– ఆర్టీసీకి రూ. 2,600 కోట్ల బకాయిలు చెల్లించాలి
– హరీష్ రావు డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : ప్రభుత్వ వేదికలపై ఆర్టీసీ వేల కోట్ల లాభాల్లో ఉందని సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెబుతున్నారని, కానీ ఆర్టీసీ ఎండీ మాత్రం ప్రభుత్వం నుంచి రూ.2,600 కోట్ల బకాయిలు రావాలని లేఖ రాశారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు విమర్శించారు. కాగితాల మీద ఆర్టీసీ లాభాల్లో ఉందని చెబుతూ క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, విశ్రాంత కార్మికుల జీవితాలను అప్పుల ఊబిలోకి నెట్టారని బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ‘ప్రజా ప్రభుత్వం’ కాదని, కేవలం ‘ప్రచార ప్రభుత్వం’ అని ధ్వజమెత్తారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్లే ఉద్యోగులకు పీఆర్సీ, ఏరియర్స్ అందడం లేదని తెలిపారు. 30–40 ఏళ్ల పాటు సేవ చేసిన సుమారు 18 వేల మంది విశ్రాంత ఉద్యోగులకు నేటికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకపోవడం దారుణమన్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇప్పటికే 400 మంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ సౌకర్యం లేని వీరికి గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పీఆర్సీ ఏరియర్సే చివరి ఆసరాని, వాటిని కూడా ఆపేయడం ప్రభుత్వ అమానవీయ వైఖరికి పరాకాష్ట అని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రూ.2,600 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేసి విశ్రాంత కార్మికుల హక్కులను నెరవేర్చాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



