– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
– నాగోల్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : రాజకీయాలు అంటే ఎన్నికలు, ఓట్లు మాత్రమే కాదని, సమాజ హితం కోసం నిస్వార్థ సేవ చేయడమే ప్రజాప్రతినిధికి నిజమైన సంతృప్తినిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాప్రతినిధిగా (ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా) 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా భారతీయ జనతా యువమోర్చా(బీజేవైఎం) ఆధ్వర్యంలో నాగోల్‌లో బుధవారం భారీ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రామచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి స్వయంగా రక్తదానం చేసి యువతలో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నాయకుడి ఆలోచనా విధానంలో ప్రజాసేవ అంతర్భాగం కావాలని, సమాజానికి మేలు చేసినప్పుడే అంతర్గతంగా నిజమైన సంతృప్తి, సంతోషం లభిస్తాయని అన్నారు. నరేంద్ర మోదీ జన్మదినం, అలాగే ఆయన 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ప్రజల్లో సేవా భావాన్ని మరింత పెంపొందించాలనే సంకల్పంతోనే ఈ కార్య్రకమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రధాని మోదీ విద్యారంగానికి పెద్దపీట వేస్తూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎయిమ్స్, ఐఐఎంలతోపాటు ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలను భారీగా పెంచారని కొనియాడారు. మోదీ దేశసేవను ఆదర్శంగా తీసుకుని సేవా రంగంలో యువత ముందుండాలని పిలుపునిచ్చారు. ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు చేసే రక్తదానం జీవితంలో వెలకట్టలేని సంతృప్తిని ఇస్తుందని అన్నారు. ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగిస్తూ రాష్ట్రంలోని మరింతమంది యువత ముందుకొచ్చి రక్తదానం చేయాలని రామచందర్ రావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎన్.గౌతం రావు, వీరేందర్ గౌడ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, బండ కార్తీక రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందే, రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్, బీజేవైఎం రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొన్నారు.
ఎన్నికలకు సమాయత్తం కావాలి
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు అధ్యక్షతన రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికలు, ఐదు మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ఆయా కార్పొరేషన్లకు సంబంధించిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రానున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ఎన్నికల నిర్వహణకు అనుసరించాల్సిన వ్యూహాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణ రూపొందించాలని రామచందర్ రావు నాయకులకు దిశానిర్దేశం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





