త్రివిధ దళాలకు రాజ్‌నాథ్ సింగ్ ఆదేశం
లక్నో, సెప్టెంబర్ 5 : శాంతిని కాపాడాలంటే సాయుధ బలగాలు యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. లక్నోలో ఏర్పాటు చేసిన త్రివిధ దళాల కమాండర్ల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. రష్యా-ఉక్రెయిన్, గాజా సంక్షోభాలతోపాటు బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించాలన్నారు.
తద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అంచనా వేసుకోవడంతో పాటు ఊహించని పరిణామాలను దీటుగా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. భారత్ శాంతి కోరుకునే దేశమని, దీన్ని కాపాడుకోవాలంటే సాయుధ బలగాలు యుద్ధానికి సిద్ధంగా ఉండాలన్నారు. వాస్తవాధీన రేఖ వెంట నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులను ప్రస్తావించిన ఆయన..శాంతి, స్థిరత్వానికి ఉత్తర సరిహద్దు, పొరుగుదేశాల్లో నెలకొన్న పరిస్థితులు సవాల్ విసురుతున్నాయన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని సైన్యాధికారులు విస్తృత, లోతైన విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.