
సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్,కాలమిస్ట్… మొబైల్:9440595494
వాన చినుకు కోసం నేల ఆత్రుతగా ఎదురు చూస్తోంది. ఆశల పల్లకి మోసే నల్లని మబ్బుల కోసం రైతు కళ్లు నిరంతరం ఆకాశాన్ని తిలకిస్తున్నాయి. పల్లెల్లోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు జలకళ కోసం నిరీక్షిస్తున్నాయి. విత్తిన విత్తనం మొలకెత్తి, పంట పొలాలు పచ్చదనం పరుచు కోవాలని, బావుల్లో జల మట్టాలు పెరగాలని, ప్రతి జలాశయమూ నిండుకుండలా తొణికిసలాడాలని తెలంగాణ గ్రామీణ సీమ నిండు మనసుతో కోరుకుంటోంది. ఈ ఏట వాతావరణంలో చోటుచేసుకున్న విచిత్ర పరిణామాలు, రుతుపవనాల ఆలస్యం కారణంగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
ఇటువంటి క్లిష్ట సమయంలో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, నదులు పరవళ్లు తొక్కి, జలాశయాలు నిండిపోయి, రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం ‘మహా వరుణ యాగానికి’ శ్రీకారం చుట్టడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆగస్టు 10న నల్గొండ-గుంటూరు జిల్లాల సరిహద్దులోని నాగార్జున సాగర్ డ్యామ్ తీరంలో ఉన్న విజయ విహార్ ప్రాంగణంలో ఈ మహా వైదిక క్రతువు నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ప్రత్యేక నిర్ణయం మేరకు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యక్ష సారథ్యంలో ఈ బృహత్ కార్యక్రమం జరగనుంది. తెలంగాణ లోనే అత్యంత ప్రాచీన, ప్రసిద్ధ దివ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన ప్రధాన అర్చకులు, లబ్ధప్రతిష్టులైన వేద పండితులు, ఋత్వికులు అత్యంత శాస్త్రోక్త విధానంలో ఈ యాగాన్ని నిర్వహించ నున్నారు.
ఈ మహా క్రతువుకు నాగార్జున సాగర్ వంటి ఆసియాలోనే అతిపెద్ద రాతి కట్టడమైన మహాజలాశయాన్ని వేదికగా ఎంచుకోవడంలో అంతర్లీనమైన ప్రతీకాత్మకత, సామాజిక ఆవశ్యకత స్పష్టంగా కనిపిస్తాయి. ఉమ్మడి నల్గొండ, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో కృష్ణానదిపై నిర్మితమైన నాగార్జునసాగర్ ప్రాజెక్టు తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయానికి, కోట్లాది మంది తాగునీటి అవసరాలకు, జల విద్యుత్ ఉత్పత్తికి దశాబ్దాలుగా ప్రాణాధారంగా నిలుస్తోంది. కుడి, ఎడమ కాలువల ద్వారా సాగర్ జలాలు అందే ఆయకట్టు ప్రాంతాల్లో దాదాపు 20 లక్షల ఎకరాలకు పైగా వి విస్తీర్ణంలో వ్యవసాయం సాగువుతుంది. ఈ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా, పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టి.ఎం.సి లు. సాగర్ నీటితో కళకళలాడితేనే నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల్లో ధైర్యం పెరుగుతుంది, పల్లెలకు జీవం వస్తుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చైతన్యవంత మవుతుంది. అందుకే ఈ సువిశాల జలరాశి తీరాన వరుణ యాగం నిర్వహించడం కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాకుండా, సాగునీటి ప్రాధాన్యతను, జల వనరుల సంరక్షణను సమాజానికి చాటిచెప్పే ఒక చారిత్రక సందర్భంగా భావించాలి.
యాగం కోసం విజయ విహార్ ఆవరణలో వైదిక నియమాలకు అనుగుణంగా 11 హోమ కుండాలను ప్రత్యేకంగా నిర్మించారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు చెందిన 108 మంది వేద పండితులు, వైదిక శ్రేష్ఠులు సప్తశతి, రుద్ర, పవమాన, వరుణ సూక్త మంత్రోచ్ఛారణల మధ్య ఈ యాగాన్ని జరప నున్నారు. యాదాద్రి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి నిర్ణయించిన ముహూర్తానికి అనుగుణంగా ఆగస్టు 10న మధ్యాహ్నం 3.20 గంటల నుంచి 3.24 గంటల మధ్య అత్యంత పవిత్రమైన మహా పూర్ణాహుతి ఘట్టం జరగనుంది. ఈ క్రతువులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజలు సమర్పించ నున్నారు. వర్షాలు విస్తారంగా కురిసి, దుక్కి దుక్కికి నీరంది, తెలంగాణలోని కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో చెరువులు, ప్రాజెక్టులు నిండాలని ఈ సందర్భంగా సంకల్పం పూననున్నారు.
భారతీయ సనాతన సంస్కృతిలో జలానికి దైవిక స్థానం లభించింది. “ఆపో వై సర్వా దేవతాః” అంటే జలమే సమస్త దేవతా స్వరూపం అని వేదాలు చాటాయి. వేదకాలం నుంచే నీటిని సమస్త జీవకోటికి ఆయువు పట్టుగా భావించారు. ప్రకృతి శక్తులలో వరుణుడిని జలాధిపతిగా, విశ్వ నియమ సంరక్షకుడిగా (‘రుతస్య గోపా’) ఆరాధించే సంప్రదాయం మనది. “ఆపో హిష్ఠా మయోభువః” అంటూ కృష్ణ యజుర్వేదం జలాలను ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, శ్రేయస్సును ప్రసాదించే అమృత తత్త్వంగా కీర్తించింది. వర్షపాతం క్షీణించినప్పుడు ప్రకృతి దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు యజ్ఞయాగాదులు నిర్వహించడం ప్రాచీనకాలం నుంచి వస్తున్న ఆచారం. తెలుగువారి జానపద జీవనంలోనూ వర్షానికి విడదీయరాని సంబంధం ఉంది. “వాన కురిస్తే పంట… పంట పండితే పండుగ” అనే నానుడి రైతు అనుభవం లోంచి పుట్టిన సత్యం. “జలమే జగతికి జీవం” అనే ఆధునిక పర్యావరణ నినాదానికి మూలం మన ప్రాచీన సంస్కృతి లోనే ఉంది.
ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే, తెలంగాణ వ్యవసాయ రంగానికి సమకాలీన వాతావరణ సవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. నైరుతి రుతుపవనాల కాలంలో (జూన్ నుంచి సెప్టెంబరు) లభించే వర్షపాతమే రాష్ట్ర వార్షిక సాగును నిర్ణయిస్తుంది. సాధారణంగా ఈ నాలుగు నెలల్లో తెలంగాణలో సగటున 730 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, రుతుపవనాల ప్రతికూలతల వల్ల కొన్ని జిల్లాల్లో తీవ్ర వర్షాభావం ఎదురవుతోంది. ఇది కేవలం పంట సాగునే కాక, భూగర్భ జల మట్టాల పతనానికి, చెరువులు ఇంకి పోవడానికి దారితీస్తుంది. విత్తనం వేసిన నాటి నుంచి కోత వరకు వర్షాలు క్రమం తప్పకుండా కురవకపోతే రైతు పెట్టిన పెట్టుబడి, విత్తనాలు, ఎరువుల ఖర్చులు బూడిదలో పోసిన పన్నీరవుతాయి.
రాష్ట్ర నీటిభద్రతకు వెన్నెముక లాంటి నాగార్జున సాగర్, శ్రీశైలం, నిజాం సాగర్, శ్రీరాం సాగర్, కాళేశ్వరం ప్రాజెక్టుల పరిధిలోని మిడ్ మానేరు, లోయర్ మానేరు, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ వంటి ప్రధాన జలాశయాలు నిండితేనే వ్యవసాయ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. వీటితో పాటు రాష్ట్రంలోని 40 వేలకు పైగా ఉన్న చిన్న, మధ్య తరహా చెరువుల పునరుద్ధరణ, కాలువల ఆధునికీకరణ, ఇంకుడు గుంతల నిర్మాణం, నీటిని పొదుపుగా వాడే సూక్ష్మ సేద్య పద్ధతులు మాత్రమే దీర్ఘకాలికంగా కరువు పరిస్థితులను నివారిస్తాయి. గతంలో కూడా వర్షాభావం ఏర్పడినప్పుడు యాదాద్రి క్షేత్రంలో వర్ష పాశుపత వరుణ యాగం నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు నాగార్జున సాగర్ తీరంలో నిర్వహిస్తున్న ఈ మహా యాగం, ఆధ్యాత్మిక సంకల్పాన్ని ప్రజా శ్రేయస్సుతో అనుసంధానించే విస్తృత ప్రయత్నం.
అదే సమయంలో, వర్షపాతం అనేది రుతుపవనాల కదలికలు, అల్ప పీడనాలు, ఉపరితల ఆవర్తనాలు, సముద్ర ఉష్ణోగ్రతలు (ఎల్ నినో, లా నినా ప్రభావాలు) వంటి అనేక భౌతిక, వాతావరణ అంశాలపై ఆధారపడిన సంక్లిష్ట ప్రకృతి శాస్త్ర ప్రక్రియ అనే విషయాన్ని మనం స్మరించు కోవాలి. కాబట్టి వరుణ యాగాన్ని వాతావరణ శాస్త్రానికి ప్రత్యామ్నాయంగా చూడకుండా, మానవాళి సామూహిక సంకల్పానికి, ప్రకృతి పట్ల మనం వ్యక్తపరిచే వినయ విధేయతలకు ప్రతీకగా అర్థం చేసుకోవాలి. పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకం వంటి సైంటిఫిక్ విధానాలతో పాటు ఆధ్యాత్మిక విశ్వాసాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడమే సంస్కారవంతమైన సమాజ లక్షణం.
ఒకవైపు యాగ వేదికపై వేద పండితుల మంత్ర ఘోషలు మార్మోగుతుంటే, మరోవైపు పొలంలో పచ్చని విత్తనం మొలకెత్తేందుకు రైతు ఆశగా ఆకాశం వైపు చూస్తున్నాడు. ఈ రెండింటి సంకల్పం ఒక్కటే—మబ్బులు కరిగి వర్షం కురవాలి, ఎండిన నేల తడవాలి, పంటలు సమృద్ధిగా పండాలి, రైతు బాగుపడాలి. తెలంగాణ పల్లెల్లో పచ్చని పైరులు హాయిగా గాలికి ఊగాలి. కృష్ణా, గోదావరి నదులు జీవజలాలతో ప్రవహించాలి. నిండిన ధాన్యపు రాశులతో రైతు ఇంట్లో లక్ష్మీదేవి తాండ వించాలి. “పాడిపంటలతో పల్లెలు తుల తూగాలి” అన్న తెలుగువారి కల నెర వేరాలి. నిశ్చయంగా, సాగర్ తీరాన జరుగనున్న ఈ మహా వరుణ యాగం కేవలం ఒక క్రతువు మాత్రమే కాదు; వర్షం, నేల, నీరు, రైతు ఉనికి పరస్పరం ఎలా ముడిపడి ఉన్నాయో చాటిచెప్పే సామూహిక చైతన్య వేదిక. యాగం ద్వారా వ్యక్తమయ్యే భావన, వాన నీటిని పరిరక్షించే కార్యాచరణగా మారినప్పుడే నాగార్జున సాగర తీరం నుంచి వెలువడే ఈ వేద ప్రార్థన సార్థకమవుతుంది, పచ్చని తెలంగాణకు సువర్ణ బాటలు వేస్తుంది.





