రక్తరేఖ!

   మెరుపు తీగెలు
“ఏమిటిది?” భక్తుల్ని అడిగాడు మారు రూపంలో వున్న యీశ్వరుడు.
“గీత!” అన్నాడొకడు. “ముళ్ళకంచె” అన్నాడొకడు. “ఊరికి హద్దు!” అన్నాడొకడు. “దేశానికి సరిహద్దు!” అన్నాడొకడు.
“కావచ్చు. కాని మనుషుల మధ్యలో యెందుకు?” అర్థంకాలేదు యీశ్వరుడికి.
“వాళ్ళు వేరు… మేం వేరు” చెప్పాడొకడు.
“ఏ దేవుడు చెప్పాడు?” అడిగాడు మారు రూపంలో వున్న అల్లా.
“దేవుడే చెప్పాలా? ఆ మాటకొస్తే వాళ్ళ దేవుడు వేరు. మా దేవుడు వేరు” తేల్చేశాడు మరొకడు.
“అంతా వొకే వూరు కదా? ఇప్పుడు రెండు వూళ్ళుగా యెందుకు?” మారు రూపంలో వున్న అల్లాకీ బోధపడలేదు.
“నాలుగు తరాలుగా అంతే” అన్నాడు యింకొకడు.
“అంతకు ముందు కలిసే వున్నారుగా?” అమాయకంగా చూశారు దేవుళ్ళు.
“ఇప్పుడు మా జెండాలు వేరు!” తన్మయత్వంతో చెప్పారు భక్తులు. గీత గీతలా లేదు. గోడలా లేదు. కోటగోడలా వుంది! గీతకు అటూ యిటూ సైనికభటులు కాపలా కాస్తున్నారు!
“గీతలు వూళ్ళని వేరుచెయ్యొచ్చు, భూమిని కాదు!” అన్నాడు పిల్లాడు చేజారిన బంతిని చేతుల్లోకి చేతుల్లోకి తీసుకుంటూ.
“ఇది నిషేధిత స్థలం… రిస్ట్రిక్టెడ్ యేరియా… యిక్కడ ఆడకూడదు… తిరగకూడదు…” సాయుధ సైనికులు కవాతుచేశారు. “ఇటునుంచి అటు వెళ్ళకూడదు… అటునుంచి యిటు రాకూడదు… అంతే కాదు, కలిసి ఆడకూడదు కూడా…” హెచ్చరించారు.
అయినా పిల్లాడు అక్కడినుండి కదలకుండా నిలబడి “నదులు యిటునుంచి అటు ప్రవహిస్తున్నాయి మరి?” అనుమానంగా చూశాడు. సమాధానం రాలేదు.
మళ్ళీ అడిగాడు పిల్లాడు. “గాలులు కూడా యిటునుంచి అటు… అటునుంచి యిటు వీస్తున్నాయి?”
భక్తులకి కోపం వచ్చింది, కాని జవాబు చెప్పలేకపోయారు.
“పక్షులు కూడా అటునుంచి యిటు… యిటునుంచి అటు… తిరుగుతున్నాయి?” పిల్లాడు మళ్ళీ ప్రశ్నించాడు.
భక్తులూ సైనికులూ ముఖాముఖాలు చూసుకున్నారు.
“ఎండ వొకటే… వాన వొకటే… అటూ యిటూ ఆకాశం వొకటే… మట్టీ మబ్బూ వొకటే…” పిల్లాడి మాటలు భక్తులకు ఆగ్రహాన్ని తెప్పిస్తే, దేవుళ్ళకు అనుగ్రహాన్ని కలిగించింది. ‘ఆ పిల్లాడి చేతిలో బంతిలా యీ భూమి వుంటే యెంత బాగుణ్ణు’ అని కూడా అనుకున్నారు.
కొద్దిసేపు మౌనంగా వున్న పిల్లాడు కాలివేళ్ళతో గీతను చెరిపేశాడు, ముగ్గు గీతని చెరిపినట్టు చెరిపేశాడు.
దేవుళ్ళు చిరునవ్వు నవ్వారు.
భూమి పులకించింది, తన మీద పరిచిన ముళ్ళకంచెని తీసేసినందుకు!
అటూ యిటూ వున్న భక్తులూ సైనికులూ కలిసిపోయారు… పిల్లాడ్ని బంధించడంలో!
భక్త సైనికుల తలల్లో గీసిన గీతల్ని కనిపెట్టిన దేవుళ్ళు తామే సృష్టించినా సరే, ఆ గీతల్ని చెరపడం తమవల్లకాదని చేతులెత్తేశారు!

పిల్లాడి నెత్తురుతో అక్కడ వో రక్తరేఖ పునరుద్ధరించబడింది!

-బమ్మిడి జగదీశ్వరరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *