జనగణనలో కులగణనను చేర్చాలి

– కులగణన చేద్దామా వద్దా.. బీజేపీ సభ్యులు సూటిగా చెప్పాలి
– కులగణనతోనే బలహీన వర్గాలకు న్యాయం
– రాష్ట్రంలో చేసిన తీరులో దేశవ్యాప్తంగా సర్వే చేయాలి
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : దేశంలో సామాజిక అసమానతలను తొలగించి బలహీనవర్గాలకు న్యాయం చేయాలంటే జనగణనలో కులగణనను తప్పనిసరిగా చేర్చాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కులగణన చేద్దామా వద్దా అనే విషయాన్ని బీజేపీ సభ్యులు సూటిగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో సర్వేను అసెంబ్లీలోనే అభినందించి ఇప్పుడు దేశంలో ఎక్కడా కులగణన జరగలేదని చెప్పడం సరైన విధానం కాదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వేను దేశానికి ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా ఇలాంటి సమగ్ర సర్వే నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో జనగణన, కులగణన అంశంపై శుక్రవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ కులగణన అనేది కులాలకు, రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం కాదని, సమాజ శ్రేయస్సుకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు. జనగణన నిర్వహించే సమయంలోనే కులగణనను కూడా అందులో చేరుస్తామని అప్పట్లో కేంద్రం చెప్పిందని భట్టి గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న జనగణనలో కులగణనను చేర్చకపోవడం బాధాకరమన్నారు. ఇచ్చిన మాట ప్రకారం జనగణనలో కులగణనను చేర్చాలని డిమాండ్ చేశారు. కులగణన లేకుండా దేశంలోని బలహీనవర్గాల వాస్తవ పరిస్థితులను ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు. కుల గణనను చేర్చకుండా ప్రజలను పక్కదోవ పట్టించడం సరికాదన్నారు.

రాష్ట్ర సర్వే దేశానికే ఆదర్శం

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై సమగ్ర సర్వే నిర్వహించిందని భట్టి తెలిపారు. రాష్ట్రంలో ఏ కులానికి ఎంత జనాభా ఉంది, వారి వృత్తులు ఏమిటి, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఎంతమంది చదువుకున్నారు, ఎంతమంది ఉద్యోగాల్లో ఉన్నారు, ఎంతమంది నిరుద్యోగులు, భూమి ఉన్నవారు ఎంతమంది, లేనివారు ఎంతమంది వంటి అనేక అంశాలను కూలంకషంగా సేకరించామని చెప్పారు. ప్లానింగ్ శాఖను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎంగా తాను ప్రతిరోజూ ఈ ప్రక్రియను సమీక్షిస్తూ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సర్వేను నిర్వహించామని తెలిపారు. ఈ సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సర్వే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష సభ్యులు సైతం అభినందించారని గుర్తు చేశారు.

దేశమంతా తెలంగాణ మోడల్ కావాలి

తెలంగాణలో జరిగిన సర్వే తరహాలో దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తోందని భట్టి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీకి వెళ్లి పార్లమెంట్‌లోని వివిధ పార్టీల నాయకులతో పాటు ప్రధానమంత్రిని కూడా కలిసి దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని విజ్ఞప్తి చేశారని చెప్పారు. మంత్రులు కూడా ఈ అంశంపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చారని వివరించారు. అయినప్పటికీ కేంద్రం నుంచి ఆశించిన విధంగా స్పందన రాకపోవడంతో దిల్లీలోని రాజకీయ పార్టీలను ఆహ్వానించి సమావేశం నిర్వహించి తెలంగాణలో అమలు చేసిన విధానాన్ని వివరించామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇదే తరహాలో కులగణన నిర్వహించాలని కోరామని చెప్పారు.

కులగణన ఒక ‘ఎక్స్‌రే’

సమాజంలో ఆస్తులు, వనరులు అందరికీ సమానంగా అందడం లేదని భట్టి పేర్కొన్నారు. ఈ అసమానతలను తొలగించాలంటే ముందుగా సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవాల్సి ఉందన్నారు. ‘సమాజం ఆరోగ్యంగా లేకపోతే ముందుగా ఎక్స్‌రే తీయాలి. వ్యాధిని నిర్ధారించాలి. ఆ తర్వాతే చికిత్స చేయాలి. సమాజంలో ఉన్న అసమానతలను గుర్తించే ఎక్స్‌రేనే కులగణన’ అని భట్టి అభివర్ణించారు. కులగణన ద్వారా వివిధ సామాజిక వర్గాల వాస్తవ జనాభా, వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులు స్పష్టంగా తెలుస్తాయని, ఆ సమాచారం ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి విధానాలను రూపొందించవచ్చని అన్నారు. జనాభా ప్రాతిపదికన అవకాశాలు, వనరులు, అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా చేరేలా చర్యలు తీసుకోవచ్చన్నారు. దేశంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిర్వహించిన తరహాలో రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వే నిర్వహిస్తామని ప్రకటించారు. కాగా, జన గణన-2027 రెండో దశ ప్రశ్నావళిలో బీసీ/ఓబీసీలను చేర్చాలనీ శాసన సభ ఏకగ్రీవ తీర్మానం చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *