అటవీ శాఖ అమరుల సేవలు చిరస్మరణీయం

– అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో 23మంది సిబ్బంది ప్రాణత్యాగం
– డీజీపీ ఆనంద్
– అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది
– అటవీ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలి
– ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : సహజ వనరులు, అటవీ సంపద, వన్యప్రాణుల పరిరక్షణలో ప్రాణత్యాగం చేసిన అటవీ శాఖ సిబ్బంది సేవలు చిరస్మరణీయమని డీజీపీ¾ సి.వి.ఆనంద్ అన్నారు. అటవీ శాఖ పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా నెహ్రూ జూలాజికల్ పార్కులో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. పర్యాటక, ఎక్సయిజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. అక్రమ కలప రవాణా, వన్యప్రాణుల వేటను అడ్డుకునే క్రమంలో ప్రాణాలకు ముప్పు ఉందన్నారు. అటవీ సిబ్బంది ఆయుధాలు ఇవ్వాలని కోరారు. ఎక్సైజ్ శాఖ తరఫున డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని జూపల్లి తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగానికి పాల్పడుతున్న వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తున్నామని, అవసరమైన సందర్భాల్లో పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అడవుల నరికివేత, అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధాన కారణాల్లో ఒకటని మంత్రి పేర్కొన్నారు. కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులను పర్యాటకంగా ప్రభుత్వం అభివృద్ధి చేసిందన్నారు.

23మంది అటవీ సిబ్బంది ప్రాణత్యాగం : డీజీపీ

రాజస్థాన్‌లోని ఖేజర్లీ ప్రాంతంలో చెట్లను, పర్యావరణాన్ని కాపాడేందుకు 1730 సంవత్సరంలో 363మంది విష్ణోయి తెగ ప్రజలు ప్రాణత్యాగం చేసిన ఘటనకు గుర్తుగా యేటా సెప్టెంబర్ 11న అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు డీజీపీ¾ తెలిపారు. ఈ రోజు ప్రత్యేకమని, ఇది భావోద్వేగంతో కూడిన రోజని అన్నారు. వన్యప్రాణులు, అడవుల సంరక్షణలో 23మంది అటవీశాఖ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని డీజీపీ తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 11న పాల్వంచలో ఎఫ్‌బీవో బానోతు నవీన్ వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కుకుని అటవీ, వన్య ప్రాణుల పరిరక్షణలో ప్రాణ త్యాగం చేశారంటూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అటవీ శాఖతో తనకు ఉన్న అనుబంధాన్ని డీజీపీ గుర్తు చేసుకున్నారు. తన తండ్రి 1953లో అటవీ శాఖలో రేంజ్ ఆఫీసర్‌గా చేరి 35 ఏళ్లపాటు సేవలందించి 1988లో డీఎఫ్‌వోగా పదవీ విరమణ చేశారని తెలిపారు. నక్సల్స్ ప్రభావం ఉన్న రోజుల్లో తన తండ్రి అటవీ శాఖలో పనిచేసేవారని, దీంతో ఫారెస్ట్ సిబ్బందితో అనుబంధం ఉందని చెప్పారు. ఆ తర్వాత 1996లో బెల్లంపల్లిలో అదనపు ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో తల్లిదండ్రులతో కలిసి చెన్నూరు చెక్‌పోస్టుకు వెళ్లిన సం<ర్భంలో దట్టమైన అడవులు పూర్తిగా కనుమరుగవడాన్ని చూసి తన తల్లిదండ్రుల కళ్లలో నీళ్లు తిరిగాయని తెలిపారు.

పర్యావరణ సమతుల్యతను కాపాడాలి

అడవులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డీజీపీ పేర్కొంటూ మానవ తప్పిదాల కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. హిమాలయాల్లో చోటుచేసుకున్న ప్రకృతి విపత్తులు, యూరప్‌లోని అడవుల్లో సంభవిస్తున్న అగ్నిప్రమాదాలు పర్యావరణ మార్పుల తీవ్రతను తెలియజేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో అటవీ భూముల ఆక్రమణలను అడ్డుకుని అడవులను పరిరక్షించేందుకు కలెక్టర్లు, ఎస్పీలు, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మిగిలి ఉన్న చిన్నచిన్న అటవీ ప్రాంతాలను కూడా భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.

అటవీ సిబ్బందికి ఆయుధాలు

గతంలో నక్సల్స్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహించే సమయంలో అటవీ శాఖ సిబ్బంది వద్ద ఆయుధాలు ఉండేవి కావని డీజీపీ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అటవీ శాఖ సిబ్బందికి అవసరమైన ఆయుధాలు అందిస్తే వారు మరింత సమర్థంగా విధులు నిర్వర్తించగలరని అన్నారు. పోలీసు శాఖ తరఫున అటవీ శాఖకు అవసరమైన సహాయసహకారాలు అందిస్తామన్నారు.

ప్రాణాలకు తెగించి విధులు : వినయ్‌కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్

అటవీ సిబ్బంది విధులు అత్యంత ప్రమాదకరమైనవని ఫారెస్ట్ చీఫ్ కన్సర్వేటర్ వినయ్‌కుమార్ అన్నారు. పెట్రోలింగ్ సమయంలో అక్రమ కలప రవాణాదారులు, వన్యప్రాణుల వేటగాళ్లు, ఇతర దుండగుల నుంచి సిబ్బందికి ప్రమాదం పొంచి ఉంటుందని తెలిపారు. అర్ధరాత్రి వేళల్లో వేటగాళ్లను పట్టుకునే క్రమంలోనూ సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
కార్యక్రమంలో వైరా శాసనసభ సభ్యుడు రాందాస్ నాయక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, టీజీఎఫ్‌డీసీ వైస్ చైర్మన్, ఎండీ సునీత ఎం.భగవత్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆల, సెక్రటరీ ప్రియాంక వర్గీస్, పోలీసు, అటవీ శాఖ అధికారులు, అమరవీరుల కుటుంu సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *