బీఆర్‌ఎస్ అబద్ధాలను ఎవరూ నమ్మరు

– మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే నాటకాలు
– ఎల్‌నినో పరిస్థితులను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు
– కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల ప్రచారం గోబెల్స్‌ను మించిపోయింది
– బ్యారేజీలు లేకుండానే గోదావరి బేసిన్‌లో రికార్డు స్థాయిలో వరి సాగు, ధాన్యం కొనుగోళ్లు
– మీడియా సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఘోర వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఎల్‌నినో పరిస్థితులను సైతం తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేందుకు బీఆర్‌ఎస్ నేతలు తీవ్రమైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సచివాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు చేస్తున్న అసత్య ప్రచారం హిట్లర్ ప్రధాన ప్రచారకర్త జోసెఫ్ గోబెల్స్‌ను మించిపోయిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పదేళ్ల వారి పాలనలో నీటిపారుదల రంగాన్ని సర్వనాశనం చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. వారి హయాంలోనే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎస్‌ఎల్‌బీసీ, సీతారామ, ప్రాణహిత-చేవెళ్ల, దేవాదుల వంటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి ఉంటే ప్రస్తుత కరువు కాలంలో రైతాంగానికి తీవ్రమైన కష్టాలు తప్పేవని తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రూపకల్పనను మార్చి రైతులకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని, పాలమూరు, సీతారామ ప్రాజెక్టుల్లో కోట్లు కుమ్మరించినా ఒక్క ఎకరానికి కూడా సరిగా నీళ్లివ్వలేకపోయారని విమర్శించారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగాన్ని కూడా ఎందుకు పూర్తిచేయలేదో వారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పేలవమైన డిజైన్, నిర్మాణమే దుస్థితికి కారణం

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల దుస్థితికి గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అవినీతి, కక్కుర్తే కారణమని స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ బీఆర్ఎస్ హయాంలోనే దెబ్బతిన్నదని, దాని డిజైన్, నిర్మాణం, నిర్వహణలో తీవ్ర లోపాలు ఉన్నట్లు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ), విజిలెన్స్ నివేదికలు, సాంకేతిక, న్యాయ విచారణలు స్పష్టంగా తేల్చాయని వెల్లడించారు. తమ హయాంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు నాటకాలు ఆడుతూ ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, కానీ ఈ విషపూరిత ప్రచారాన్ని ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు.

మూడు బ్యారేజీలు లేకుండానే రికార్డు సాగు

గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాల వల్ల ఎన్‌డీఎసఏ లిఖితపూర్వక సూచనల మేరకే మూడు బ్యారేజీల గేట్లను ఎత్తి ఉంచాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు. అయితే, ఈ మూడింటిని వినియోగించకుండానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో తమ ప్రభుత్వం రికార్డు స్థాయిలో వరి సాగు, ధాన్యం కొనుగోళ్లు సాధించిందని గర్వంగా ప్రకటించారు. గోదావరి, కృష్ణా బేసిన్లలో సాగు విస్తీర్ణం, పంట ఉత్పత్తి గతంలో కంటే గణనీయంగా పెరిగిందని గణాంకాలతో వివరించారు.

అంతర్జాతీయ నిపుణులతో పునరుద్ధరణ

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై తమ ప్రభుత్వానికి ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని, సంపూర్ణ చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. దేశీయ, అంతర్జాతీయ నిపుణుల సలహాలు, సూచనలతో నూతన డిజైన్లను రూపొందిస్తూ పునరుద్ధరణ పనులను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ నేతల విషప్రచారం వెనుక ఉన్న వాస్తవాలను రాష్ట్ర రైతాంగం అర్థం చేసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మంత్రి జి.వివేక్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ రెడ్డి, బాలు నాయక్, మందుల సామేల్, సంజీవ్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ సలహాదారు పరీక్షిత్ మెహ్రా, ఈఎన్‌సీ రమేష్‌బాబు తదితర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *