సింగరేణి భూగర్భ గనుల ప్రైవేటీకరణ అవాస్తవం

– యాజమాన్యం స్ప‌ష్టీక‌ర‌ణ‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2 : సింగరేణి భూగర్భ బొగ్గు గనులను ప్రైవేటుపరం చేస్తున్నట్లు వస్తున్న వార్తలను సంస్థ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ప్రైవేటీకరణ ప్రతిపాదన ఏదీ లేదని, ఇవన్నీ పూర్తిగా అవాస్తవాలని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. బాధ్యతాయుతమైన ప్రభుత్వ రంగ సంస్థగా, మైనింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన సింగరేణి ప్రస్తుతం 21 భూగర్భ గనులు, 17 ఓపెన్‌కాస్ట్ గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. తెలంగాణతోపాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు బొగ్గును సరఫరా చేస్తూ దేశ ఇంధన భద్రతకు, పారిశ్రామిక అభివృద్ధికి నిరంతరం తోడ్పడుతున్నట్లు వెల్లడించింది. తెలంగాణ ప్రాంతంలో ఉపాధి కల్పన, ఉద్యోగ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆర్థికంగా నష్టాల్లో ఉన్నప్పటికీ భూగర్భ గనుల నిర్వహణను కొనసాగిస్తున్నట్లు సింగరేణి యాజమాన్యం వెల్లడించింది. గనులను మూసివేయడం గానీ, ప్రైవేటుపరం చేయడం గానీ కాకుండా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి నష్టాలను తగ్గించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది. శాంతిఖని గనికి సంబంధించి ఈఓఐ  ప్రక్రియపై వివరిస్తూ నిర్వహణ వ్యయం తగ్గించేందుకు మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ విధానంపై పైలట్ అధ్యయనం కోసం మాత్రమే ప్రకటన ఇచ్చామని తెలిపింది. అయితే దీనికి సరైన స్పందన లభించకపోవడంతో ఆ ప్రతిపాదనను పూర్తిగా విరమించుకున్నామని, దీని ఆధారంగా దుష్ప్రచారం చేయడం సరికాదని సీపీఆర్వో తెలిపారు. ఉద్యోగులు, వారి కుటుంబాలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *