– చిన్న పిల్లల వార్డులో పేలిన ఏసీ
– ఇద్దరు శిశువుల మృతి
– మరో 28మంది చిన్నారులు సురక్షితం
ఆదిలాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ హాస్పిటల్ ఎస్‌ఎన్సీయూ వార్డులో సోమవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. చిన్న పిల్లల వార్డులో ఒక్కసారిగా ఏసీ పేలడంతో దట్టమైన పొగలు కమ్ముకుని ఇద్దరు శిశువులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి వార్డులోని మరో 28మంది చిన్నారులను సురక్షితంగా బయటకు తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంపై పోలీసులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. కలెక్టర్ రాజర్షి షా హుటాహుటిన హాస్పిటల్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రమాదం తర్వాత అక్కడున్న రోగులు, వారి బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఆసుపత్రి నుంచి బయటకు చిన్నారులను తీసుకుని పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యామంటున్నారు తల్లులు. బయటకు తరలించిన చిన్నారులకు వేర్వేరు హాస్పిటల్స్‌లో చికిత్స అందిస్తున్నారు.
స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 
ఆదిలాబాద్ రిమ్స్‌లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమంటూ బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాక ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, రాష్ట్రంలోని అన్ని హాస్పిటల్స్‌లో భద్రతా చర్యలను పటిష్టం చేసి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
పరిస్థితిని సమీక్షించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్
ఈ ఘటనపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. శిశువుల మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందో లేదో వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులందరికీ హాస్పిటల్‌లో అత్యుత్తమ వైద్యం అందించాలని, అగ్నిప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై తక్షణమే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
తీవ్రంగా కలచివేసింది : మంత్రి సీతక్క
ఆదిలాబాద్ రిమ్స్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపె మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతిచెందిన చిన్నారుల కుటుంబాలకు ధైర్యాన్ని ప్రసాదించాలని మంత్రి భగవంతుడిని ప్రార్థించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అలసత్వం కారణం
ఆదిలాబాద్‌లోని రిమ్స్ లో అగ్నిప్రమాద ఘటన తీవ్రంగా కలచివేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసికందులు దట్టమైన పొగ రూపంలో వచ్చిన మృత్యువుకు బలికావడం అత్యంత బాధాకరమన్నారు. ఈ దుర్ఘటనలో తమ బిడ్డలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నియోనాటల్ కేర్ యూనిట్ వంటి అత్యంత సున్నితమైన, ప్రాణాపాయ స్థితిలో ఉండే పసికందులు చికిత్స పొందే వార్డులో కనీస విద్యుత్ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, ఎయిర్ కండీషనర్ల నిర్వహణను గాలికి వదిలేయడం క్షమించరాని నేరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అలసత్వ వైఖరి కారణంగానే అమాయక ప్రాణాలు బలికావాల్సి వచ్చిందన్నారు. ప్రమాదం నుంచి బయటపడి ఇతర హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న మిగతా చిన్నారులకు ప్రభుత్వం మెరుగైన, అత్యున్నత వైద్యం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ దుర్ఘటనపై ఉన్నతస్థాయి సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై, హాస్పిటల్ యాజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిడ్డలను కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవడంతోపాటు, వారికి తక్షణమే తగిన ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో తక్షణమే సేఫ్టీ, ఫైర్ ఆడిట్ నిర్వహించి భద్రతా లోపాలను సరిదిద్దాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





