మహిళా జర్నలిస్టుల స్వేచ్ఛను కాపాడాలి

– ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ పరస్పర ఆధారితాలు
– జాతీయ మహిళా జర్నలిస్టుల సదస్సులో మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: మన గణతంత్రం, మన పత్రికా రంగం రెండూ కలిసే ఎదుగుతాయి.. లేదా కలిసే పతనమవుతాయి అన్న ప్రముఖ పాత్రికేయుడు జోసెఫ్ పులిట్జర్ మాటలు స్వేచ్ఛాయుత మీడియా, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం మధ్య ఉన్న విడదీయలేని సంబంధాన్ని స్పష్టం చేస్తున్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఉమెన్ జర్నలిస్ట్స్‌ను ఆమె ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా విషయంలో అధికారాన్ని ప్రశ్నించే మహిళా జర్నలిస్టులను శత్రువులుగా చూడటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్రశ్నలను అణచివేయడంలో కాక వాటికి సమాధానం చెప్పే ధైర్యంలోనే ప్రజాస్వామ్య బలం ఉంటుందని స్పష్టం చేశారు. మహిళా జర్నలిస్టులు తమ వృత్తిపరమైన బాధ్యతలను భయం లేకుండా నిర్వర్తించగలగాలంటూ నిజాలను వెలుగులోకి తీసుకురావడం, అధికారాన్ని ప్రశ్నించడం వారి వృత్తిపరమైన హక్కులని అన్నారు. సీఈసీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలను కవర్ చేస్తున్న మహిళా జర్నలిస్టులపై దాడులు, లైంగిక వేధింపులు జరిగినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని సీతక్క అన్నారు. ఈ ఘటనలకు సంబంధించి మహిళా జర్నలిస్టులపై కేసులు నమోదైనట్లు వచ్చిన నివేదికలను కూడా నిష్పక్షపాతంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ అధికారంలో ఉన్న సందర్భాల్లో మహిళల స్వేచ్ఛ, భద్రతపై దాడులు పెరుగుతున్నాయని మంత్రి సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలను పురుషుల ఆధీనంలో ఉంచాలనే పితృస్వామ్య భావజాలాన్ని అధిగమించాలని, మనుస్మృతిలోని మహిళల స్వతంత్రతను పరిమితం చేసే భావనలకు బదులుగా డాక్టర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే రాజ్యాంగ సూత్రాలే సమాజానికి మార్గదర్శకాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో పనిచేసే మహిళ నుంచి ఉద్యమాల్లో పాల్గొనే మహిళ వరకు, వార్తలు సేకరించే మహిళా జర్నలిస్టు వరకు ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, గౌరవం దక్కాలని కోరారు. అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే స్వేచ్ఛ, జవాబుదారీతనం, ప్రజలకు వాస్తవాలను అందించే స్వతంత్ర మీడియా కూడా ప్రజాస్వామ్యానికి కీలకమని అన్నారు. పత్రికా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యం బలంగా మనుగడ సాగించలేదని చెప్పారు. మహిళల ఆర్థిక స్వావలంబనతోపాటు వారి సామాజిక, రాజకీయ స్వేచ్ఛకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలను కేవలం ఆదాయం సంపాదించే స్థాయిలోనే కాక ఆస్తులు కలిగినవారిగా, వ్యాపార సంస్థల యజమానులుగా, నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందని తెలిపారు. మహిళ సాధికారత అంటే ఆర్థికంగా సంపాదించడం మాత్రమే కాదని, తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకునే సామర్థ్యం, తన అభిప్రాయాన్ని నిర్భయంగా వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా ఉండాలని తెలిపారు. ఆర్థిక స్వాతంత్య్రం, విద్య, రాజకీయ భాగస్వామ్యం, భావప్రకటనా స్వేచ్ఛ పరస్పరం అనుసంధానమై ఉన్నాయని చెప్పారు. మహిళా జర్నలిస్టుల భద్రత, గౌరవం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణకు ఐజేయూ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సీతక్క సూచించారు. వృత్తిపరమైన అనుబంధాలు, సిద్ధాంతపరమైన భేదాలు ఎలా ఉన్నా మహిళల గౌరవానికి, భద్రతకు ముప్పు ఎదురైనప్పుడు మహిళా జర్నలిస్టులంతా ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. సదస్సులో హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి రాధారాణి, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కర్ణాటక మీడియా అకాడమీ చైర్‌పర్సన్ అయిషా కనుమ్, ఐజేయూ జాతీయ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్ జమ్మూ, జర్నలిస్టు ఉద్యమ నేతలు దేవులపల్లి అమర్, విరాహత్ అలీ, సోమసుందర్, అరుణ తదితరులు, వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో మహిళా జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *