– అదనపు వసతుల కల్పనపై దిశానిర్దేశం
– తాజాగా మంజూరైన రూ.99.40 కోట్ల పనులపై చర్చలు
– బద్ధి పోచమ్మ ఆలయం అభివృద్ధిపై సమీక్ష
– ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది
సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: శ్రీ రాజరాజేశ్వర స్వామి (రాజన్న) ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, కలెక్టర్ గరిమ అగర్‌వాల్, వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ, వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన బుధవారం పరిశీలించారు. ప్రతి పనిని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 80 అడుగుల రోడ్డు విస్తరణ, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఆలయ అభివృద్ధి చేపట్టడంతో పాటు ఇటీవల శృంగేరి పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతి స్వామి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని పనులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అదనపు వసతులు, ఇతర అంశాలపై క్షుణ్ణంగా చర్చించామన్నారు. ఇప్పటికే మంజూరై, టెండర్లు పూర్తయిన పనులతోపాటు తాజాగా మంజూరైన రూ.99.40 కోట్ల పనులపై చర్చించామని, ప్రతి పనికి సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. పనులను డే అండ్ నైట్ కొనసాగిస్తూ వేగంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశామని వెల్లడించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనుల పురోగతిని సమీక్షించడం, ప్రతి నెలా ఒకసారి క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష సమీక్షా సమావేశం నిర్వహించడం ద్వారా పనులను నిరంతరం పర్యవేక్షణ చేస్తామని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల కోసం రూ.1,000 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.300 కోట్లు విడుదల చేసిందన్నారు. పేదల పెన్నిధిగా, భక్తుల కొంగుబంగారంగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. వేములవాడ ఆలయ అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని హనుమంతరావు తెలిపారు. ప్రస్తుతం రూ.76 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, అలాగే రూ.35 కోట్లతో అన్నదాన సత్రం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మరోవైపు రూ.99.40 కోట్లతో చేపట్టాల్సిన పనులు టెండర్ దశలో ఉన్నాయని, వాటికి నిర్దిష్ట గడువులు విధించి త్వరితగతిన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులు, కళాకృతులు, నిర్మాణాలపై చర్చించామని వివరించారు. బద్ధి పోచమ్మ ఆలయం తదితర అభివృద్ధి అంశాలపై కూడా చర్చించామని తెలిపారు. ఈ అంశాలపై హైదరాబాద్‌లో మరోసారి అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు హనుమంతరావు తెలిపారు. వీటీ ఏడీ ఏ వైస్ చైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రతి శుక్రవారం కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారన్నారు. విప్ శ్రీనివాస్ తరచూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అవసరమైన ఉత్తర్వులు తీసుకురావడంలో చొరవ చూపుతున్నారని తెలిపారు. భవిష్యత్‌లో వేములవాడ రాజన్న ఆలయం అద్భుతమైన కళాఖండంగా, దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకోనుందని అన్నారు. ఆలయ పరిసరాల్లో విశాలమైన ప్రదేశాలు, ఓపెన్ యాంఫిథియేటర్లు, పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలకు అనువైన వసతులు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. సుమారు రూ.12 కోట్లతో గుడి చెరువు బండ్ పార్క్ లో ఆదిశివుడి ప్రతిమ వద్ద అభివృద్ధి చేసిన ఆహ్లాదకరమైన వాతావరణానికి ఇప్పటికే రోజుకు సుమారు రెండువేల మంది పర్యాటకులు వస్తున్నారని చెప్పారు. రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను చిత్తశుద్ధితో పూర్తి చేయాలని ఓఎస్డీ శ్రీనివాసులు సూచించారు. ప్రతి పనిని శ్రద్ధగా అందరూ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రాజన్న ఆలయ వైభవం మరింత చాటేలా గొప్పగా తీర్చిదిద్దాలన్నారు.
ఉన్నతాధికారుల సూచనల మేరకు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని గరిమ అగ్రవాల్ తెలిపారు. ఆలయ పనులపై ప్రతి వారం సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నామని, దానికి అనుగుణంగా మిగతా పనులు పూర్తి చేయిస్తున్నామని వివరించారు. ప్రతి పనికి గడువు విధించి పూర్తి చేయిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో వేములవాడ ఆర్డీఓ కేఎస్ బీ కుమారి, ఆర్ అండ్ బీ ఎస్ఈ భీమ్లా నాయక్, ఆలయ ఈఈ రాజేష్, తహసీల్దార్ జయంత్ కుమార్, విద్యుత్ శాఖ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



