ రావు ఆగ్రహం
ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే పరిష్కరించాల్సిందిపోయి అక్రమ అరెస్టులతో నిరసనలను అణచివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని రామచందర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జూరాల ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన తమ బృందాన్ని జడ్చర్ల వద్ద పోలీసులు అడ్డుకుని నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేపట్టినా, ప్రజా సమస్యలపై ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించినా అరెస్టులు చేస్తున్నారే తప్ప సమస్యల పరిష్కారానికి పూనుకోవడం లేదన్నారు. మొన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలపై పోరాడినా, నేడు అన్నదాతల సమస్యలపై స్పందించినా ప్రభుత్వానికి నిర్బంధాలే సమాధానంగా మారాయని ఆక్షేపించారు. రైతులు అక్కడ తమను కలవనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో వారి గోస వినేందుకు తాము ఇక్కడికి రావాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాలు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, జూరాల ప్రాజెక్టు పరిధిలోని రైతులు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా ఎల్‌నినో ప్రభావం వల్ల నీరు ఇవ్వడానికి ఇబ్బంది ఉంటే వ్యవసాయ అధికారులు, మండలస్థాయి అధికారులతో రైతులకు ఎందుకు కౌన్సెలింగ్ ఇప్పించలేదని ప్రశ్నించారు. నీటి లభ్యత తక్కువగా ఉంది కాబట్టి వేరే పంటలు వేసుకోవాలని ముందుగా రైతులకు చెప్పకుండా విత్తనాలు వేసి పంటలు మొలిచిన తర్వాత ఇప్పుడు నీళ్లు ఇవ్వం అని చెప్పడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. పంటలకు నీరు అవసరమని తెలిసినా వ్యవసాయ, నీటిపారుదల శాఖ మంత్రులు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. తాగునీటి కోసం దాచిపెడుతున్నామని స్థానిక మంత్రులు మాట్లాడుతున్నారని, అటు నారాయణపూర్, ఆల్మట్టి ప్రాజెక్టుల్లో నీళ్లు నిండుకుండలా ఉన్నాయని, ఆ నీళ్లను ఇవ్వకుండా రాజకీయం చేయడం సరికాదని అన్నారు. తమను ఆపినంత మాత్రాన రైతు ఉద్యమం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఒక్క జూరాల కిందే కాక నాగార్జునసాగర్, గోదావరి ప్రాజెక్టుల కింద పసుపు, పత్తి, వరి, మొక్కజొన్న పండించే ప్రతి రైతు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫసల్ బీమా కన్నా మెరుగైన పథకం తెస్తామని చెప్పి వెయ్యి రోజులు దాటినా ఇంతవరకు దానిపై ఊసే లేదని విమర్శించారు. ఇలాంటి విపత్కర సమయంలోనే బీమా అక్కరకు వస్తుందని, కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజననైనా ఇక్కడ వర్తింపజేయాలని లేదా రాష్ట్ర ప్రభుత్వమైనా కొత్త బీమా పథకాన్ని తేవాలని డిమాండ్ చేశారు. జూరాల కింద రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉండి ఉంటే ఈ నష్టం జరిగేది కాదన్నారు. ప్రభుత్వం నీటిని విడుదల చేస్తే అది సంతోషకరమని, దాన్ని రైతుల విజయంగా భావిస్తామన్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి రైతులకు ఒక్క పైసా బయటకు వెళ్లాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను నిలిపివేసే ధోరణి ప్రదర్శిస్తోందని రామచందర్ రావు ఆరోపించారు. రైతుబంధు కింద రూ.15,000 ఇస్తామని చెప్పి ఎన్ని ఎకరాలకు ఇచ్చారో లెక్క చెప్పాలని, కొనుగోలు కేంద్రాల్లో రూ.500 బోనస్ ఎంతమందికి ఇచ్చారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎంత ఇచ్చినా అది పెట్టుబడి మాత్రమే అవుతుంది తప్ప ఖర్చు కాదని అన్నారు. ఎరువులపై దాదాపు 80 శాతం సబ్సిడీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంటే రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడగానే సరిగ్గా పనిచేయని యాప్‌లను ముందుకు తెచ్చి ఆ వైఫల్యాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని తప్పుబట్టారు. ఎరువుల నిర్వహణ, మార్కెటింగ్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. రైతులు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సింది పోయి ప్రశ్నించే వారిని అరెస్టు చేయడం, రైతులపై లాఠీఛార్జి చేయడం, ప్రాజెక్టుల సందర్శనను అడ్డుకోవడం ప్రజాస్వామ్య పద్ధతి కాదన్నారు. ఇదే సమయంలో పాలమూరు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదని రామచందర్ రావు ప్రస్తావించారు. బాధితులు తనను కలిసి గోడు వెళ్లబోసుకున్నారని, ఎకరానికి రూ.20 లక్షల దాకా అడుగుతుంటే బోర్లు, బావులు, మామిడి చెట్లు అన్నింటికీ కలిపి కేవలం రూ.15 లక్షలే ఇస్తామనడం అన్యాయమని అన్నారు. కొడంగల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ భూసేకరణకు ఏ ప్రాతిపదికన పరిహారం ఇచ్చారో ఇక్కడి భూనిర్వాసిత రైతులకు కూడా అదే ప్రాతిపదికన పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ రైతులకు, నిర్వాసితులకు అండగా ఉంటుందని, వారి పక్షాన పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





