చెమ్మ : వారాల ఆనంద్
తెలంగాణ కవిత్వమంటే ఒకప్రాంతపు కవిత్వం మాత్రమేకాదు అది ఒకసమాజపు చరిత్ర, పోరాటం, అస్తిత్వాన్వేషణ. ఇక్కడి కవిత్వం మట్టివాసనతో, సామాజిక చైతన్యంతో, భావోద్వేగ గాఢతతో ప్రత్యేకంగా ధ్వనిస్తుంది. ప్రధానంగా తెలంగాణ కవిత్వం పోరాటస్వరంతో గుర్తించబడుతుంది. ప్రాంతీయ అసమానతలు, దోపిడీ, అన్యాయాలపై ఈ కవిత్వస్వరం పలుకుతుంది. ఇక్కడ కవిత నినాదంగా, ఆయుధంగా మారింది. ఇదే ప్రధానస్వరూపం. ప్రాంతీయ అస్తిత్వం మరో కీలకలక్షణం. తెలంగాణ భాష, సంస్కృతి, జీవన విధానం ఈ కవిత్వంలో స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. తెలంగాణ కవిత్వం మట్టివాసనతో కూడిన వాస్తవికతను కలిగి ఉంటుంది. రైతు, కూలీ, పల్లెజీవిత వాస్తవికత కవిత్వానికి ప్రాణం పోస్తుంది. భాషపరంగా సరళత, సహజత్వం కనిపిస్తుంది. అలంకారాల కంటే సూటిమాటకే ప్రాధాన్యతనిస్తుంది. ఈ సరళత వల్లే కవిత్వం సామాన్య పాఠకుడికి చేరువవుతుంది. సామాజిక స్పృహ అంతర్ముఖత కూడా కనబడుతుంది. మొత్తంగా తెలంగాణ కవిత్వం ఒకేధోరణిలో ఉండదు. అది ఒకసారి గర్జన మరోసారి గుసగుసగా కూడా వినిపిస్తుంది. కవిత్వం ఇక్కడ కళ మాత్రమే కాదు సజీవ ప్రకటన.
తెలంగాణ కవిత్వం ఒక గొప్ప ప్రవాహం అయితే, కవి డాక్టర్ ఎన్. గోపి అందులో ఉపనది. అది గర్జించదు, కానీ లోతుగా ప్రవహిస్తుంది. ఆ ప్రవాహంలో మనం మన ప్రతిబింబాన్ని చూసుకుంటాం. అందుకే ఆయన స్థానం కవిత్వ గర్భంలో నిలిచిన నిశ్శబ్ద స్వరం అనొచ్చు. ఎన్.గోపి కవిత్వం తన పదాల మధ్య ఖాళీల్లో ఉంటుంది. ఆ ఖాళీ మూల అర్థాన్నిస్తుంది. ఆయన కవితలు చదివేసి పేజీల్ని తెప్పేసేవి కాదు. చదివాక పాఠకులలో ఆ నిశ్శబ్దం కొన్నిసార్లు లోపంగా మారుతుంది. తను అరవాల్సిన సమయాల్లో గుసగుసలాడుతాడు. అగ్నిపర్వతం కావాల్సిన చోట చిన్నదీపం వెలిగిస్తాడు. అది అందంగానే ఉంటుంది. కానీ వేడిగా ఉండదు.
గోపి తెలుగు కవిత్వానికి అందించిన ‘నానీలు’ ముఖ్యమైన మలుపు. చిన్న పరిమాణంలో పెద్దభావాన్ని చెప్పే ఈ రూపం, తెలంగాణ భాషా స్వభావానికి దగ్గరగా ఉంటుంది. సూటిగా, స్పష్టంగా, లోతుగా ఇదే తెలంగాణ మాట. ఈ రూపం ద్వారా ఆయన కవిత్వం సామాన్య పాఠకులకి చేరువైంది. చెట్టు గురించి రాసినప్పుడు ‘అది కేవలం చెట్టుకాదు, మనిషి విసిరిన రాళ్లను కూడా, నీడగామార్చే కరుణ’. కాలం గురించి పలికినప్పుడు “కాలం గడియారం కాదు, గుండెదడలే ” అనడంద్వారా సమయాన్ని అనుభూతిగా చూస్తారు. ఈ తాత్విక దృష్టి ఆయన కవిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. “చెట్టు రాళ్లను తిన్నా నీడనే ఇస్తుంది”, “అమ్మ పిలుపులో పేరు ఉండదు, ప్రేమ మాత్రమే ఉంటుంది”, “బీడునేలలో పగుళ్లమధ్య, చెమట మొలకెత్తుతుంది” ఇట్లా సాగుతుంది కవిత్వం.
తెలంగాణ కవిత్వం ప్రధానంగా పోరాటం బాహ్యప్రపంచంపై దృష్టిపెట్టగా, గోపికవిత్వం అంతర్గతప్రపంచాన్ని అన్వేషిస్తుంది. కాలం, జీవితం, సంబంధాలు ఇవి ఆయన కవిత్వంలో ప్రధాన అంశాలు. ఎన్. గోపి తెలుగు ఆచార్యుడు, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగానికి అధ్యక్షుడిగా, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపసంచాలకునిగా పనిచేశారు. పలు కవితాసంకలనాలతో సహా దాదాపు ముప్ఫైపుస్తకాలు ప్రచురించారు. వీటిలో ప్రధానంగా తంగేడుపూలు, మైలురాయి, చిత్రదీపాలు, వంతెన, కాలాన్ని నిద్రపోనివ్వను, చుట్టకుదురు, ఎండపొడ, జలగీతం- దీర్ఘకావ్యం, నానీలు, మరో ఆకాశం, అక్షరాల్లో దగ్ధమై, మళ్ళీ విత్తనంలోకి, ‘మగ్న సంగీతం’ వంటివి ముఖ్యమైనవి. కవిగా ఎన్. గోపి పహచాన్ గా చెప్పుకునే సంకలనం ‘మగ్న సంగీతం’.
‘నన్ను దగ్గరగా గమనిస్తే సూర్యోదయంలోని లేతకాంతుల్లో ఆశలను అలికి ముగ్గులు పెడతాను’. ‘నేను కవితలో వున్నాను వెలుపల కాదు చీమలా పాకుతూ మనిషిని వెతుకుతున్నాను’ ఈ వాక్యాలు కవిగా గోపి పెహచాన్. ఇటీవల వెలువరించిన ఈ కవిత్వం నిండా కవే వున్నాడు. అంటే తను కవిగా, కవి తానుగా వున్నాడు. ఇప్పుడు వర్తమానంలో వస్తున్న కవిత్వాన్ని పరిశీలిస్తే కొందరిలో ఉపన్యాసకుడు, ఇంకొందరిలో వ్యాఖ్యాత, ఇంకొందరి కవిత్వంలో ప్రభోధకుడు కనిపిస్తాడు. కానీ ‘మగ్న సంగీతం’ నిండా కవే కనిపిస్తున్నాడు. మానవ వ్యక్తీకరణల్లో గొప్పదయిన కవిత్వంలో మరో కళాత్మక వ్యక్తీకరణ అయిన సంగీతాన్ని సమన్వయము చేయడం నాకు బాగా నచ్చిన అంశం. అంతేకాదు కవి మనిషి కోసం పడే తపన, కవి కోరిక, కవి ఆశ ఆకాంక్ష అంతేకాదు తనని తాను వెతుక్కునే తత్వం అన్నీ ఈ కవిత్వం నిండా పరుచుకుని వున్నాయి.
“మనసులో మౌనం/ రాగమై విరిసింది/ తపస్సులో తాళం/ కలిసింది” ఈ కవితా పంక్తుల్లో గోపి మనసులోని నిశ్శబ్దాన్ని రాగానికి ప్రతీకగా చూపుతాడు. మౌనం అంటే శూన్యం కాదని, అది ఒక అంతర్రాగమని సూచిస్తాడు. అవును మరి తపస్సు అనే లోతైన ఆత్మచింతనలో లయ (తాళం) కలిసిపోతే జీవితం ఒక సంగీతంగానే అనిపిస్తుంది. ‘రండి మాఇంటికి/ అక్షరాల భోజనం పెడతాను/ మతిమరపు కోసం కాకుండా/ మంచి ఔషదం ఇస్తాను/ మళ్ళీ జన్మంటూ వుంటే లైబ్రరీ పక్కనే జన్మిస్తాను/ నా బ్రతుకుహక్కును పునీతం చేసిన/ అచ్చుయంత్రానికి సమస్కరిస్తాను’ అన్నారు ఎన్.గోపి.





