ప్రభుత్వం మరో మానవీయ నిర్ణయం

– ఇక అన్ని సామాజిక భద్రతా పింఛన్లలోనూ ఇన్‌స్టంట్ పెన్షన్ సదుపాయం

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్‌ 30ః సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తూ తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక మానవీయ నిర్ణయం తీసుకుంది. పింఛన్‌దారులైన భర్తలు మరణించిన సందర్భాల్లో వారి భార్యలకు తక్షణమే సామాజిక భద్రతా పింఛన్ మంజూరు చేసే ‘ఇన్‌స్టంట్ పెన్షన్’ సదుపాయాన్ని మరిన్ని కేటగిరీలకు విస్తరిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి సీతక్క ఆదేశాలతో తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా అనేక పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది. ఇప్పటివరకు కేవలం వృద్ధాప్య పింఛన్ పొందుతున్న భర్త మరణిస్తేనే ఆయన భార్యకు ఈ ఇన్‌స్టంట్ పెన్షన్ సౌకర్యం అందుబాటులో ఉండేది. తాజాగా దీనిని దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్, హెచ్‌ఐవీ, ఫైలేరియా బాధితుల కుటుంబాలకు కూడా వర్తింపజేస్తూ విస్తరించారు. మరణించిన పింఛన్‌దారుడి భార్య వయస్సు 57 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే ‘వితంతు పింఛన్’ మంజూరు చేస్తారు. 57 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ‘వృద్ధాప్య పింఛన్’ కింద తక్షణమే పింఛన్ అందజేస్తారు.

దరఖాస్తు విధానం & కావలసిన ధ్రువపత్రాలు

జీవిత భాగస్వామిని కోల్పోయిన మహిళలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా అండగా నిలిచేందుకు దరఖాస్తు ప్రక్రియను ఎంతో సులభతరం చేశారు: గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శికి, పట్టణ ప్రాంతాల్లో బిల్ కలెక్టర్‌కు దరఖాస్తు అందజేయాలి. భార్య ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ, మరణించిన భర్త ఆధార్ కార్డు, మరణ ధ్రువీకరణ పత్రం (డెత్ సర్టిఫికేట్). సంబంధిత అధికారులు పత్రాలను పరిశీలించి, ‘చేయూత’ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి అర్హత ధ్రువీకరించుకున్న వెంటనే పెన్షన్ మంజూరు చేస్తారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *