– 15 వరకు దరఖాస్తుల స్వీకరణ
– ‘కళ్యాణ లక్ష్మి’ దరఖాస్తులు వేగవంతంగా పరిష్కరించాలి
– బీసీ సంక్షేమ శాఖ సమీక్షలో మంత్రి పొన్నం ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడంతోపాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న కుట్టు మిషన్ల పథకం దరఖాస్తులు, కొనుగోలు, టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మినిస్టర్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కుట్టు మిషన్ల కోసం ఇప్పటివరకు వివిధ జిల్లాల నుంచి 1,80,170 దరఖాస్తులు అందినట్లు అధికారులు మంత్రికి వివరించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈనెల 15 వరకు కొనసాగుతుందని తెలిపారు. కుట్టు మిషన్ల ప్రొక్యూర్‌మెంట్‌కు సంబంధించిన షెడ్యూల్, టెండర్ల తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. 7వ తేదీ లోపు ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 15 తర్వాత ప్రీ-బిడ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వెయ్యి కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన నియోజకవర్గాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆధ్వర్యంలో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు, మహిళా సంఘాలు, గ్రామ పంచాయతీల సహకారంతో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ఆదేశించారు. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యేలోపు అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పథకం అమలుపై సమీక్షిస్తామని మంత్రి తెలిపారు.
బీసీ కుల సంఘాల కార్పొరేషన్లకు మౌలిక సదుపాయాలు
ఇటీవల వివిధ బీసీ కుల సంఘాల కార్పొరేషన్లకు ఎన్నికైన చైర్మన్లకు కార్యాలయాలు, మౌలిక సదుపాయాలు కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిని మంత్రి ఆదేశించారు.
బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం, వాటి పురోగతి తదితర అంశాలపై కూడా చర్చించారు. రాష్ట్రంలోని 327 మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలల పనితీరు, మౌలిక సదుపాయాలు, అద్దె భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలలు, విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలపై మంత్రి సమీక్షించారు. 327 గురుకుల పాఠశాలల్లో ప్రస్తుతం 22 పాఠశాలలకు మాత్రమే సొంత భవనాలు ఉన్న నేపథ్యంలో మిగిలిన పాఠశాలలకు అవసరమైన భవనాలు, స్థలాలపై సమగ్ర నివేదికను ఈ నెల 15లోపు అందించాలని ఆర్‌సీవోలను ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో బీసీ గురుకులాలకు స్థలాలు అందుబాటులో ఉండగా, మరికొన్నిచోట్ల స్థలాలు లేని పరిస్థితిపై నియోజకవర్గాల వారీగా నివేదిక రూపొందించాలని సూచించారు. ఇందుకోసం బీసీ సంక్షేమ శాఖకు చెందిన నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక నియోజకవర్గంలో మంజూరైన మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలు ఇతర నియోజకవర్గాల్లో కొనసాగుతున్న వాటిని గుర్తించి మంజూరైన నియోజకవర్గంలోనే పాఠశాల నిర్వహణకు అనువైన భవనాలను గుర్తించి మార్పు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. గురుకుల పాఠశాలలు, బీసీ హాస్టళ్లలో భవనాల అద్దెలు, ఇతర పెండింగ్ బిల్లుల సమస్యలను పరిష్కరించేందుకు బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ, ఎంజేపీ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీలతో సమావేశమై సమస్యలను పరిష్కరించాలని సూచించారు. గురుకుల పాఠశాలలు, బీసీ హాస్టళ్లలో విద్యార్థులకు యూనిఫాంలు, షూస్, ఇతర మౌలిక సదుపాయాలు ఎంతవరకు పూర్తయ్యాయో, తక్కువ శాతం మాత్రమే పూర్తయిన పాఠశాలలను గుర్తించి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లపై సమీక్ష
ఓవర్సీస్ స్కాలర్‌షిప్ స్పెషల్ కేసులకు సంబంధించి గతంలో మంజూరైన స్కాలర్‌షిప్‌లు, వచ్చిన దరఖాస్తులు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పెండింగ్ దరఖాస్తులను పరిశీలించాలని సూచించారు.
కళ్యాణ లక్ష్మి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలి
కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి హైకోర్టు స్టే విధించిన సందర్భంలో 2023-26 మధ్య వచ్చిన దరఖాస్తులు, క్లియర్ చేసిన చెక్కులు, ఇంకా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను మంత్రి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న కళ్యాణ లక్ష్మి దరఖాస్తులను వేగంగా పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
బీసీ స్టడీ సర్కిల్‌ను ఆధునికీకరించాలి
వబీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా నాణ్యమైన శిక్షణ అందించాలని మంత్రి సూచించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన కమిటీ వివిధ ప్రాంతాల్లో అధ్యయనం చేసి గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాలతోపాటు వివిధ పోటీ పరీక్షలు, నైపుణ్య శిక్షణలకు సంబంధించి అనుసరించాల్సిన విధానాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాల పంపిణీపై ఆరా
గీత కార్మికుల భద్రత కోసం అందిస్తున్న కాటమయ్య రక్షణ కవచాలు ఎంతమందికి అందించారో మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో సుమారు 50 వేల మంది గీత కార్మికులు ఉండగా,40 వేల మంది శిక్షణ పూర్తి చేసుకున్నట్లు అధికారులు వివరించారు. శిక్షణ పూర్తి చేసిన వారిలో ఎంతమందికి రక్షణ కిట్లు అందించారో వివరాలు సేకరించి మిగిలిన వారికి కూడా త్వరగా అందించాలని మంత్రి ఆదేశించారు.
నీరా కేఫ్, నందనం రీటెండర్లపై ఆదేశాలు
నీరా కేఫ్‌కు 7వ తేదీ లోపు రీటెండర్ నిర్వహించాలని, నందనం ప్రాజెక్టుకు 15లోపు రీటెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ప్రతి నియోజకవర్గంలో అధునాతన ధోబీఘాట్
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గానికి ఒక అధునాతన ధోబీఘాట్ ఏర్పాటు చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మొదటి దశలో హుస్నాబాద్, హుజురాబాద్, చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లో వీటిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాలమాయాదేవి, ఎంజేపీ సెక్రటరీ సైదులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు మల్లయ్య బట్టు, అలోక్ కుమార్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



