అంగన్‌వాడి చరిత్రలో కొత్త అధ్యాయం

– 50 ఏళ్ల చరిత్రలో తొలిసారి మొదటి తేదీనే జీతాలు
– సీఎం రేవంత్, మంత్రి సీతక్కకు అంగన్‌వాడీల కృతజ్ఞతలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : అంగన్‌వాడి చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. సుమారు 50 సంవత్సరాల అంగన్‌వాడి వ్యవస్థ చరిత్రలో తొలిసారిగా నెల మొదటి తేదీనే టీచర్లు, హెల్పర్లకు జీతాలు అందాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం నెలలు గడిచినా జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు ప్రజా ప్రభుత్వ నిర్ణయంతో ప్రతి నెలా మొదటి తేదీనే జీతాలు అందుతుండటం తమ జీవితాల్లో గొప్ప మార్పు తీసుకొచ్చిందని అంగన్‌వాడీ టీచర్లు పేర్కొన్నారు. కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, ఇంటి ఖర్చుల కోసం జీతాలపై ఆధారపడే తమలాంటి ఉద్యోగులకు నిర్ణీత తేదీన వేతనం అందడం ఎంతో ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అంగన్‌వాడీ సిబ్బంది కొనియాడారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ప్రత్యేక చొరవతో మొదటి తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకున్నారని వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలుచోట్ల అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమస్యకు ప్రజా ప్రభుత్వం పరిష్కారం చూపిందని, అంగన్‌వాడీ వ్యవస్థపై ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. అంగన్‌వాడీ సిబ్బంది ఉద్యోగులు మాత్రమే కాదని, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల పోషకాహారం నుంచి బాలల ఆరోగ్యం వరకు గ్రామీణ సమాజానికి కీలక సేవలు అందిస్తున్నారని తెలిపారు. అలాంటి సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారి జీతాల విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రాత్మకమని అన్నారు. ‘మొదటి తేదీ జీతం.. అంగన్‌వాడీ సిబ్బంది ఆత్మగౌరవానికి ప్రభుత్వం ఇచ్చిన భరోసా’ అని అంగన్‌వాడీ టీచర్లు అభివర్ణించారు. తమ కష్టాలను గుర్తించి నిర్ణీత సమయంలో వేతనాలు అందేలా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కతో పాటు ప్రజా ప్రభుత్వానికి అంగన్‌వాడీ సిబ్బంది హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *