మత్స్యకారుల బతుకులకు భరోసా

– ఎఫ్‌టీఎల్‌ హద్దుల పరిరక్షణపై రాజీ పడబోం
– ఇప్పటికే 44 వేల చెరువులకు జియో ట్యాగింగ్‌
– నెల్లికల్‌ ఎత్తిపోతలపై సభాముఖంగా విస్పష్టమైన హామీ
– వ‌చ్చే జూన్‌ నాటికి 7,800 ఎకరాలకు సాగునీరు
– పీడీఎస్‌లో అదనపు నిత్యావసర సరకుల పంపిణీపై సానుకూల పరిశీలన
– శాసనమండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్‌ 11: చెరువుల పూర్తి నీటిమట్టం—ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) హద్దులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుతామని, జలవనరుల ఆక్రమణలను ఉపేక్షించబోమని ఆయన శాసన మండలి వేదికగా రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. చెరువు నిండితే పల్లె పచ్చబడుతుందని, మత్స్యకారుడి వల నిండితే అతని కుటుంబంలో వెలుగులు విరుస్తాయని, అందుకే చెరువులు, కుంటలు, ఇతర జలవనరుల పరిరక్షణతోపాటు వాటిపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల జీవనోపాధిని కాపాడటాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య అంశంగా భావిస్తోందన్నారు. శుక్రవారం శాసన మండలిలో జరిగిన చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన అంశాలకు మంత్రి సమాధానమిచ్చారు. చెరువుల ఎఫ్‌టీఎల్‌ హద్దులు దెబ్బతిన్నా, జలవనరులు ఆక్రమణలకు గురైనా, వాటిపై ఆధారపడి జీవించే మత్స్యకార కుటుంబాలకు నష్టం వాటిల్లినా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని చెప్పారు. సభ దృష్టికి తీసుకొచ్చిన నిర్దిష్ట సమస్యను నీటిపారుదల శాఖ అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. వారం రోజుల్లోగా సంబంధిత చెరువును సందర్శించి, జలవనరుల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలు, స్థానిక మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి అవసరమైన కార్యాచరణపై నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.రాష్ట్రం ఏర్పడిన సమయంలో సుమారు 2,150గా ఉన్న మత్స్య సహకార సంఘాల సంఖ్య ప్రస్తుతం ఆరు వేలకు పైగా పెరిగిందని సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా సంఘాల సభ్యత్వం సుమారు రెండు లక్షల నుంచి 6.5 లక్షలకు చేరిందని వివరించారు. చెరువులు, ఇతర జలవనరుల పరిరక్షణలో మత్స్య సహకార సంఘాలకు మరింత క్రియాశీలమైన పాత్ర కల్పిస్తూ సమగ్ర విధానాన్ని రూపొందించాలని సభ్యులు కోరారు. రాష్ట్రంలోని అన్ని చెరువులకు పరిరక్షణ, నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు.  జలవనరుల సమర్థ నిర్వహణ, నిరంతర పర్యవేక్షణ, ఆక్రమణల నిరోధానికి కమిటీల వ్యవస్థను పునరుద్ధరించాలని వచ్చిన సిఫారసుల మేరకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సుమారు 44 వేల చెరువులకు జియో ట్యాగింగ్‌ పూర్తయిందని మంత్రి తెలిపారు. చెరువుల పరిరక్షణకు అదనపు నిధులు అవసరమైతే వాటిని సమకూర్చేందుకు ప్రభుత్వం వెనుకాడబోదని స్పష్టం చేశారు.
నల్లగొండ జిల్లాలోని నెల్లికల్‌ ఎత్తిపోతల పథకాన్ని డిసెంబర్‌ 2027 నాటికి సంపూర్ణంగా పూర్తి చేసి, సుమారు 24 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని మంత్రి  మండలి సాక్షిగా విస్పష్టమైన హామీ ఇచ్చారు. నెల్లికల్‌ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా గుర్తించిందని చెప్పారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్దేశించుకున్న గడువులోగా రెండు దశలను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని వివరించారు.  తొలి దశలో జూన్‌ 2027 నాటికి 7,800 ఎకరాలకు సాగునీరు అందిస్తామని, మిగిలిన సుమారు 16 వేల ఎకరాలకు డిసెంబర్‌ 2027 నాటికి నీరందించి మొత్తం 24 వేల ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేస్తామన్నారు
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రస్తుతం అందిస్తున్న బియ్యం, గోధుమలు, చక్కెరతోపాటు మరికొన్ని నిత్యావసర సరుకులను పంపిణీ చేసే ప్రతిపాదనను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోంద‌న్నారు.శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌తోపాటు పలువురు సభ్యులు చేసిన సూచనలపై మంత్రి స్పందించారు. పీడీఎస్‌ పరిధిలోకి అదనపు సరుకులను తీసుకురావడం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, అందుకు అవసరమయ్యే ఆర్థిక భారాన్ని సమగ్రంగా అంచనా వేస్తున్నామని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *