– మండలిలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : నాగ్‌పూర్-మంచిర్యాల-వరంగల్-ఖమ్మం-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే చాలా ముఖ్యమైన రహదారి అని, మొత్తం 310 కి.మీ పొడవు ఉన్న ఈ ప్రాజెక్టులో 280 కి.మీ తెలంగాణలోనే ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శాసనమండలిలో సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్‌లు శనివారం అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ రహదారి నాలుగైదు జిల్లాలను కలుపుతూ తెలంగాణ నుంచి నాగ్‌పూర్, విజయవాడ వైపు ప్రయాణించే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మంచిర్యాల-వరంగల్ రహదారిని ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారని, 2023 మార్చి 31న ఎల్‌వోఏ ఇచ్చి మే 23న అగ్రిమెంట్ జరిగిందని చెప్పారు. మొదట 730 రోజుల్లో అంటే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, అయితే భూసేకరణ, కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల పనుల్లో ఆలస్యం జరిగిందని వివరించారు. భూసేకరణలో దాదాపు మొత్తం సమస్యలు పరిష్కరించామని, చిన్నచిన్న సమస్యలతో కొంత భూమి మాత్రమే పెండింగ్‌లో ఉందని చెప్పారు. ఆలస్యం కారణంగా కాంట్రాక్టర్‌కు ఎక్స్‌టెన్షన్ ఆఫ్ టైమ్ ఇచ్చి 2027 డిసెంబర్ 31నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా మే 26న ఈ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా సమీక్షించారన్నారు. తెలంగాణకు ఈ రహదారి ఎంతో ముఖ్యమని, ముఖ్యంగా నాగ్‌పూర్‌కు వెళ్లే ప్రజలకు ఉపయోగకరమని చెప్పారు. భూసేకరణ విషయంలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు. వారికి మార్కెట్ రేటు ప్రకారం పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని, కోదండరామ్ లేవనెత్తిన భూసేకరణ సమస్యలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని చెప్పారు. ప్రస్తుతం ఒకటి రెండుచోట్ల మాత్రమే భూమి అప్పగింత పెండింగ్‌లో ఉందన్నారు. ఒకచోట సుమారు 1 నుంచి 1.30 కిలోమీటర్లు, మరో ప్యాకేజీలో 5.7 కిలోమీటర్ల మేర సమస్య ఉందని, దాన్ని కూడా త్వరలో పరిష్కరిస్తామని అన్నారు. భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది కాగా, నిర్మాణ పనులు మొత్తం ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నోడల్ ఏజెన్సీగా ఎన్‌హెచ్‌ఏఐకి పూర్తి సహకారం అందిస్తోందన్నారు. ఆ అధికారులతో మాట్లాడి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు ఇస్తామన్నారు. 31 డిసెంబర్ 2027 నాటికి ఈ కీలక రహదారి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తామని సభ్యులందరికీ తెలియజేస్తున్నామని మంత్రి వెంకటరెడ్డి చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



