తరువాత వచ్చిన నరసరాజు మొండోడి కోనదగ్గర కయ్య దున్నాలని పిలుస్తాడు. తాను కాణీపాకం పోవాలని గుణశేఖరుడు మొత్తుకొన్నా వినడు. చివరికి వెళ్లి, పాముల నుంచి కాపాడుకొంటూ ఆ కయ్య దున్నాక ‘ఇప్పుడు డబ్బులులేవు, తరువాత ఇస్తాలే’ అని జారుకొంటాడు నరసరాజు. ‘నాకు దొరికే వాళ్ళంతా కష్టాల కడలిలో గజ ఈతగాళ్లు. సన్యాసి సన్యాసి రాసుకొంటే రాలేది బూడిదే కదా! ఎవర్నని ఏమి లాభం? నా ఖర్మ ఇలా కాలుతోంది’ అనుకొంటూ ట్రాక్టర్ స్టార్ట్ చేసినాడు. తంజావూరు సుబ్రహ్మణ్యం కూడ ఇలానే పొలం అడుసుదున్ని పోవాలని పిలిస్తే వెళ్ళాడు. కానీ, ఈ సారి మొదటికే మోసం వచ్చింది. అక్కడి బురదను బండి కూరుకుపోయింది. వేగం పెంచి బండి బయటికి లాగాలని చూశాడు గుణశేఖరుడు. కానీ, దెబ్బకి ట్రాక్టర్ బోల్తాపడింది. గుణశేఖరుడికి కుడిభుజం విరిగింది. దగ్గరనున్న మనుషులను కేకలేసి పీల్చి, గుణశేఖరుడిని బయటికి లాగారు. బండి బురదలోంచి వెలికి తీశారు.
ఇన్సూరెన్సు వెంకటముని వచ్చి బండి ఇన్సూరెన్సు క్లెయిమ్ కు సాయం చేశాడు. ఎటూ గుణశేఖరుడి ఊరు పుత్తూరు ఎముకల కట్లకు ప్రపంచ ప్రఖ్యాతి కాబట్టి అక్కడే కట్టుకట్టించుకొన్నాడు. నాలుగునెలలు విశ్రాంతి అవసరమని చెప్పారు పుత్తూరు ఎముకల వైద్యులు. ఈ కాలంలో బండి ఖాళీగా ఉంచకుండా ఎవరైనా మంచిడ్రైవర్ దొరికితే బాగుండుననుకొన్నాడు గుణశేఖరుడు. ఇంతవరకూ గుణశేఖరుడు ఎదుర్కొన్న సమస్యలొక ఎత్తైతే, ఇప్పుడు ఎదురవుతున్న సమస్యలు మరోఎత్తు. అలా ట్రాక్టర్ డ్రైవర్ ఉద్యోగానికి వచ్చిన కన్నదాసన్ వ్యసనాలు దాచిపెట్టి ఉద్యోగంలో చేరినా, మందుకొట్టి పనిచేయడంలో తడబిడ పడి కొట్లాట తెచ్చాడు ఇంటిపైకి. ఆ తరువాత వచ్చిన సిద్దులయ్య చేసిన నిర్వాకం అట్లానే ఉండింది. దాంతో బండి ఉన్నా నడిపే వాళ్ళు లేని పరిస్థితి గుణశేఖరుడిది.
గుణశేఖరుడి పరిస్థితికి అద్దం పట్టేట్లు రచయిత కొన్ని ‘మేలుకొలుపు’ వంటి సందర్భోచిత వాక్యాలు పలికిస్తాడు. ‘గుణశేఖరా! ఉన్నవాడు ట్రాక్టర్ తీస్తే అది వాడికి ఆస్తి అవుతుంది. అదే లేనివాడు తీస్తే అప్పు మిగుల్తుంది. ఎందుకంటే ఉన్నవాడు అవసరమైనప్పుడు ట్రాక్టర్ను తన పొలానికి వాడుకొంటాడు. ఖాళీ సమయాల్లో బాడుగకు తిప్పుకొంటాడు’ అని మినీ ఓమిని వాన్ నడుపుకునే వీరామరాజుతో బోధ చేయిస్తాడు రచయిత. అంతేనా! కష్టకాలంలో మనుషులు బోధించే నీతులు చాలవన్నట్లు ఉడుతలతో ఆటపట్టిస్తాడు రచయిత. పుండుమీద పుట్రలా పరస్పర విరుద్ధమైన వారఫలాలు కూడ గుణశేఖరుడిని బాధిస్థాయి.
ప్రస్తుతం గుణశేఖరుడి ముందున్న ప్రత్యామ్నాయం ఒక్కటే. తనకున్న తలకోన స్థలం అమ్మేయటం, అప్పులు తీర్చేయటం. ఆ స్థలం తన స్నేహితుడు శ్రీనివాస్ తో కలిసి కొన్నది. వెంటనే అతన్ని కలుస్తాడు. అతను గూడ అమ్మాలనే ఉందని చెబుతాడు. కానీ, అనుకోని కారణాలతో ప్రభుత్వం ఆ స్థలం అమ్ముకోకుండా అడ్డుకొంటుంది. లెక్కలేనన్ని దిగుళ్ళు, అవమానాలు మోస్తూ ఇంటికి చేరతాడు. అంతకు ముందే బాలాజీ సిద్దరాజు ట్రాక్టర్ పోకుండా ఆపడానికి తీవ్రప్రయత్నం చేసి, కిందపడి, దెబ్బలపాలై వాడి సోషల్ ఆయ్యోరు బండికి అడ్డంగా పడిపోతాడు. ఆయన వాడిని లేపి, కాసిని నీళ్లు తాగించి, వాడి ఈ కష్టానికి కారణం కనుక్కొని ఒక పరిష్కారం చెబుతాడు. వాడికి మెకానికల్ ఇంజనీర్ కావాలన్న కోరిక సాకారం అయ్యే మార్గం చెబుతాడు. దానిని తూ.చ. తప్పక ఆచరించి బాలాజీ తల్లి హైమవతి కోరినట్టు కారులో తిరుపతి తీసుకెళ్తాడు నాన్న గుణశేఖరుడిని, నాయనమ్మ నారాయణమ్మను. కథలో నారాయణ ఇంట్లో ‘బ్రహ్మా కమలం’ వికసించే అర్ధరాత్రి చాలా ఆకర్షణీయంగా రాశారు రచయిత.





