హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : ’రక్ష’ అనగా రక్షణ, ’బంధన్’ అనగా కట్టడం. సోదరి తన సోదరుడు క్షేమంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ చేతికి రాఖీ కడుతుంది. ఎల్లప్పుడూ తనకు అండగా ఉంటానని, రక్షణగా నిలుస్తానని సోదరీమణులకు సోదరుడు మాటిస్తాడు. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. దీనిని కొన్ని ప్రాంతాలలో జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఈ రోజే జంధ్యం ధరించేవారు కొత్త జంధ్యాన్ని మార్చుకుంటారు. హిందువులు జరుపుకునే పండుగల్లో రాఖీ ఒకటి. ఈ వేడుక సోదర, సోదరీమణులకు మధ్య ప్రేమకు గుర్తుగా పేరుగాంచింది. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుడి మణికట్టుపై రాఖీ కట్టి స్వీటు తినిపించి, హారతినిస్తారు. తనకు రాఖీ కట్టిన సోదరికి ఏదైనా చిరుకానుక బహుమతిగా ఇచ్చి జీవితాంతం కాపాడతానని హామీ ఇచ్చినట్లుగా భావిస్తారు. శుక్రవారం అక్కాతమ్ముళ్లు ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోనున్నారు. ఈ రాఖీ పర్వదినంపై నాటి నుంచి నేటి వరకు అనేక పురాణాలు, కథలు ప్రచారంలో ఉన్నాయి. సోదరుడికి కట్టే రాఖీలు సోదరీమణులకు ఎంతో రక్షణ కవచంగా నిలుస్తాయని విశ్వాసం. మార్కెట్‌లో రుద్రాక్ష, స్టోన్, వెండి, బంగారు రాఖీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కుందన్‌లు, మెరుపులు జరీతోపాటు స్పాంజితో తయారు చేసిన రాఖీలు మార్కెట్‌లోకి వచ్చాయి. పిల్లలను ఆకర్షించేందుకు కార్టున్ రాఖీలు కూడా వచ్చాయి. పాత కాలంలో అతిపెద్దగా ఉండే రాఖీలు ధరించేవారు. రానురాను అవి చిన్నగా మారిపోయాయి. మళ్లీ ఈ సంవత్సరం మార్కెట్‌లోకి పెద్దపెద్ద రాఖీలు దుకాణాల్లో దర్శనిమిచ్చాయి. ఈనెల 28న సూర్యోదయం నుంచి సూర్యస్తమయం వరకు సోదరులకు సోదరీమణులు రాఖీలు కట్టవచ్చని వేద పండితులు చెబుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు