ప్రోస్టేట్ క్యాన్సర్.. నిశ్శబ్దపు ముప్పు

– ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన మాసంగా సెప్టెంబ‌ర్

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబరు 10: పురుషుల్లో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే పెరిగే అవకాశం ఉందని కేర్ హాస్పిటల్స్ వైద్యులు హెచ్చరించారు. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన పురుషులు తమ వయసు, కుటుంబ చరిత్ర, వ్యక్తిగత ముప్పును దృష్టిలో ఉంచుకుని ప్రోస్టేట్ ఆరోగ్యంపై వైద్యులను సంప్రదించాలని సూచించారు. మూత్ర సంబంధిత సమస్యలు వచ్చిన తర్వాతే పరీక్షలు చేయించుకోవాలనే భావన సరికాదని పేర్కొన్నారు. సెప్టెంబరు ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా ఈ వ్యాధిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని వైద్యులు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ 2026 ఆగస్టులో విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం.. 2024లో ప్రపంచవ్యాప్తంగా 15 లక్షలకు పైగా ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. మొత్తం క్యాన్సర్ కేసుల్లో ఇవి దాదాపు 8 శాతం. పురుషుల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. భారత్‌లోనూ ప్రోస్టేట్ క్యాన్సర్ భారం పెరుగుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్–నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ అంచనాల ప్రకారం దేశంలో ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు 2020లో 41,532 ఉండగా, 2025 నాటికి 47,068కు పెరుగుతాయని అంచనా వేశారు. అంటే ఐదేళ్లలో 13 శాతానికి పైగా పెరుగుదల. వయసు పెరిగే కొద్దీ ఈ క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతుం దని వైద్యులు పేర్కొన్నారు.  ప్రోస్టేట్ క్యాన్సర్‌లో ప్రధాన సమస్య.. ప్రారంభ దశలో ఎలాంటి హెచ్చరిక సంకేతాలు కనిపించకపోవడం. వ్యాధి ఉన్నప్పటికీ వ్యక్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు భావిస్తూ సాధారణ జీవితం కొనసాగించవచ్చు. వయసు ప్రధాన ముప్పు కారకాల్లో ఒకటి. ముఖ్యంగా 50 ఏళ్ల తర్వాత ప్రమాదం పెరుగుతుంది. తండ్రి, సోదరుడు లేదా ఇతర దగ్గరి బంధువుల్లో ఎవరికైనా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లయితే మరింత అప్రమత్తంగా ఉండాలి.

మూత్ర సంబంధిత లక్షణాలు కనిపిస్తాయనేది అపోహ 

కేర్ హాస్పిటల్స్, క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ అండ్ హెడ్–యూరాలజీ, రోబోటిక్, లాపరోస్కోపీ అండ్ ఎండోయూరాలజీ సర్జన్ డాక్టర్ పి. వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తే తప్పనిసరిగా మూత్ర సంబంధిత లక్షణాలు కనిపిస్తాయనేది అపోహ. సమస్యలు తీవ్రమయ్యే వరకు ఎదురుచూడకుండా వైద్యుడితో ప్రోస్టేట్ ఆరోగ్యం గురించి మాట్లాడాలి. వయసు, కుటుంబ చరిత్ర, లక్షణాలు, వ్యక్తిగత ముప్పును పరిశీలించి తదుపరి పరీక్షలు అవసరమా లేదా వైద్యుడు నిర్ణయిస్తారు” అని తెలిపారు. మూత్ర విసర్జన ప్రారంభించడంలో ఇబ్బంది, మూత్ర ధార బలహీనంగా లేదా మధ్యలో ఆగిపోవడం, ముఖ్యంగా రాత్రిపూట తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం, మూత్రాశయం పూర్తిగా ఖాళీ కానట్లు అనిపించడం, మూత్ర విసర్జన సమయంలో నొప్పి లేదా మంట, మూత్రం లేదా వీర్యంలో రక్తం కనిపించడం వంటి లక్షణాలు కొనసాగితే వైద్యులను సంప్రదించాలి. నడుము కింది భాగం, తుంటి లేదా కటి ప్రాంతంలో నిరంతర నొప్పి ఉన్నా వైద్య పరీక్ష అవసరం కావచ్చు. అయితే మూత్ర సంబంధిత సమస్యలన్నీ ప్రోస్టేట్ క్యాన్సర్‌కు సంకేతాలు కావని వైద్యులు స్పష్టం చేశారు. వయసు పెరిగేకొద్దీ సాధారణంగా కనిపించే ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదలతోనూ ఇలాంటి లక్షణాలు రావచ్చు. ఇన్ఫెక్షన్లు, ఇతర ప్రోస్టేట్ సమస్యల వల్ల కూడా మూత్ర విసర్జనలో మార్పులు కనిపించవచ్చు. వాటిని వయసుతో వచ్చే సాధారణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేయడమే ప్రమాదకరమని పేర్కొన్నారు.

ప్రతి రోగిలో ఒకే విధంగా ఉండదు 

కేర్ హాస్పిటల్స్‌లోని కేర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్రో, బోటిక్ సర్జన్ డాక్టర్ అజయ్ చాణ‌క్య వల్లభనేని మాట్లాడుతూ ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రతి రోగిలో ఒకే విధంగా ఉండదు.. కొన్ని క్యాన్సర్లు నెమ్మదిగా పెరుగుతాయి. ఎంపిక చేసిన రోగుల్లో వెంటనే చికిత్స ప్రారంభించకుండా వైద్యుల పర్యవేక్షణలో ‘యాక్టివ్ సర్వైలెన్స్’ విధానాన్ని అనుసరించవచ్చు. మరికొందరిలో వ్యాధి స్వభావాన్ని బట్టి శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, హార్మోన్ థెరపీ లేదా ఇతర చికిత్సలు అవసరం కావచ్చు. క్యాన్సర్ ఇతర భాగాలకు వ్యాపించకముందే గుర్తిస్తే చికిత్సకు మరిన్ని అవకాశాలు ఉంటాయి. సరైన సమయంలో కచ్చితమైన నిర్ధారణ చేసి, క్యాన్సర్ స్వభావం, రోగి పరిస్థితికి అనుగుణంగా చికిత్స అందించడమే ముఖ్యం అని వివరించారు.

ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ అయిన ప్రతి ఒక్కరికీ వెంటనే శస్త్రచికిత్స అవసరం ఉండదని వైద్యులు తెలిపారు. క్యాన్సర్ దశ, గ్రేడ్, పీఎస్‌ఏ స్థాయులు, రోగి వయసు, ఇతర ఆరోగ్య సమస్యలు, క్యాన్సర్ పెరుగుదల స్వభావం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని చికిత్సను నిర్ణయిస్తారు. లక్షణాలు వచ్చే వరకు ఎదురుచూడకుండా వైద్యుడిని సంప్రదించండి అని కేర్ హాస్పిటల్స్ సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *