– రూ.15 వేల కోట్ల బకాయిల విడుదల ఎప్పుడో ప్రకటించాలి
– జీవో 97తో పాలిటెక్నిక్ వ్యవస్థను నాశనం చేస్తున్నారు
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలపై కాలయాపన చేయకుండా స్పష్టమైన ప్రకటన చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం మాట్లాడుతూ బీఆరఎస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ ఎందుకు ప్రశ్నించలేదని అనడం పూర్తి అవాస్తవమన్నారు. 2017 జనవరి 4న తాను శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడే ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, విద్యావ్యవస్థ దుస్థితిపై గళమెత్తిన అంశాలు అసెంబ్లీ, మండలి రికార్డుల్లో స్పష్టంగా ఉన్నాయని గుర్తు చేశారు.
రూ.15 వేల కోట్లకు చేరిన బకాయిలు
రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బకాయిల సమస్య కొనసాగుతూనే ఉందని రామచందర్ రావు పేర్కొన్నారు. బీఆరఎస్ తన పదేళ్ల పాలనలో మొదటి ఎనిమిదేళ్లు నిధులు ఇచ్చి చివరి రెండేళ్లలో దాదాపు రూ.5 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీలోనే బీఆరఎస్ నుంచి రూ.5,430 కోట్ల బకాయిలు వచ్చాయని చెప్పిందని, 2024-25 నాటికి కాంగ్రెస్ హయాంలోనే మరో రూ.6,037 కోట్ల బకాయిలు పెరిగాయని ప్రభుత్వమే వెల్లడించిందని వివరించారు. 2026 నాటికి పాత, కొత్త బకాయిలు అన్నీ కలిసి సుమారు రూ.15 వేల కోట్లకు చేరుకున్నాయని మండిపడ్డారు. విద్యార్థుల ఖాతాల్లోకే నేరుగా నగదు జమ చేసే డీబీటీ విధానానికి బీజేపీ ఏనాడూ వ్యతిరేకం కాదని, యాజమాన్యాలతో తమకు సంబంధం లేదని, విద్యార్థుల ఖాతాల్లో ఆ సొమ్మును ఎప్పుడు జమ చేస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. బకాయిలు చెల్లించకపోవడం వల్లే అనేక కాలేజీలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆరఎస్ హయాంలో అక్రమాలు జరిగినా, కాంగ్రెస్ హయాంలో జరిగినా సమగ్ర విచారణ జరపాలని, విజిలెన్స్ దాడుల పేరుతో కాలేజీలను వేధించడం సరికాదని స్పష్టం చేశారు.
విద్యాశాఖ నిర్వీర్యం.. పాలిటెక్నిక్ విద్యార్థులపై లాఠీచార్జి దుర్మార్గం
సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన వద్దే ఉంచుకుని విద్యావ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశారని ఆరోపించారు. నూతన విద్యావిధానం తీసుకొస్తామని చెప్పి నియమించిన కమిటీ చైర్మనే రాజీనామా చేశారని, ఆ కమిటీ విద్యా సంస్కరణల కోసం కాక నక్సలిజం భావజాలం, నక్సలైట్లను తయారు చేసే దిశగా మారిందని మండిపడ్డారు. మరోవైపు పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలను సర్కార్ అంధకారంలోకి నెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 97 ద్వారా స్కిల్ డెవలప్‌మెంట్‌ను ఇంటిగ్రేట్ చేసి పాలిటెక్నిక్ డిగ్రీనే పూర్తిగా ఎత్తేసే కుట్ర జరుగుతోందని, వారికి ఈ-సెట్ రాసే అర్హత ఉంటుందో లేదో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. తమ భవిష్యత్తు కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై క్రూరంగా లాఠీచార్జి చేయించడం అమానుషమన్నారు. దిల్లీలో రాహుల్ గాంధీ ‘చాత్రోం కీ గూంజ’ అని ఉపన్యాసాలు ఇస్తుంటే తెలంగాణలో మాత్రం లాఠీలతో విద్యార్థులను బాదుతున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీకి ఇక్కడి పరిస్థితులు తెలియజేస్తూ ఇంగ్లీషుతోపాటు ఆయనకు అర్థమయ్యేలా ఇటాలియన్ భాషలో కూడా లేఖ రాశామని, అందుకే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తప్పనిసరి పరిస్థితుల్లో నోరు మెదపాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
లక్షలాది విద్యార్థుల తరఫున బీజేపీ పోరాటం
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ కార్యకర్తలు కాలేజీలకు వెళ్లి సుమారు ఎనిమిది లక్షల మంది విద్యార్థుల నుంచి సంతకాలు సేకరించారని స్పష్టం చేశారు. ఆ వినతిపత్రాలను ముఖ్యమంత్రికి అందించేందుకు సమయం కోరితే కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని, విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వానికి ఉన్న బాధ్యతారాహిత్యానికి ఇదే నిదర్శనమని విమర్శించారు. తాను ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం 48 గంటల నిరాహార దీక్ష చేశానని, సెక్రటేరియట్ వద్దకు వెళ్లిన బీజేపీ నాయకులను, కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేసి, కేసులు పెట్టి తీవ్రంగా కొట్టడంతో చాలామంది హాస్పిటల్ పాలయ్యారని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీఆరఎస్ రెండూ ఒక్కటేనని, ఒకరి తప్పులను మరొకరు కప్పిపుచ్చుకుంటున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు ఇవ్వలేకపోతే చేతులెత్తేస్తున్నామని ఒప్పుకోవాలని, అప్పుడు ప్రజలే ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే బీజేపీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలన్నింటినీ పూర్తిగా విడుదల చేస్తుందని స్పష్టమైన భరోసా ఇచ్చారు. ఆయుష్ విద్యార్థులకు అండగా నిలిచి వారి స్టైఫండ్ పెరిగేలా పోరాడిన తీరుý సమస్త విద్యార్థి లోకం పక్షాన బీజేపీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన పూర్తయిన సందర్భంలోనైనా సీఎం రేవంత్ రెడ్డి మొండి వైఖరి వీడి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
బీజేపీలో భారీ చేరికలు
ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలతో కూడిన ‘వికసిత భారత’ నిర్మాణానికి, బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై హైదరాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి పలువురు ప్రముఖులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవలే రిటైర్ అయిన డీసీపీ శ్రీనివాస్, సూర్యాపేట జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యులు, వ్యాపారవేత్తలు, పెద్ద సంఖ్యలో యువకులు రామచందర్ రావు సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి వారిని సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటాన్ని క్షేత్రస్థాయికి మరింత బలంగా తీసుకెళ్తామని నాయకులు స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతంరావు, సీనియర్ నాయకుడు మనోహర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు శ్రీలతా రెడ్డి, భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్, హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



