- దిల్లీకి సంచులు మోయడంలో ఫస్ట్
- రాహుల్ కు ఏటీఎంగా మారిన రేవంత్
- భారత్ సమ్మిట్ కాదు అది కాంగ్రెస్ సమ్మిట్
- ఇన్నిరోజుల్లో విపక్ష నాయకులను తిట్టడం తప్ప చేసిందేమీ లేదు
- రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ సృష్టించిన కరువు
- రాష్ట్రప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: దిల్లీకి మోసిన సంచుల మోసే విషయంలో రేవంత్ రెడ్డికి 10కి 10 మార్కులు వేయొచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR ) ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఓటుకు నోటు కేసులో పట్టుబడినప్పుడు మోసుకెళ్లిన బ్యాగుల విషయంలో కూడా 10కి 10 మార్కులు వేయొచ్చు.తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేయడంలోనూ రేవంత్ రెడ్డికి 10కి 10 మార్కులు వేయొచ్చు. రేవంత్ రెడ్డి వన్ టైమ్ వండర్ లీడర్. ఢిల్లీకి సంచులు పంపే రేవంత్ రెడ్డి ఏటీఎం 2028 డిసెంబర్లో ఎక్స్ పైర్ అవుతుంది. రాహుల్ గాంధీకి ఏటీఎంగా మారిన రేవంత్ ఖచ్చితంగా ఓటమి చెందుతారు. మూడేళ్లలో ఏం చేశారో చెప్పకుండా కేసులు పెట్టి టైం పాస్ చేస్తున్నారన్నారు. అది భారత్ సమ్మిట్ కాదు, అది కాంగ్రెస్ సమ్మిట్. 2028లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది. 2023 ఎన్నికల్లో మేము కేవలం 1.85 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయాం.కాంగ్రెస్ పార్టీ అరచేతిలో స్వర్గం చూపించింది. ప్రజలకు సాధ్యం కాని ఎన్నో హామీలు ఇచ్చింది.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పేరుతో తెలంగాణ ప్రజలకు ఒక అందమైన కథను వినిపించింది.అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామని చెప్పారు.ఇప్పుడు వెయ్యి రోజులు దాటిపోయాయి. హామీల గురించి అడిగితే సమాధానం చెప్పడం లేదు.ప్రతిపక్ష నాయకులను తిట్టడం తప్ప మరేమీ లేదు.కొత్త కొత్త తిట్లు, కొత్త కొత్త కేసులు, కొత్త కొత్త కమిషన్లు. ఇవి తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. .
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇది ఎల్‌నినో ప్రభావం కాదు. ఇది కాంగ్రెస్ ప్రభావం!ఆయనకు ఇప్పుడున్న అతి పెద్ద సమస్య నేను గడ్డం ఎందుకు పెంచుతున్నానన్నదే!రేవంత్ రెడ్డి ఒకప్పుడు తుపాకీ పట్టుకుని తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా వెళ్లిన వ్యక్తి. ఎప్పుడైనా కేసీఆర్‌తో తనను పోల్చుకోవాలనుకుంటే, మాటలతో కాదు.. చేతలతో నిరూపించుకోవాలి. రాహుల్ గాంధీ జేబులో రెండు ఏటీఎం కార్డులు ఉన్నాయి. ఒకటి రేవంత్ రెడ్డి, మరొకటి డీకే శివకుమార్. ఈ రెండు కార్డుల గడువు ముగిసే తేదీ 2028. ఈ తేదీని గుర్తుపెట్టుకోండి.రేవంత్ రెడ్డి అనే వన్ టైమ్ వండర్.. 2028తర్వాత మీకు కనిపించడు. ఇది నా హామీ!ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంపై సమాజంలోని ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు.ఆయన తెలంగాణను రైజింగ్ చేయడం లేదు. తెలంగాణను పూర్తిగా మెస్ చేస్తున్నారు. ‘హిట్లర్ నా అభిమాన స్ఫూర్తి ప్రదాత’ అని బహిరంగంగా రేవంత్ ప్రకటించారు.తెలంగాణ ప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు. పేదల తాత్కాలిక ఇళ్లను, గుడిసెలను కూల్చివేస్తున్నారు.హైడ్రా అనేది ఎంపిక చేసుకుని చర్యలు తీసుకునే ఒక సాధనంగా మారింది.రాజకీయ ఒత్తిళ్లకు, బ్లాక్‌మెయిలింగ్‌కు, వసూళ్లకు ఉపయోగించే సాధనంగా మారిందని నేను ఆరోపిస్తున్నాను.రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరుగుతోంది. అవినీతి పెరుగుతోందన్నారు.
స్వయంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలే ఈ విషయాలపై మాట్లాడారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో రూ.5 లక్షల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్ల వరకు దోచుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వంలో ఏ పని జరగాలన్నా 15 నుంచి 20 శాతం కమీషన్ ఇవ్వాల్సి వస్తోందని మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడారు.
2015లో ఒక ఎమ్మెల్యేకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్ అయ్యాడు.ఫోరెన్సిక్ ఆధారాలు ఉన్నాయి. డాక్యుమెంటరీ ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది.బ్యాగులు తీసుకెళ్లే స్థాయి నుంచి ఇప్పుడు ఢిల్లీ వరకు బ్యాగులు తీసుకెళ్లే స్థాయికి ఎదిగారు. అదే వ్యవహారం కొనసాగుతోంది. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలు అంటూ ఎన్నో హామీలు ఇచ్చారు.మూడేళ్లు గడిచినా హామీల అమలు మాత్రం కనిపించడం లేదు.
రేవంత్ రెడ్డి గోబెల్స్ తరహా ప్రచారం
పదేళ్ల పాలనలో చేసిన అప్పులు కేవలం రూ.2.8 లక్షల కోట్లు మాత్రమే. రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని రేవంత్ రెడ్డి గోబెల్స్ తరహా ప్రచారం చేస్తున్నారు. రూ.2.8 లక్షల కోట్లలో.. రైతుబంధుకి దాదాపు రూ.73 వేల కోట్లు ఖర్చు చేశాం. రూ.90 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు, దాదాపు 32 జిల్లాల్లో ఆధునిక కలెక్టరేట్ భవనాలను నిర్మించాం.హైదరాబాద్‌లో తిరుగుతున్నప్పుడు కనిపించే ఫ్లైఓవర్లలో దాదాపు 42 ఫ్లైఓవర్లను మేమే నిర్మించాం. గత మూడేళ్లలో రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ఒక్క పథకమైనా చూపించండి. కొత్తగా నిర్మించిన ఒక్క మౌలిక సదుపాయాల ప్రాజెక్టునైనా చూపించండి. గత పదేళ్లలో మేము రూ.2.8 లక్షల కోట్ల అప్పులు చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. కానీ రేవంత్ మూడేళ్లలోనే రూ.4.5 లక్షల కోట్ల అప్పులు చేశారు. మరి ఆ డబ్బుతో ఏం చేశారు? ఏ పథకాలు తీసుకొచ్చారు? ఏ కొత్త ప్రాజెక్టులు నిర్మించారు? నరేంద్ర మోదీ ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి కూడా రైతులకు రూ.15 వేల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మోదీ రెండుకోట్ల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి కూడా అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇద్దరూ తమ హామీలను నెరవేర్చలేదు. పెద్ద మోదీ అయినా, చిన్న మోదీ అయినా.. హామీల అమలులో ఇద్దరిదీ ఒకే తీరంటూ విమర్శించారు.





