– నగరాభివృద్ధికి రూ.84,790 కోట్లతో సమగ్ర కార్యాచరణ
– మూసీ పునరుజ్జీవం, ఆరఆరఆర్, ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్‌కు కొత్త రూపు
– రియల్ ఎస్టేట్ రంగం రాష్ట్ర ప్రగతిలో భాగస్వామి కావాలి
– నారెడ్కో ప్రాపర్టీ షోలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
– మూసీ పునరుజ్జీవం, ఆరఆరఆర్, ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్‌కు కొత్త రూపు
– రియల్ ఎస్టేట్ రంగం రాష్ట్ర ప్రగతిలో భాగస్వామి కావాలి
– నారెడ్కో ప్రాపర్టీ షోలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోని అభివృద్ధి చెందిన నగరాలకు దీటుగా తీర్చిదిద్దడంతో పాటు తెలంగాణను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిలబెట్టడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నగరాభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల పాత్ర అత్యంత కీలకమని, ఈ రంగంలో ఉన్నవారిని కేవలం వ్యాపారవేత్తలుగా కాక సంపద సృష్టికర్తలుగా ప్రభుత్వం గుర్తిస్తోందన్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో శుక్రవారం నిర్వహించిన నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. హైదరాబాద్‌కు దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే అనేక అనుకూలతలు ఉన్నాయని, మోస్ట్ లివబుల్ సిటీగా గుర్తింపు పొందిన ఈ నగరంలో స్థిరపడేందుకు వివిధ ప్రాంతాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు కల్పించిన మౌలిక సదుపాయాలను మరింత విస్తరిస్తూ ప్రస్తుత ప్రభుత్వం నగరాభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు.
రూ.84,790 కోట్లతో నగరాభివృద్ధికి బృహత్తర ప్రణాళిక
హైదరాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం సుమారు రూ.84,790 కోట్లతో భారీ కార్యాచరణను రూపొందించిందని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇందులో ఇప్పటికే సుమారు రూ.55 వేల కోట్ల పనులకు సంబంధించి డిజైన్లు, టెండర్ల ప్రక్రియ చేపట్టడంతోపాటు పలు పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. రానున్న రోజుల్లో నగరంలోని ప్రతి ప్రాంతంలో అభివృద్ధి పనులు, నిర్మాణ కార్యక్రమాలు కనిపిస్తాయని చెప్పారు. హెచఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్, మెట్రో రైలు తదితర మౌలిక సదుపాయాల కోసం రూ.52,706 కోట్లు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డుకు రూ.15,849 కోట్లు కేటాయించి పనులు ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. జీహెచఎంసీ పరిధిలో రూ.4 వేల కోట్లు, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.2,500 కోట్లు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.2,163 కోట్లు, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రహదారుల అభివృద్ధికి రూ.500 కోట్లతో పనులు చేపడుతున్నట్లు వివరించారు.
మూసీ పునరుజ్జీవంతో నగరానికి కొత్త ఆభరణం
మూసీ నదిని మురికి కూపం నుంచి స్వచ్ఛమైన జలాలతో ప్రవహించే నదిగా మార్చి హైదరాబాద్‌కు గొప్ప ఆస్తిగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పమని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన నగరాలు తమ మధ్యలో ప్రవహించే నదులను శుద్ధి చేసి పర్యాటక, ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేసుకున్నాయని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో మూసీ పునరుజ్జీవన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. తొలి దశలో సుమారు రూ.7,500 కోట్ల పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని చెప్పారు. మూసీలోకి మురుగు నీరు చేరకుండా నగరంలోని 21 ప్రధాన నాలాల వద్ద ఒకేసారి మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చి టెండర్ల ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎస్టీపీల సంఖ్యను 38కు పెంచే ఆలోచన ఉందన్నారు. శుద్ధి చేసిన నీటిని పారిశ్రామిక అవసరాలు, ఉద్యానవనాల నిర్వహణకు వినియోగించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. మూసీ నది భవిష్యత్తులో హైదరాబాద్‌కు అతిపెద్ద ఆభరణంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.
భారత్ ఫ్యూచర్ సిటీతో అభివృద్ధికి నూతన దిశ
సుమారు 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని భట్టి తెలిపారు. ఇందులో 15 వేల ఎకరాలను పచ్చదనం, విశాలమైన బహిరంగ ప్రదేశాల కోసం కేటాయించడం విశేషమన్నారు. మొత్తం భూభాగంలో 50 శాతం గ్రీన్ స్పేస్‌గా ఉంచుతూ నగర నిర్మాణం చేపట్టడం దేశంలోనే ప్రత్యేకతగా నిలుస్తుందని చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు తోడుగా భారత్ ఫ్యూచర్ సిటీ మరో కీలక అభివృద్ధి కేంద్రంగా రూపుదిద్దుకోనుందని పేర్కొన్నారు. నగరాభివృద్ధికి అవసరమైన నీటి వనరుల విషయంలోనూ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, కృష్ణా, గోదావరి జలాలను నగరానికి తీసుకొచ్చే ప్రణాళికలు హైదరాబాద్ విస్తరణకు దోహదపడ్డాయని గుర్తుచేశారు.
కాలుష్య నియంత్రణకు హిల్ట్ పాలసీ
హైదరాబాద్‌ను స్వచ్ఛమైన, పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దేందుకు హిల్ట్ పాలసీని తీసుకొచ్చినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఓఆరఆర్ పరిధిలోని పరిశ్రమలను దశలవారీగా బయటకు తరలించడం ద్వారా నగరంలో కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రజా రవాణాలో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడంతోపాటు ఆటోలను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు సబ్సిడీతో కూడిన సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, ఆధునిక రవాణా వ్యవస్థల సమన్వయంతో హైదరాబాద్‌ను మరింత నివాసయోగ్యమైన నగరంగా అభివృద్ధి చేస్తామన్నారు.
రోడ్ల అభివృద్ధికి రూ.93 వేల కోట్లు
హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రవాణా సదుపాయాలను మెరుగుపరిచేందుకు సుమారు రూ.93 వేల కోట్లతో రహదారుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. నాలుగు వరుసల రహదారులు, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. నగరాభివృద్ధితో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
నిర్మాణ రంగానికి అవసరమైన నైపుణ్య మానవ వనరులు
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనతో ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి తరగతులు కూడా ప్రారంభించినట్లు వెల్లడించారు. శిక్షణ పూర్తిచేసిన యువతకు పరిశ్రమల్లోనే ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా వినూత్న విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ?రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని, ఆధునిక యంత్రాలు, నిర్మాణ రంగ సాంకేతికతలపై యువతకు శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు, ప్రతిభ కలిగిన యువతను ప్రభుత్వమే శిక్షణ ఇచ్చి అందించేందుకు సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. నగరంలో లగ్జరీ గృహాలతోపాటు పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్లు నిర్మించే అంశంపై కూడా దృష్టి సారించాలని పరిశ్రమ వర్గాలకు సూచించారు. గతంలో హౌసింగ్ బోర్డు ద్వారా నిర్మించిన ఎంఐజీ, ఎలఐజీ గృహాలు అనేక కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చాయని గుర్తు చేశారు. అదే తరహాలో దీర్ఘకాలిక ప్రణాళికతో అందుబాటు గృహ నిర్మాణానికి ముందుకు రావాలని కోరారు. తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ ప్రతినిధులు భాగస్వాములై సంపద సృష్టికర్తలుగా ముందుకు రావాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





