ఖర్గేకు అవమానంపై ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఆగ్రహం

– ‘శుద్ధీకరణ’ను తీవ్రంగా ఖండించిన ఎంపీలు
– 8న రాష్ట్రపతిని కలవాలని నిర్ణయం
– 7న ఇందిరా భవన్‌లో కార్యాచరణపై భేటీ
– బాధ్యులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : రాజ్యసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో చోటుచేసుకున్న ఘటనపై కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు, సీనియర్ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఖర్గే పర్యటన అనంతరం శుద్ధీకరణ చర్యపై ఎస్సీ, ఎస్టీ పార్లమెంటు సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన కేవలం ఖర్గేను వ్యక్తిగతంగా అవమానించడమే కాదని, మొత్తం ఎస్సీ, ఎస్టీ సమాజం గౌరవం, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యగా వారు అభివర్ణించారు. సమానత్వం, వ్యక్తిగత గౌరవం, అంటరానితనం నిర్మూలన వంటి రాజ్యాంగ సూత్రాలకు ఇలాంటి చర్యలు విరుద్ధమన్నారు. ఈ అంశంపై ఎస్సీ, ఎస్టీ పార్లమెంటు సభ్యులు దిల్లీలో బుధవారం సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై న్యాయం జరిగేలా, బాధ్యులపై తగిన చర్యలు తీసుకునేలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకోవాలని ఈ ఎంపీలు కోరేందుకు 8వ తేదీన రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరాలని నిర్ణయించారు. రాష్ట్రపతికి అనుకూలమైన ఇతర తేదీ, సమయం కుదిరినా ప్రతినిధి బృందం ఆమెను కలిసి ఈ అంశాన్ని స్వయంగా వివరించనుంది.

ఇందిరా భవన్‌లో 7న కీలక భేటీ

రాష్ట్రపతిని కలిసే ముందు తదుపరి కార్యాచరణకు సంబంధించి రోడ్ మ్యాప్ రూపొందించేందుకు 7వ తేదీ ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో ఎస్సీ, ఎస్టీ ఎంపీలందరూ సమావేశం కావాలని నిర్ణయించారు. అనంతరం 8న రాష్ట్రపతిని కలిసి ఈ అంశాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లనున్నారు.

రాజ్యాంగ విలువల పరిరక్షణకు పోరాటం

రాజ్యాంగం కల్పించిన సమానత్వం, గౌరవం, హక్కులను పరిరక్షించేందుకు ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధ మార్గాల్లో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ అంశాన్ని అత్యున్నత రాజ్యాంగ స్థాయికి తీసుకెళ్లి న్యాయం సాధించే వరకు సమష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు. నాగర్‌కర్నూల్(ఎస్సీ) నియోజకవర్గం ఎంపీ డామల్లు రవి ఈ వ్యవహారంపై రాష్ట్రపతికి లేఖ సమర్పించారు. తగిన జోక్యం చేసుకుని, బాధ్యులపై చర్యలు తీసుకునేలా చూడాలని కోరారు. సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ జార్ఖండ్ ఇన్‌చార్జి కె.రాజు, నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ససారం ఎంపీ మనోజ్ కుమార్, తురా ఎంపీ సలెంగ్ ఎ.సంగ్మా, కోరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక తదితరులు ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఫతేగఢ్ సాహిబ్ ఎంపీ అమర్ సింగ్, టోంక్-సవాయ్ మాధోపూర్ ఎంపీ హరీశ్ చంద్ర మీనా, వరంగల్ ఎంపీ కడియం కావ్య, బారాబంకీ ఎంపీ తనూజ్ పునియా తదితరులు ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *