– మూడేళ్లలో రూ.7,554 కోట్లు పెరిగిన బడ్జెట్
– 10,006 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశాం
– సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో తెలిపారు. సభలో విద్యా విధానంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ప్రభుత్వం తరఫున కీలక వివరాలను వెల్లడించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో (2023-24) రూ.19,093 కోట్లు ఉన్న విద్యా శాఖ బడ్జెట్‌ను 2024-25 బడ్జెట్‌లో రూ.21,292 కోట్లకు పెంచాం. 2025-26 నాటికి రూ.23,108 కోట్లకు, 2026-27 నాటికి రూ.26,647 కోట్లకు పెంచుతాం. మొత్తం బడ్జెట్‌లో 15 శాతాన్ని విద్యకే కేటాయించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. కేవలం మూడేళ్ల వ్యవధిలోనే విద్యా బడ్జెట్‌ను రూ.7,554 కోట్లకు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనని సీఎం రేవంత్ తెలిపారు.
55 రోజుల్లోనే 10,006 టీచర్ పోస్టుల భర్తీ
తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే కేవలం 55 రోజుల్లోనే మెగా డీఎస్సీ ద్వారా ఎలాంటి వివాదాలు, ఆరోపణలు లేకుండా 10,006 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామని సీఎం చెప్పారు. పదేళ్లలో గత ప్రభుత్వం 7,857 మంది టీచర్లను మాత్రమే నియమించిందన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను కూడా పారదర్శకంగా పూర్తి చేశామన్నారు.
ప్రభుత్వ బడుల్లో ప్రీ-ప్రైమరీ విద్య ప్రారంభం
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తొలిసారిగా ప్రభుత్వ బడుల్లో నర్సరీ, ఎల్‌కేజీ (ప్రీ-ప్రైమరీ) సెక్షన్లను అందుబాటులోకి తెచ్చాం. ఈ ఏడాది 64 వేల మంది విద్యార్థులు ప్రీ-ప్రైమరీలో చేరారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ 27 శాతం పెరిగి, కొత్తగా 86 వేల మంది విద్యార్థులు చేరారు. ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులతోపాటు పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి కూడా ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించాం.
పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు నూతన వర్సిటీలు & కోర్సులు
యువతను ‘రెడీ టూ వర్క్‌ఫోర్స్’గా మార్చేందుకు ప్రత్యేక యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, క్రీడల ప్రోత్సాహానికి ‘స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని ప్రారంభించాం. డిగ్రీ, ఇంజినీరింగ్ స్థాయిల్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కోర్సులను దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి చెప్పారు. రూ.21,000 కోట్లతో 105 ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’, 104 ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ నిర్మాణం చేపడుతున్నాం. కోఠి ఉమెన్స్ కాలేజీని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా మార్చి రూ.500 కోట్లు కేటాయించామని చెప్పారు. టీసీఎస్ భాగస్వామ్యంతో 65 ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రేడ్ సెంటర్లుగా తీర్చిదిద్దాం.. విద్యారంగంలో సమగ్ర మార్పులు తీసుకొచ్చేందుకు విద్యా కమిషన్ నివేదికపై కేశవరావు (కేకే) నేతృత్వంలోని కమిటీ పరిశీలన చేస్తోందని, ప్రతిపక్ష సభ్యుల సానుకూల సూచనలను స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యం : మంత్రి దుద్దిళ్ల
తమ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుతోపాటు విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, రెండున్నరేళ్ల వ్యవధిలో విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి విద్యపై శాసనసభలో జరిగిన చర్చలో తెలిపారు. ప్రభుత్వపరంగా ప్రీ ప్రైమరీ సెక్షన్లను కూడా ప్రారంభించామన్నారు. చాలా ఏళ్ల తర్వాత అకడమిక్ కరిక్యులంలో మార్పులు చేర్పులు చేశామన్నారు. చదువుకుంటూనే విద్యార్థులు సంపాదించేలా ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పించే ఏర్పాట్లు చేశామన్నారు.. బీఎఫఎసఐ(బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్) కన్సార్టియం సహకారంతో దేశంలోనే తొలిసారిగా డిగ్రీ, ఇంజినీరింగ్‌లో కోర్సులకు శ్రీకారం చుట్టామని, మనల్ని చూసి బీఎఫఎసఐ తరహా కోర్సులను కర్ణాటక, తమిళనాడు లాంటి అనేక రాష్ట్రాల్లో ప్రారంభించారని ఆయన చెప్పారు. టీ హబ్ తరహాలోనే వరంగల్‌లో ఇంక్యుబేషన్ హబ్‌ను(కె-హబ్) ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల్లోనూ ఈ తరహా ఇంక్యుబేషన్ హబ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, వివిధ దేశాల్లో విజయవంతంగా అమలవుతున్న విద్యా సంస్కరణలను పరిశీలించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధ్యాపకులను అక్కడికి పంపించామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. అన్ని విద్యా సంస్థలను డ్రగ్ ఫ్రీ క్యాంపస్ లుగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. ప్రభుత్వం బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని, రూ.500 కోట్లతో 93 కేజీబీవీలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సెలెన్స్‌గా అభివృద్ధి చేసే ప్రక్రియను ప్రారంభించామని వివరించారు. విద్యా వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్లేలా అందరి సలహాలు, సూచనలను స్వీకరించి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందులో ఎలాంటి భేషజాలు లేవని మంత్రి చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





