– అతిథులను ఆహ్వానిస్తే కమిషనరేట్‌కు సమాచారం ఇవ్వండి
– పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి
– గణేష్ ఉత్సవాలపై సీఎం సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మండప నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్ పొందాలని సూచించారు. భాగ్యనగరంలో గణేశ్ ఉత్సవాల వేళ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఏ చిన్న ఇబ్బంది కలగకుండా సహాయ సహకారాలు అందించాలన్నారు. హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలపై శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంప్రదాయాన్ని పునరుద్ధరించామని, మీ సమస్యలు తెలుసుకునేందుకు స్వయంగా తానే సమీక్ష నిర్వహిస్తున్నానని చెప్పారు. మండపాలకు అతిథులను ఆహ్వానిస్తే నిర్వాహకులు ఆ వివరాలను స్థానిక కమిషనరేట్‌కు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఊహించని పరిణామాలు జరిగినపుడు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ఆ సమాచారం ఉపయోగపడుతుందన్నారు. ఎక్కడెక్కడ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో ముందుగానే సమాచారం అందిస్తే పోలీసులకు ట్రాఫిక్, బందోబస్తు నిర్వహణకు సులభంగా ఉంటుందని ఆయన చెప్పారు. అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మలకు ఏర్పాటు చేసినట్లే గణేశ్ నిమజ్జనాలకు అనుగుణంగా నిర్మాణ సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెరువుల వద్ద చుట్టూ క్రేన్స్ ఏర్పాటుకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీస్ శాఖ నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకుని పర్యవేక్షణ, సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయంటూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత వహించాలన్నారు. ఇందుకు నిర్వాహకుల నుంచి సహకారం ఉండాలని కోరారు. సమస్యలు ఏమున్నా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉత్సవ సమితులకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేశ్, జీహెచఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లు, హైడ్రా కమిషనర్, పోలీసు ఉన్నతాధికారులు, అధికారులు, గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





