– రెడ్ అలర్ట్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
– కలెక్టర్లకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23: రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెరువులు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవసరమైనచోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో 24 గంటలూ అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్, టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు తక్షణ సహాయం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించేలా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వాగులు, చెరువులు, వరద ప్రవాహ ప్రాంతాల వైపు వెళ్లవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





