-కేటీఆర్ కు బేషరతుగా క్షమాపణ చెప్పిన సురేఖ
– కేసు ఉపసంహరణపై ఉత్కంఠ..
– పార్టీ మార్పుపై రాజకీయ వర్గాల్లో చర్చ
– కాంగ్రెస్ లో కొనసాగుతారా.. బీఆర్ఎస్ గూటికి చేరుతారా?
(మండువ రవీందర్‌రావు)
రాష్ట్ర దేవాదాయశాఖ మాజీ మంత్రి కొండా సురేఖ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుకు క్షమాపణ చెప్పటం తెలంగాణ రాజకీయాల్లో సరికొత్తమలుపుకు కారణమవుతుందా? ఇంతటితో ఈవి వాదానికి ఫుల్స్టాప్ పడనుందా?లాంటి పలుప్రశ్నలు ఉత్పన్న మవుతున్నాయి. ఎందుకంటే కోర్టులో కొనసాగుతున్న కేసుకు సంబంధించి ఉన్నపళంగా కొండా సురేఖ బేషరతుగా కెటిఆర్‌కు క్షమాపణ చెప్పడమన్నది రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై కెటిఆర్ రియాక్షన్ ఎలాఉన్నా కాంగ్రెస్ ఏం చేయబోతున్నదన్నది చర్చనీయాంశమైంది. రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై, కాంగ్రెస్ పార్టీపైన కొండా సురేఖ కూతురు సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలకు తన మంత్రిపదవిని కోల్పోవాల్సి వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే ఆమె మంత్రివర్గంనుండి బహిష్కృతురాలైంది. అనంతరం వరంగల్ తూర్పు ఎంఎల్‌ఏగా మాత్రమే కొనసాగుతున్న సురేఖ ఇంకా కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారాలేదా అన్నది ప్రశ్నగానే మిగిలింది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా, కాంగ్రెస్ పార్టీ పరంగా చేపడుతున్న కార్యక్రమాలు, సమావేశాలకు ఆమె హాజరుకావటంలేదు. ఒంటరిగా కేవలం తన నియోజకవర్గ కార్యక్రమాల్లోనే పాల్గొంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఎవరూ ఊహించనిరీతిలో ఆమె కెటిఆర్‌పై తానుచేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పడం వెనుక వున్న బలమైన కారణమేంటన్నదే రాజకీయవర్గాల్లో ఉత్సుకతను కలిగిస్తున్న అంశం. అధికారపార్టీలో మంత్రిగా కొనసాగుతున్న వేళ, ఆ పార్టీని వెనుకేసుకుని వచ్చేక్రమంలో సురేఖ పలు వివాదస్పద వ్యాఖ్యలుచేశారు. అందులో ప్రధాన ప్రతిపక్షాన్ని ఎండగట్టడంద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినుంచి మంచిమార్కులు కొట్టేయాలనుకున్నారు. కాని ఆ మాటలు తనకే రివర్స్ అవుతాయని ఆమె ఊహించలేకపోయారు. ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున కుటుంబానికి, కెటిఆర్‌కున్న సంబంధంపై ప్రస్తావించడాన్ని ఆ రెండు కుటుంబాలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఇద్దరు న్యాయస్థానంలోనే తేల్చుకోవడానికి సిద్దపడ్డారు. కాగా వందకోట్ల రూపాయల పరువునష్టం దావావేసిన అక్కినేని కుటుంబానికి క్షమాపణ చెప్పడంతో వారాకేసును ఉపసంహరించుకోగా, కెటిఆర్ మాత్రం కేసును కొనసాగిస్తున్నారు. కోర్టులో వాదోపవాదాలు సీరియస్‌గా కొనసాగుతున్న వేళ అకస్మాత్తుగా సురేఖ క్షమాపణ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనివెనుకున్న కారణాలేంటన్న విషయంపై చర్చ జరుగుతున్నది. ఇటీవల మంత్రి పదవి కోల్పోవడం ఒకటి కాగా, ఈ కేసును క్రిమినల్ ప్రొసీడింగ్స్‌గా కోర్టు స్వీకరించడం, నేరం రుజువైతే జైలుశిక్ష పడే అవకాశముండడం, ఎంఎల్‌ఏ పదవికి ముప్పు వాటిల్లే అవకాశముండడంతో సురేఖ క్షమాపణ అస్త్రాన్ని సందించి ఉండవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో తాను ఎవరికీ క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదన్న సురేఖ ఇప్పుడు కెటిఆర్‌కు క్షమాణ చెప్పడమన్నది తమ నైతిక విజయంగా బిఆర్‌ఎస్ భావిస్తున్నది. కాని అసలు విషయమంతా ఇక్కడేఉంది. చేసేదంతా చేసి క్షమాణ వేడుకుంటే సరిపోతుందా? కెటిఆర్ దానికి ఒప్పుకుని కేసు విరమించుకుంటారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈనెల 29న ట్విట్టర్ ద్వారా ఆమె కెటిఆర్ క్షమాపణ వేడుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఇంకా తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అదేరోజున మీడియా సమావేశంలో చెప్పిన కెటిఆర్ తన లీగల్‌సెల్ సభ్యులతో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాననడం ఇక్కడితో కేసు ముగుస్తుందేమో అనుకున్నవారిని సందిగ్ధంలో పడేసింది. ఇదిలా వుంటే కూతురు చేసిన ఆరోపణలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కోపం తెప్పించి, మంత్రిపదవిని పోగొట్టుకున్న సురేఖ మరోసారి బిఆర్‌ఎస్‌లో చేరడానికే ఈ క్షమాపణ అస్త్రాన్ని ప్రయోగించి ఉండవచ్చన్న మాటలు వినవస్తున్నాయి. గతంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను దుర్భాషాలాడి, అదేపార్టీలోచేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటిసీనే పునరావృతం అవనుందేమోనని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా ఈ పరిణామాలపై సురేఖ కాంగ్రెస్‌లోనే ఉండాలని తాము కోరుకుంటున్నట్లు టిపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ తాజాగా ప్రకటించినప్పటికీ, కొండా కుటుంబంనుంచి మాత్రం పార్టీ మారే విషయంలో ఎలాంటి సూచనలు కనిపించడం లేదు. ఏదిఏమైనా తాజాగా కెటిఆర్ తీసుకునే నిర్ణయంతో సురేఖ రాజకీయం ఎటు మలుపు తిరుగనుందోనన్న ఆసక్తి ప్రజల్లో వ్యక్తమవుతున్నది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




