ఆరు గ్యారంటీలపై రాహుల్‌ సమాధానం చెప్పాలి

ఏం సాధించారని మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్‌ యాడ్స్‌ ఇస్తోంది?
– కెసిఆర్‌ ను మించిపోయిన కాంగ్రెస్‌
– మాజీ సర్పంచుల పక్షాన బిఆర్‌ఎస్‌ ఆందోళన సిగ్గుచేటు
– చంపినోడే సంతాప సభ పెట్టినట్లుంది
– కాంగ్రెస్‌ అగ్రనేత అల్లుడి కోసమే మూసీ పునరుజ్జీవం
– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌

సిరిసిల్ల, ప్రజాతంత్ర, నవంబర్‌ 5 :  కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలంగాణ పర్యటనకు వొచ్చే ముందు ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వారి ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు సమధానం చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సెంట్రల్‌ లైబ్రరీకి, యూనివర్సిటీకి వెళ్లి యువతకు రాహుల్‌ గాంధీ గ్యారంటీలు ఇచ్చారని, అలాగే మహిళలకు, రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు ఆరు గ్యారంటీలు, 420హామీలిచ్చి వెళ్లారని, మళ్లీ ఈ రోజు తెలంగాణకు వొస్తున్నారని విమర్శించారు. ఏ పార్టీ నాయకులకైనా దేశంలో ఎక్కడైనా తిరుగవొచ్చన్నారు. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమవ్వడంపై రాహుల్‌ గాంధీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. తను ఇచ్చిన మాటపై తనకు నమ్మకముంటే రాహుల్‌ గాంధీ తెలంగాణ ప్రజలకు ఎన్నికల హామీల వైఫల్యంపై జవాబు చెప్పి తెలంగాణలో అడుగుపెట్టాలన్నారు. గతంలో రాహుల్‌ గాంధీ జోడో పాదయాత్ర చేశారని, ఇప్పుడు దమ్ముంటే ఆరు గ్యారంటీలపై ఆయన తెలంగాణ యాత్ర చేయాలని బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగి మండల కేంద్రానికి విచ్చేసిన బండి సంజయ్‌ కుమార్‌  బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప  రామకృష్ణ, రాష్ట్ర నాయకులు చెన్నమనేని వికాస్‌ రావులతో కలిసి రూ.22 లక్షల విలువైన ఎంపీ లాడ్స్‌, ఉపాధి హామీ నిధులతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు  పలు అభివ్రుద్ధి పనులను ప్రారంభించారు.

 

అనంతరం రుద్రంగిలోని లక్ష్మీనర్సింహాస్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిచిన పిదప విలేఖరులతో మాట్లాడారు. తన  పాదయాత్రలో మూసీ వద్దకు వెళ్లానని, విషం కక్కుతున్న నీళ్లను కళ్లారా చూశానని, ఆ విషపు నీటి కోరల్లో చిక్కుకుని యాదాద్రి జిల్లా ప్రజలు ఏ విధంగా విలవిల్లాడుతున్నారో తనకు తెలుసని అన్నారు. మూసీని ప్రక్షాళన చేయాలని బీజేపీ మొదటి నుంచి కోరుతోందని, కానీ ఆ పేరుతో పేదల ఇండ్లను కూల్చొద్దన్నదే తాము భావిస్తున్నామని,  మూసీని అడ్డుపెట్టుకుని లక్షన్నర కోట్ల దోపిడీని ఆపాలన్నదే తమ అభిమతమని, రూ.15 వేల కోట్లతో ఖర్చయ్యే ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లకు పెంచి కమీషన్లు దండుకోవడానికి మేం వ్యతిరేకమని వ్యాఖ్యానించారు.తెలంగాణ నిండా అప్పుల్లో మునిగిపోయిందని,బీఆర్‌ఎస్‌ చేసిన అప్పులను తీర్చేందుకు గంటకు 3 కోట్ల మిత్తి కట్టాల్సి వస్తోందని  మంత్రులే మొత్తుకుంటున్నరని,ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, జీతాలకే ఇబ్బందిగా ఉందని చెప్తున్నారని  అట్లాంటప్పుడు మళ్లీ లక్షన్నర  కోట్ల అప్పు తెచ్చి జనంపై రుద్దడం ఎంత వరకు కరెక్ట్‌? అని ప్రశ్నించారు.కాంగ్రెస్‌ అగ్రనేత కుటుంబానికి కాంట్రాక్ట్‌ కట్టబెట్టడానికి తెలంగాణ ప్రజల జీవితాలను ఫణంగా పెడతారా? కాళేశ్వరం పేరుతో కేసీఆర్‌ కుటుంబం లక్ష కోట్లు దోచుకుంటే… కాంగ్రెస్‌ పార్టి వారు లక్షన్నర కోట్లు దోచిపెట్టడానికి మూసీని వాడుకుంటారా.. తెలంగాణలో 6 గ్యారంటీలను అమలు చేస్తున్నమని, రుణమాఫీ చేసినమని ఊదరగొడుతూ మహారాష్ట్రలో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ పేరుతో  కోట్ల రూపాయల యాడ్స్‌ ఇచ్చింది.

కేసీఆర్‌ కూడా ఇట్లనే మహారాష్ట్ర ఎన్నికల్లో ఖర్చు చేసిండు. పంజాబ్‌ రైతులకు పప్పు బెల్లాల మాదిరిగా పంచిండు. తెలంగాణ రైతులను అరిగోస పెట్టిండని అన్నారు. ఒకవైపు ఢల్లీి పెద్దలకు కప్పం కడుతూ ఇంకోవైపు మహారాష్ట్ర ఎన్నికలకు తెలంగాణ పైసలను వాడుకుంటరా?  రాష్ట్రంలో 6 గ్యారంటీల అమలు కాలేదని, రుణమాఫీ పూర్తి కాలేదని. ఇంకా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉందని వ్యవసాయ శాఖ మంత్రే ప్రకటించిండని గుర్తు చేశారు.   దొంగ హామీలతో అధికారంలోకి వచ్చి కర్నాటక, తెలంగాణ ప్రజలను మోసం చేసినట్లుగానే ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్‌ నేతలు సిద్ధమవ్వడం సిగ్గు చేటని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *