జర్మనీతో బంధం మరింత బలోపేతం కావాలి

– అంతర్జాతీయ పెట్టుబడులు, పర్యాటకం, సాంకేతిక రంగాల్లో అపార అవకాశాలు

– జర్మన్ ఐక్యతా దినోత్సవ వేడుకల్లో  మంత్రి శ్రీహరి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, క్టోబర్ 30: భారత్, జర్మనీ దేశాల మధ్య గత 75 ఏళ్లుగా కొనసాగుతున్న మైత్రీ బంధం భవిష్యత్తులో మరింత బలోపేతం కావాలని రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు. నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో ఘనంగా నిర్వహించిన జర్మన్ ఐక్యతా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జర్మనీ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్‌కు, జర్మనీ ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, పర్యాటకం మరియు సాంస్కృతిక మార్పిడి రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్యత, పరస్పర అవగాహన, ఉమ్మడి అభివృద్ధికై కలిసి పనిచేయాలనే గొప్ప సందేశాన్ని జర్మన్ ఐక్యతా దినోత్సవం ప్రపంచానికి అందిస్తుందని పేర్కొన్నారు.

ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ ప్రధాన గమ్యస్థానం

ఇంజినీరింగ్, ఆటోమొబైల్, ఐటీ, పరిశోధన, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారత్-జర్మనీల మధ్య బలమైన భాగస్వామ్యం ఉందని, 2024లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 50 బిలియన్ డాలర్లను దాటిందని గుర్తుచేశారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అధునాతన సాంకేతిక వ్యవస్థలతో హైదరాబాద్ అంతర్జాతీయ కంపెనీలకు ప్రధాన కేంద్రంగా మారిందన్నారు. జర్మనీకి చెందిన ‘డాయిష్ బోర్స్’ సంస్థ ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. డిసెంబర్‌లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ ద్వారా రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలను ప్రపంచ పారిశ్రామికవేత్తలకు పరిచయం చేయనున్నట్లు తెలిపారు. జర్మనీలోని ‘థ్యూరింగియా’ రాష్ట్రంతో తెలంగాణకు ఉన్న భాగస్వామ్యాన్ని ప్రస్తావిస్తూ.. ఆటోమొబైల్, లైఫ్ సైన్సెస్, ఐటీ, స్టార్టప్ రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని జర్మన్ కంపెనీలకు పిలుపునిచ్చారు.

పర్యాటక రంగంలో రూ.50,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యం

కాకతీయుల నిర్మాణ వైభవం, యునెస్కో వారసత్వ సంపద రామప్ప దేవాలయం, బతుకమ్మ, బోనాలు వంటి పండుగలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలని మంత్రి అభివర్ణించారు. హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్ అంతర్జాతీయ గుర్తింపు పొందాయని, చెఫ్‌ల మార్పిడి మరియు ఫుడ్ ఫెస్టివల్స్ ద్వారా సాంస్కృతిక బంధాన్ని పెంపొందించవచ్చన్నారు.’తెలంగాణ టూరిజం పాలసీ 2025-2030′ ద్వారా ఐదేళ్లలో రూ.50,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 5 లక్షల ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే తొలి ఏడాదే రూ.22,174 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చినట్లు వెల్లడించారు. హోటళ్లు, రిసార్టులు, వెల్‌నెస్ టూరిజం, హ్యాండ్లూమ్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు జర్మనీ సంస్థలు ముందుకు రావాలని కోరారు. భారత్-జర్మనీ 75 ఏళ్ల స్నేహసంబంధాలను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి పునరుద్ఘాటించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *