నీరున్నా పంట‌ల‌ను కాపాడ‌లేని ప్ర‌భుత్వం

– ఇది రేవంత్ తెచ్చిన క‌రువు
– రాష్ట్ర రైతుకు నీరు నిల్.. ఏపీకి ఫుల్‌
– ఇదీ ప్ర‌భుత్వ నిర్వాకం
– మోటార్ల‌ను పూర్తిస్థాయిలో ఎందుకు న‌డ‌ప‌రు?
– పాల‌మూరుకు నీరందించ‌లేని ద‌ద్ద‌మ్మ ప్ర‌భుత్వం
– నిప్పులు చెరిగిన హ‌రీష్‌రావు 

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 10: కండ్ల ముందు నీళ్లు పారుతున్నా పొలాలకు నీళ్లు ఇవ్వలేని పాలన. పంటలను కాపాడలేని పరిస్థితి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు రేవంత్ రెడ్డి తెచ్చిన కరవు అని మాజీ మంత్రి హ‌రీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో గురువారం మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ పాలమూరు బిడ్డను అని విర్రవీగే ఈ రేవంత్ రెడ్డి కృష్ణా జలాలు ఎత్తకుండా పాలమూరు ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నడన్నారు. రాష్ట్ర‌ రైతాంగానికి నీళ్లు నిల్లు.. ఏపీ రైతాంగానికి నీళ్లు ఫుల్లు అని ఆరోపించారు. ఎల్ నినో ప్రమాదం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థలు చెబుతున్న‌ప్పుడు వచ్చిన నీళ్లు వచ్చినట్లు ఎత్తకుండా చోద్యం చూస్తున్నాడ‌న్నారు. ఎత్తగలిగే అవకాశం ఉండి మోటార్లు బంద్ పెట్టి కూర్చున్నడని ఆరోపించారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా తమకు బాధ్యత ఉందన్నారు. రేవంత్ రెడ్డికి తన గురువు బాగుంటే చాలు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొదటి పంప్ హౌజ్ ఎల్లూరు పంప్ హౌజ్ కేవలం రెండు మోటార్లు నడుస్తున్నాయి. మిగతా ఎందుకు బంద్ పెట్టావు.. ఆ రెండు కూడా ఆన్ అండ్ ఆఫ్ లో నడుస్తున్నాయి. స‌గ‌టున‌ 11 గంటలే మోటార్లు నడుపుతున్నారు. 24 గంటలు 5 మోటార్లు నడపాలి కానీ లేదు. రోజుకు 1600 క్యూసెక్కులు రావాల్సిన చోట 700 క్యూసెక్కులే వస్తున్నాయి. 4000 క్యూసెక్కులు ఎత్త గలిగే కెపాసిటీ ఉంటే రేవంత్ రెడ్డి ఎత్తుతున్నది 700 క్యూసెక్కులు. నీ ప్రాంతం మీద నీకున్న ప్రేమ వట్టి మాటలే. బాబుకి గురు దక్షిణ చెల్లించుకుంటున్నవా.. వెలిగొండ, పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు తరలించుకుపోయేందుకు సహకరిస్తున్నవా అని ఆయ‌న‌ ప్ర‌శ్నించారు. బీమా ప్రాజెక్టులో మూడు మోటార్లు ఉంటే ఒకటి నడుపుతున్నారు.. బేసిన్ తో సంబంధం లేని వెలిగొండ ద్వారా చంద్రబాబు నీళ్లు తీసుకుపోతుంటే బేసిన్ లో ఉండి, నికర జలాల కేటాయింపు ఉన్న బీమా ఎందుకు నడపట్టేద‌ని హ‌రీష్‌రావు ప్ర‌శ్నించారు. నెట్టంపాడులో నాలుగు ఉంటే ఒకటి, కోయిల్ సాగర్ లో మూడు ఉంటే ఒకటి నడుపుతున్నరు. నీళ్లు ఉండి మోటార్లు నడపడం చేతగాని ముఖ్యమంత్రిని నిన్నే చూస్తున్న. అసెంబ్లీలో తాము ప్రజల తరపున మాట్లాడితే మార్షల్స్ పెట్టి మమ్మల్ని ఎత్తేసావు. మమ్మల్ని కాదు మోటార్లు ఆన్ చేసి కృష్ణా నీళ్లు ఎత్తు. రేవంత్ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ వరప్రదాయిని అయిన కృష్ణా నీళ్లు ఏపీకి వరప్రదాయినిగా మారాయ‌న్నారు. పాలమూరు, నల్లగొండ జిల్లాలకు నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నారు.. సాగు, తాగు నీళ్ల కోసం తండ్లాడుతున్నారు.. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో రైతులు అర్దనగ్న ప్రదర్శన చేస్తున్నరు.. పొంగులేటి నియోజకవర్గంలో రైతులు ధర్నాలు చేస్తున్నరు.. రాష్ట్రవ్యాప్తంగా సబ్ స్టేషన్ల ముందు రైతులు ధర్నా చేస్తున్నరు అని తెలిపారు. రోమ్ తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్లు సస్పెన్ష‌న్‌ల‌ బిజీలో ఉన్నడు అని హ‌రీష్‌రావు ఘాటుగా విమ‌ర్శించారు. నీళ్లు ఉండి నీళ్లు ఎత్తరు, ఉత్పత్తి కెపాసిటీ ఉండి కరెంట్ ఉత్పత్తి చేయడం లేదు. కేటీపీఎస్ 800 మెగావాట్ల ప్లాంటు మూసేసారు. 540 మెగావాట్ల బీటీపీఎస్ యూనిట్ 3,4 ప్లాంట్లు మూసేసారు. యాదాద్రిలో 4000 మెగావాట్లకు ఉత్పత్తి చేస్తున్నది. 2000 మెగావాట్లు ఒకవైపు బొగ్గు సర్ ప్లస్ ఉంది అంటున్నరు. మరోవైపు యాదాద్రి ప్లాంటుకు బొగ్గు సరఫరా చేయడం లేదన్నారు. కొండారెడ్డిపల్లిలో ధర్నా చేస్తున్న రైతులు, పొంగులేటి నియోజకవర్గంలో చేస్తున్న రైతులు బిఆర్ఎస్ కార్యకర్తలా అని ప్ర‌శ్నించారు. కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు 4000 కోట్లు ఖర్చు చేసి, పూర్తి చేసి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినం. మూడేళ్లలో ఇహెచ్టీ సబ్ స్టేషన్ ఒక్కటీ కట్టలేదు. రైతులకు ఇచ్చే పవర్ లేదు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి మాత్రం పవర్ ఉప‌యోగిస్త‌రన్నారు. కోమటి రెడ్డి నాడు కరెంట్ లేదని ఆయ‌న‌ విమర్శలు చేసారు.. ఇప్పుడు 7 గంటలు కూడా కరెంట్ వస్తలేదు, ఎందుకు లాగ్ బుక్స్ చూడటం లేదు. రేవంత్ రెడ్డిని చూస్తే లాగులు తడుస్తున్నాయా అని  ప్ర‌శ్నించారు. శ్రీశైలంలో మనకు ఉన్నవి కల్వకుర్తి, పాలమూరు ప్రాజెక్టులు. పాలమూరు ప్యాకేజీ-3లో నెల రోజులు కష్టపడితే పూర్తి అవుతుంది. మూడేళ్ల నుంచి ఆ పని చేయడం లేదు. 5,6 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తయి. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు అని, కేసీఆర్ కు కీర్తి వస్తుందని పనులు పూర్తి చేయడం లేదు. పాలమూరు ప్యాకేజీ ని పడావు పెట్టినవు అధికారిక లెక్కల ప్రకారమే శ్రీశైలం నుంచి 35 టీఎంసీలు ఏపీ తీసుకుపోయింది. కానీ రేవంత్ ఎత్తింది కేవలం 7 టీఎంసీలు బిఆర్ఎస్ పోరాటం చేస్తే మొన్న కేటీఆర్  వెళ్తే సాగర్ కు కొద్దికొద్దిగా నీళ్లు ఇస్తున్నరు. బిఆర్ఎస్ నిలదీస్తే తప్ప మొద్దు నిద్ర వీడరా అని నిల‌దీశారు. ప్రకృతి వైపరీత్యం కాదు.. కాంగ్రెస్ వైపరీత్యం వచ్చింది. బేసిన్ లో లేని వెలిగొండకు నీళ్లు.. బేసిన్ లో ఉన్న మహబూబ్ నగర్ కు నీళ్లు లేని పరిస్థితి. 2024–25లో 28.49 శాతం, 2025–26లో 25.77శాతం మాత్రమే నీటి వినియోగం జ‌రిగింది. ఆరు లక్షల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించిన చేవలేని ప్రభుత్వం మీది. ఈ ఏడాది కూడా అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ కృష్ణా జలాల వినియోగం జ‌రిగింది ఈ మూడేళ్ల కాలంలోనే అని అన్నారు. ఎవర్ లోయెస్ట్ యుటిలైజేషన్ ఉన్న తాత్కాలిక వాటాను కూడా వాడుకోలేని చేతగాని ప్రభుత్వం ఇది. రైతులకు కావాల్సింది బూతులు కాదు.. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు కాదు.. పంపులకు పవర్, పొలాలకు సాగునీరు. ఎల్ నినో ప్రకృతి వైపరీత్యం కావచ్చు.. కానీ నీరు అందుబాటులో ఉండి కూడా రైతుకు అందించకపోవడం ప్రభుత్వ వైఫల్యమేన‌న్నారు. కాంగ్రెస్ వైపరీత్యం. ముఖ్యమంత్రిగా మీ మౌనం తెలంగాణ తాగు, సాగునీటి ప్రయోజనాలకు శాపంగా మారుతోందన్నారు. ఏపీ నీటి తరలింపుకు వెంటనే అడ్డుకట్ట వేయాలి. అవసరం అయితే అపెక్స్ కౌన్సిల్ డిమాండ్ చేయాలి. పాలమూరు అన్ని ప్రాజెక్టుల మోటార్లు ఆన్ చేసి పొలాలకు నీళ్లు ఇవ్వాలి సాగర్ కాల్వకు నీళ్లు ఇవ్వాలి, నల్లగొండ పాలాలకు నీళ్లు మళ్లించాలి అని హ‌రీష్‌రావు డిమాండ్ చేశారు. వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పరిస్థితులు బాలేదు… అసెంబ్లీలో మాట్లాడమని ఫోన్లు చేస్తున్నరు. దీన్ని అడుగుతం అని మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేసిండు. వర్షాల కారణంగా ఎస్ఆర్ఎస్పీలో 46టీఎంసీల నీళ్లు ఉన్నయి. గుత్ప అలీ సాగర్ లిఫ్టులు ప్రారంభించి చెరువులు నింపాలని డిమాండ్ చేస్తే తూతూమంత్రంగా గుత్ప లిప్టులు ఆన్ చేసారు. నాలుగు మోటార్లకు గాను ఒక్క మోటార్ నడిపిస్తున్నరు. వెంటనే పూర్తి స్థాయి గుత్ప లిఫ్టు నడపాలి. నాలుగు మోటార్లు నడిపి అన్ని చెరువులు నింపాలి. అలీ సాగర్ కెపాసిటీ 720. నాలుగు మోటార్లకు గాను సగమే నడుపుతున్నరు. అది కూడా ఆన్ అండ్ ఆఫ్ గా నడుపుతున్నరు. గుత్ప, అలీసాగర్ కలిపి రోజుకు 1260 క్యుసెక్కులు, నెల రోజులు నడిపినా 3 టీఎంసీలు మాత్రమే. అలా చేస్తే ఉన్న చెరువులు అన్ని నిండుతాయి. బాల్గొండ నియోజకవర్గంలో ఉన్న లక్ష్మీ కెనాల్ కు నిండుగా నీళ్లు ఇవ్వాలి. చౌటుపల్లి హన్మంతరెడ్డి లిఫ్టు సహా ఇతర అన్ని లిఫ్టులు ఆన్ చేయాలి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *